ప్రజల వద్దకు పార్టీలు
ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల మూడు వచ్చేసిందా అనే అనుమానం కలుగుతోంది. అధికార పార్టీ టీడీపీ, ప్రతిపక్ష పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ లు ప్రజల వద్దకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. ఒక్కరోజు తేడాతో ప్రభుత్వ, ప్రతిపక్ష కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 7వ తేదీ నుంచి ప్రభుత్వం ఇంటింటి సర్వే(స్మార్ట్ పల్స్ సర్వే) చేపడుతుండగా ఆ మరునాడు అంటే 8వ తేదీ నుంచి ప్రతిపక్షం చేపట్టనున్న గడప గడపకూ వైసీపీ కార్యక్రమం ప్రారంభం కానుంది.
ప్రభుత్వం నిర్వహించే సర్వే కార్యక్రమం సందర్భంగా ప్రతి ఇంటికీ కరపత్రాల ద్వారా ప్రభుత్వం చేపట్టిన పథకాలు, సాధించిన విజయాలను వివరించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత, కరపత్రాలు రావాల్సి ఉందని వెల్లడిస్తున్నారు. కరపత్రాల పంపిణీ లేకపోయినా సర్వే సందర్భంగా రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా లేని వారు, ఫించను అందని వారు, రుణమాఫీ వర్తించని వారు సర్వే బృందానికి వివరాలు వెల్లడిస్తే వారి అభ్యర్థనను పరిశీలించి అర్హులైన వారికి న్యాయం చేసే అవకాశం ఉండటంతో సర్వే కార్యక్రమం రాజకీయంగా అధికార పార్టీకి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అలాగే స్వచ్ఛ భారత్ పథకంలో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్లు లేని వారు కూడా సర్వే సందర్భంగా ఎన్యుమరేటర్ల దృష్టికి తీసుకువస్తే అనుమతులు మంజూరు చేసే అవకాశం ఉంటుందన్నారు.
భూ సమస్యలు, పట్టాదారు పాసు పుస్తకాలు అందని వారు ఇతర రెవెన్యూ సమస్యలు కూడా ఆన్లైన్లో ప్రభుత్వానికి చేరుతాయని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఇదే సమయంలో ప్రతిపక్ష వైకాపా నేతలు కూడా ప్రభుత్వ వైఫల్యాలు, అధికారంలో ఉంటూ అవినీతికి పాల్పడుతున్న వివరాలతో పాటు ఆయా ప్రాంతాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణిపై కరపత్రాల ద్వారా గడప గడపకూ వెళ్లి ప్రజలకు వివరించేందుకు సిద్ధమయ్యారు. పార్టీకి చెందిన సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకూ గడప గడపకూ వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నారు. ప్రధానంగా రైతు రుణమాఫీ, పింఛన్లు, పక్కాగృహ వసతి కల్పించకపోవడం, రాజధాని నగర నిర్మాణం వంటి అనేక అంశాలపైనే కాకుండా సిఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ అధికారం చెలాయిస్తూ అవినీతికి పాల్పడుతున్న వివరాలను కరపత్రాల్లో పొందుపరచినట్లు ఆపార్టీ నేతలు పేర్కొంటున్నారు.ఏది ఏమైనా రెండు పార్టీల లక్ష్యం ఒక్కటే. ప్రజలకు దగ్గరకావడం.. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.