సుబ్రహ్మణ్య స్వామి బాబును టార్గెట్ చేశారా?
భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అంటే తెలియని రాజకీయ నాయకుడు ఉండరంటే అతిశయోక్తి కాదు. న్యాయ పోరాటాల్లో ఆరితేరిపోయిన సుబ్రహ్మణ్య స్వామి ఇప్పటి వరకు ఢిల్లీ రాజకీయాలపైనే దృష్టి పెట్టేవాడు. అయితే ఇప్పుడు ఏపీ రాజకీయాలపై కూడా ఆయన దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. తాజాగా ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారు. దీంతో టీడీపీ ఒక్కసారిగా కలవరపడినట్లుగా కనిపిస్తోంది. ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రంపై టీడీపీ ప్రభుత్వం గుత్తాధిపత్యం కొనసాగిస్తోందని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించడంతో ఒక్కసారిగా టీడీపీ అప్రమత్తమైంది. ఆలయ భూములపై టీడీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో టీడీపీ ప్రభుత్వం తన వైఖరి మార్చుకోని పక్షంలో తాను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు. సుబ్రహ్మణ్య స్వామి చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. సుబ్రహ్మణ్య స్వామితో కోర్టులో ఢీకొట్టడం కష్టం కావడంతో ఆయన్ను రాజకీయంగా ఎదుర్కొనాలని టీడీపీ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సుబ్రహ్మణ్య స్వామి చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం వెనుక ఆయన వ్యక్తిగత కారణాలేమీ కనిపించడం లేదు.
విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ప్రోద్బలంలో ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. స్వరూపానందేంద్ర రీసెంటుగా స్వామితో భేటీ అయ్యారు. గో హత్య రామజన్మభూమి – దేవాలయ భూముల పరిరక్షణ – గంగా ప్రక్షాళన అంశాలపై వారు చర్చించారు. కాగా ఏపీలో దేవాలయ భూములు – సత్రం భూములు కబ్జాకు గురవుతున్నాయని ఆ భూములను అమ్మేస్తూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని… సుబ్రహ్మణ్య స్వామి జోక్యం చేసుకుంటేనే అలాంటి విషయాల్లో ప్రభుత్వానికి అడ్డుకట్ట పడుతుందని స్వరూపానందేంద్ర కోరడంతో ఆయన అంగీకరించినట్లుగా తెలుస్తోంది. సదావర్తి సత్రం భూముల వ్యవహారం నేపథ్యంలో ఈ రగడ రేగినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో సుబ్రహ్మణ్య స్వామి ఎలా స్పందిస్తారో చూడాలి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.