పాపం.. కెప్టెన్!
తమిళనాట విజయ్ కాంత్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఏదో సాధిస్తామని ఎన్నికల్లోకి వచ్చిన కెప్టెన్‌కు భంగపాటు తప్పలేదు. కింగ్ మేకర్ కాదు కింగ్‌నే అవుతానని చెప్పుకుని తిరిగిన కెప్టెన్ తానే గెలవక పోవడం విజయ్‌కాంత్‌తో పాటు ఆ పార్టీ సభ్యులకు సైతం బాధకలిగించే విషయం. సొంతంగా అధికారంలోకి వచ్చేద్దామని.. ముఖ్యమంత్రి అయిపోదామని విజయ్‌కాంత్ చిన్నా చితకా పార్టీల్ని కూడగట్టి ఓ కూటమి ఏర్పాటు చేశాడు. ఐతే ఆయన పార్టీ అభ్యర్థులకు ఓట్లయితే వచ్చాయి కానీ.. సీట్లు రాలేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేయడం వల్ల డీఎంకేకు గండి పడింది. జయకు లాభం చేకూరింది. మొత్తానికి తాను మునిగి.. డీఎంకేను కూడా ముంచేశాడు కెప్టెన్. గత పర్యాయం జయకు మిత్రుడిగా ఉండి ఆమె అధికారంలోకి రావడానికి సాయపడ్డ విజయ్ కాంత్.. ఈసారి శత్రువుగా మారి ఆమెకు సాయపడ్డాడు. కాబట్టి అమ్మ కెప్టెన్ కు రుణపడి ఉండాలి.
కెప్టెన్ స్వయంకృతాపరాధమే అతని కొంపముంచిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైగోతో జటకట్టడంతో పాటు ఎక్కడ సభలు, సమావేశాలు ఏర్పాటు చేసినా అక్కడో ఏదో ఒక కాంట్రివర్సీతో వార్తల్లో నిలిచాడు. ఎన్నికల ముందు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిసి కూడా విజయ్‌కాంత్ తప్పు చేశాడు. విలేకరులతో గొడవలు పడ్డారు. కొంతమందిపై చేయికూడా చేసుకున్నాడు. ఇలాంటి తప్పులకు మూల్యం చెల్లించుకోక తప్పలేదు. చివరకు తానే ఓడిపోవడానికి అవన్నీ కారణమయ్యారని రాజకీయ విశ్లేషకుల భావన. ఏది ఏమైనా తన ఓటమికి తనే కారణమని చెంపలేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.