హోదాకోసం గడ్డం తీసిన రాఘవేంద్రరావు
* 40 ఏళ్లుగా పెంచుకున్న గడ్డం స్వామివారికి సమర్పణ
* హోదాకోసం పోరాటంలో సినీపరిశ్రమ మద్దతు ఉంటుంది
* తెలుగు వాళ్లకు కష్టం వచ్చిన ప్రతిసారీ అండగా నిలబడింది
* శ్రీవారి దర్శనానంతరం మీడియాతో ప్రముఖ దర్శకులు కె.రాఘవేంద్రరావు
డెక్కన్ అబ్రాడ్: ఒక్కో దర్శకుడికి ఒక్కో స్టైల్ ఉంటుంది. కోడిరామకృష్ణ తలకు కర్చీప్ కట్టుకుంటే.. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు గడ్డంలో దర్శనమిస్తారు. వాళ్లు కొన్ని ఏళ్లుగా ఇలా ప్రజలకు కనిపిస్తూ వస్తున్నారు. అయితే కె.రాఘువేంద్రరావు మాత్రం ఉన్నట్లుండి గడ్డం తీసి కనిపించారు. ఎందుకు? ఏమిటి? అనే వివరాల్లోకి వెళ్దాం. ఈ రోజు ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రాఘవేంద్రరావు గడ్డం లేకుండా కనిపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా పోరాటంలో సినీపరిశ్రమ మద్దతు ఉంటుందని అన్నారు. హోదా కోసం నిరసన తెలుపుతూ గత 40 ఏళ్లుగా పెంచుకున్న గడ్డాన్ని స్వామివారికి సమర్పించినట్లు తెలిపారు. గతంలో మోదీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని, తెలుగువారికి ఏ కష్టం వచ్చినా టాలీవుడ్ అండగా నిలబడుతుందని పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీలో ఎలాంటి విపత్తులు వచ్చినా.. తెలుగు చలనచిత్ర పరిశ్రమ సహాయం అందిస్తుందన్నారు.
హుద్ హుద్ తుఫాన్ సమయంలో బాధితుల కోసం రూ.12 కోట్ల విరాళాలను టాలీవుడ్ సేకరించిందన్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ విరాళాలకు సీఎం మరో రూ.12 కోట్లు కలిపి బాధితుల కోసం కాలనీ నిర్మించమని తమకే అప్పగించారని తెలియజేశారు. చిత్ర పరిశ్రమ అన్నింట్లో ముందుంటుందని, గతం మరచి తమపై ఆరోపణలు చేయడం తగదని వ్యాఖ్యానించారు. స్వామివారి దర్శనానంతరం పండితులు ఆశీర్వచనాలతోపాటు తీర్థప్రసాదాలు అందజేశారు. ఏది ఏమైనా ప్రత్యేక హోదా కోసం ఒక్కొక్కరు ఒక్కో విధంగా నిరసన తెలుపుతుండడం విశేషం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.