Loading...
You are here:  Home  >  Community Events  >  Awareness  >  Current Article

Dr. Reddy from KMC on Pandemic Corona-virus COVID 19

By   /  April 9, 2020  /  No Comments

    Print       Email
DR.C.PRABHAKARA REDDY

*An Anesthetist.*

ఇవాళ పొద్దున జర్నలిస్ట్ ఒక అనస్థీసియా డాక్టరుతో మాట్లాడటం చూశాను. మొత్తానికి జర్నలిస్ట్ ఏమడుగుతున్నాడంటే ఆపరేషన్ థియేటర్లలో మత్తు మందు ఇచ్చే మీకు మాస్కుల అవసరం ఏంటి?. అని. అంతకుమించి ఏ పని చేయని మీకు మాస్కులు అవసరమే లేదు అనే తీరుగా మాట్లాడుతున్నాడు. పైగా మీరు ఆపరేషన్ థియేటర్ లో ఏం చేస్తారు ?. ఇప్పుడు చెప్పండి!. అని అడగటం కూడా మొదలు పెట్టాడు. వాళ్ళిద్దరికీ జన్మవైరం ఏదైనా ఉంటే ఉండనీ గానీ‌, అనెస్థీషియా ఇచ్చే డాక్టరుకు ఏమీ పనే ఉండదు అనేలా మాట్లాడే ఆ జర్నలిస్ట్ గారికి అనెస్థీషియా అంటే ఏమిటో ఆ డాక్టర్లు ఏమి చేస్తారో అణువంత కూడా అవగాహన లేదని స్పష్టం అవుతోంది. ఆ జర్నలిస్ట్ ని పక్కకి పెడితే అసలు అనెస్థీషియా డాక్టర్ లు చేసే పనిని తెలపడం నా ధర్మమనిపించి ఈ రాత రాస్తున్నాను.

InCorpTaxAct
Suvidha

ఏదో మత్తుమందు ఒక సూదిలో ఇచ్చి పక్కన కూర్చోవడం కాదు అనెస్థీషియా అంటే. ఒక పేషంట్ కి ఆపరేషన్ చేయాలి అని సర్జన్ డిసైడ్ చేసిన మరుక్షణమే అనెస్థెటిస్ట్ పని మొదలౌతుంది. అసలు ప్రతీ ఆపరేషన్ చేయబోయే పేషంట్ నీ అనెస్థీటిస్ట్ చెక్ చేయడం ఉంటుంది. దాన్ని PAC అంటారు. Pre anesthetic consultation. అంటే అసలు ఆ పేషంట్ ఆపరేషన్ చేసేందుకు ఆరోగ్య పరంగా అర్హుడేనా అనేది చూస్తారు. శరీరంలోని గుండే ఊపిరితిత్తులు కిడ్నీలు వంటి అన్ని రకాల వ్యవస్థలు సరిగా పని చేస్తున్నాయా లేదా అనేది చెక్ చేసుకుని అవసరం అనుకుంటే concerned doctor తో ఒపీనియన్ కూడా తీసుకుంటారు. అంతా బాగుందనుకుంటేనే సర్జరీ చేసుకోవచ్చని fit for surgery అని రాస్తాడు అనెస్థెటిస్ట్. అంటే సర్జరీ జరగాలంటే ముందు అనెస్థీషియా డాక్టరు ఒప్పుకోవాల్సిందే. అంతేకాకుండా ఆ పేషంట్ కి ఎలాంటి మత్తు మందు ఇవ్వాలి ఏ విధానంలో ఇవ్వాలి ఎంత డోసులో ఇవ్వాలి ఇత్యాదివన్నీ చూసేది అనెస్థెటిస్ట్.

ఆపరేషన్ చేసేటపుడు పేషంట్ బీపీ పల్స్ ఆక్సిజన్ శాతం అన్నీ కూడా మానిటర్ చేసేది అనెస్థెటిస్ట్. ప్రతీ నిముష నిముషం బీపీని చెక్ చేయడం జరుగుతుంది. ఆపరేషన్ చేస్తున్నపుడు పేషంట్ బీపీ పడిపోతున్నా, పల్స్ పడిపోతున్నా ఎప్పటికప్పుడు అలర్ట్ అయి వాటిని తిరిగి కంట్రోల్ లోకి తెచ్చుకుంటూ సకల ఎమర్జెన్సీ మందులతో రెడీగా ఉంటూ సర్జరీ సక్సెస్ కావడానికి దోహదపడతాడు. సర్జన్ నిరంతరాయంగా సర్జరీ చేయాలంటే అనెస్థెటిస్ట్ పక్కన ప్రతీ విషయాన్నీ సక్రమంగా మానిటర్ చేస్తూ నడపాల్సి ఉంటుంది. సర్జరీ చేసేటపుడు పేషంట్ కార్డియాక్ అరెస్ట్ ఐతే…సెకన్లలో అతడి ప్రాణాలను కాపాడగలిగేవాడే అనెస్థెటిస్ట్.

అంతే కాకుండా ఏ పేషంట్ కి సీరియస్ గా ఉన్నా మొదట చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి. ABCs అంటారు. Airway , Breathing, circulation. అంటే ఇపుడు అకస్మాత్తుగా ఒక పేషంట్ నిలబడుకున్నవాడు నిలబడుకున్నట్లే కుప్పకూలాడనుకుందాం. అతడిని బతికించాలంటే మన ఊపిరితిత్తుల లోకి గాలి పోవాలి‌, అతడి రక్త సరఫరా ఆగకూడదు. ఈ రెంటినీ సెకన్లలో అమర్చగలిగే వాడు అనెస్థెటిస్ట్. ఊపిరితిత్తుల లోకి డైరెక్ట్ గా గాలి పోవాలంటే గొంతు ద్వారా గొట్టం వేయాల్సి ఉంటుంది..endotracheal tube అంటారు. మామూలుగా డాక్టర్లు ఈ ట్యూబ్ వేయడంలో కష్ట పడవలసి ఉంటుంది. గొంతు చిన్నగా లావుగా ఉన్న వ్యక్తులలో మరింత కష్టపడవలసి ఉంటుంది. ఎంత కష్టమైతే అంత లేట్ అవుతుంది. ఎంత లేట్ అవుతే అంత బతికే అవకాశాలు తగ్గిపోతాయి. అటువంటి సమయాల్లో ప్రతీ ఒక్క క్షణమూ విలువైనదే. మామూలుగా డాక్టర్లు ముప్పై సెకన్లనుంచి ఒక నిమిషం లోపల గొట్టం వేయగలిగితే ఒక అనెస్థెటిస్ట్ పది సెకన్ల లోపలే వేయగలడు. అంత పర్ఫెక్షన్ ఉంటుంది. ఆ తరువాత దానిని వెంటిలేటర్ కి అనుసంధానం చేసి ఏయే పేషంట్ కి ఏ రకమైన వెంటిలేటర్ సెట్టింగులు పెట్టాలి అనేది కూడా అనెస్థెటిస్టే నిర్ణయించి ఆ సెట్టింగులను అమరుస్తాడు.

అనెస్థెటిస్ట్ లు కొంత కోపంగా దురుసుగా ఉన్నట్టు అరుస్తూ ఉన్నట్టు కనబడతారు. కానీ వాళ్ళు పర్ఫెక్షనిస్టులు. ముఖ్యంగా పేషంట్ ప్రాణాలు కోల్పోతున్న సమయంలో వాళ్ళ దురుసుతనమే వాళ్ళ వేగాన్ని పర్ఫెక్షన్ ని తెలుపుతుంది. ఆసుపత్రులలో ఎవరైనా ఒక పేషంట్ సడన్ గా కొలాప్స్ ఐతే ఒక టీం ఆఫ్ డాక్టర్లు పరిగెత్తుతూ వస్తుంటారు. ఒక అనెస్థెటిస్ట్ ఒక పల్మోనాలజిస్టు‌, ఒక కార్డియాలజిస్టు, ఒక ఇంటర్నల్ మెడిసిన్ డాక్టరూ, ఓ ఇద్దరు ముగ్గురు సిస్టర్లూ మొదలైనవారు. ఆ సమయంలో పేషంట్ ని కాపాడటానికి అవసరమైన అన్ని మందులూ‌ వెంటిలేటర్లూ మానిటర్లూ డీఫిబ్రిలేటర్లూ అన్నీ క్షణాల్లో అక్కడికి వచ్చేస్తాయి. కానీ ఇంత టీంని లీడ్ చేసేది మాత్రం అనెస్థెటిస్ట్. ఎవరి పనులను వాళ్ళకు పురమాయిస్తూ తన పని తాను చేసుకుపోతూ ఉంటాడు. గొంతులోకీ గొట్టం వేయడం ద్వారా AIRWAY ని, గొంతు రక్తనాళాల్లోకి పైపు వేయడం ద్వారా BLOOD CIRCULATION ని డాక్టర్ల గ్రిప్ లోకి తెచ్చుకోవడం మొదటి మెట్టు. దానిని మొట్టమొదట సెకన్ల వ్యవధిలో సాధించగలిగేవాడే అనెస్థెటిస్ట్. ఇంత ప్రాసెస్ లో ఒక టీం లీడర్ గా అప్పటికప్పుడు ఆ వాతావరణాన్ని మొత్తం గ్రిప్ లో పెట్టుకుంటాడు. ఇదంతా స్పాంటేనియస్ గా సహజంగా చేయగలగటమే అతడి ప్రతిభ. అతడు అలర్ట్గా పర్ఫెక్ట్ గా ఉండటమే కాక చుట్టూ ఉన్నవారిలో కూడా అంతే అలర్ట్ నీ పర్ఫెక్షన్ నీ డిమాండ్ చేస్తాడు. బయటివాళ్ళకు అది అరోగాన్సీ లాగా కనిపిస్తుంది. కానీ తోటి డాక్టర్లకు అది పర్ఫెక్షన్ లాగా కనిపిస్తుంది. ఒక్కోసారి ఈ చుట్టు ఉన్న స్టాఫ్ లో ఈ పర్ఫెక్షన్ కనపడకపోతే తిట్టడం కోపగించుకోవడమూ ఉంటుంది. ఐతే అది వ్యక్తి మీద కోపం కాదు…పేషంట్ ని బతికించుకోవడంలోని ఆత్రుత. ఆ సమయంలో అనెస్థెటిస్ట్ అక్కడ ఉండటం ఆ పేషంట్ చేసుకున్న అదృష్టంగా కూడా మారుతుంటుంది ఒక్కోసారి.

కోవిడ్ వంటి జబ్బు తీవ్ర దశకు చేరేకొద్దీ వెంటిలేటర్స్ మీద పేషంట్ కి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అతి ఎక్కువగా వైరస్ లు ఒక వ్యక్తినుంచి మరొక వ్యక్తికి పాకేది ఇలా గొంతులోకి గొట్టం వేస్తున్నపుడే. పేషంట్ oral cavity లోకి డైరెక్ట్ గా ముఖం పెట్టాల్సి ఉంటుంది అనెస్థెటిస్ట్. కాబట్టి హాస్పిటల్ లో అడ్మిట్ ఐన పేషంట్లనుంచి డాక్టర్లకు వైరస్ పాకేది ఉంటే అతి ఎక్కువ రిస్క్ ఉన్నది అనెస్థెటిస్ట్ లకే.

ఏ హాస్పిటల్ పర్ఫెక్ట్ గా నడవాలన్నా ఇరవైనాలుగు గంటలు అనెస్థెటిస్ట్ సర్వీసులు అవసరం. అనెస్థెటిస్ట్ లేని హాస్పిటల్ లలో ఎమర్జెన్సీ కేసులు తీసుకునే అవకాశమే ఉండదు. అలా వైద్య రంగానికి పిల్లర్ వంటి ఒక అనెస్థెటిస్ట్ ని అవమానిస్తూ…నీకేమి పని ఉండదు అనే అర్థం వచ్చేలా ఒక జర్నలిస్ట్ మాట్లాడటం అంటే అది ఆ ఒక వ్యక్తినే కాదు అనెస్థీషియా అనే గొప్ప వైద్య విధానాన్నే అవమానించినట్టు. దానికి క్షమాపణ చెప్పాలని మనం కోరుకోవడంలో అర్థం కూడా ఉండదు…!. కానీ ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎందరో అనెస్థెటిస్ట్ లు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎందరెందరి జీవితాల్నో బాగు చెస్తున్నారు. వాళ్ళందరి సేవలూ ఆ జర్నలిస్ట్ కు తెలియకపోయినా పెద్ద నష్టమేమీ లేదు. కానీ సామాన్యులకు ఇవన్నీ తెలియాలని నా ప్రయత్నం.

విరించి విరివింటి.

DR.C.PRABHAKARA REDDY,
PROF&HOD CTVS,KMC,KURNOOL

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →