మరోసారి టర్కీలో బాంబుపేలుడు..
మరోసారి టర్కీ బాంబు పేలుడుతో దద్దరిల్లింది. సిరియా సరిహద్దులో ఉన్న గజియంటెప్ నగరంలో ఓ పెళ్లి వేడుకపై ఆత్మాహుతి దాడి జరిపారు. ఈ ఘటనలో 30 మంది మృతిచెందారు. మరో 94 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వేడుకలో జరిగిన దాడిని గజియంటెప్ గవర్నర్ అలి యెర్లికయ ధ్రువీకరించారు. ఈ దాడి హేయమైన చర్య అని ఆయన అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వదిలిపెట్టేది లేదన్నారు.
ఇది ఇస్లామిక్ ఉగ్రవాదుల పనా లేక కుర్దిష్ ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఆత్మాహుతి దాడికే ఎక్కువ అవకాశం ఉందని అధికార జస్టిస్ అండ్ డవలప్మెంట్ పార్టీ నేత మెహ్మట్ ఎర్గోగన్ అన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఇది ఇస్లామిక్ స్టేట్ దుశ్చర్యగా తెలుస్తోందన్నారు. దాడి జరిగిన ప్రాంతంలో కుర్దిష్ ప్రజలు ఎక్కువగా నివాసం ఉంటున్నారని అధికారుల సమాచారం. టర్కీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకే ఈ దాడి జరిగిందన్నారు. టర్కీ ప్రభుత్వం ఇలాంటి దాడులను ఉపేక్షించదని డిప్యూటీ పీఎం మెహ్మట్ సిమ్సెక్ తేల్చిచెప్పారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.