వైసీపీలోకి కన్నా?
ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్‌కు 10 ఏళ్లు ప్రత్యేక ఇస్తామని చెప్పిన ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రసక్తే ఎత్తడం లేదు. తాజాగా హోదా ఇచ్చే పరిస్థితి లేదని కేంద్రమంత్రులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి చెందిన బీజేపీ నాయకుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. తమ పార్టీని సమర్థించుకోలేక.. హోదాను ఇవ్వమని చెప్పలేక సతమతమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో ఉంటే తమ భవిష్యత్‌కు అంధకారమే అని గ్రహించిన పలువురు నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. అలా చూస్తున్న వారిలో మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ ఒకరు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ రాజకీయాలలో చక్రం తిప్పిన కన్నా మొన్నటి ఎన్నికల సందర్భంగా కమలం గూటికి చేరారు. ఇప్పుడు అక్కడ కూడా పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో ఆయన చూపు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై పడింది. తెలుగుదేశం అధినేతతో కన్నాకి ఉన్న విరోధం అందరికీ తెలిసిందే. దానికితోడు టీడీపీలోనే ఉన్న రాయపాటి తోనూ కన్నాకి సఖ్యత ఉండేది కాదు. అయినప్పటికీ కాంగ్రెస్ లో కాబట్టి చెల్లిపోయింది. మిగిలిన చోట్ల అలాంటి పరిస్థితులు సాధ్యం కాదు కాబట్టి కన్నా సైకిల్ సవారీకి అసలు అవకాశమే లేదు. ఇక మిగిలింది వైయస్ఆర్సీపీ.
ఆపార్టీ అధినేత జగన్ తో కన్నా లక్ష్మీనారాయణకు కొంత మంచి సంబంధాలున్నాయి. అయినప్పటికీ బీజేపీలో చేరడం అప్పట్లో ఆశ్చర్యం కలిగించింది. కానీ కావూరి వంటి వారితో పోలిస్తే కన్నాకు కేంధ్రంలో అధికారంలో ఉన్న పార్టీతో పెద్దగా ప్రయోజనం ఉండదు. ఆయనకు ఇతర రకాలుగా కూడా కమలం వల్ల ప్రయోజనం కనిపించడం లేదు. కాబట్టి ఆపార్టీలో ఉండడానికి ఆయన తీవ్రంగా సతమతమవుతున్నట్టు కన్నా అనుచరులే చెబుతున్నారు. ఈ విషయాన్ని బీజేపీ నేతలు కూడా గ్రహించారు. అయితే ఇప్పుడే బీజేపీ నుంచి ఎవరైనా జారిపోవడం మొదలయితే పరిస్థితి తీవ్రంగా ఉండే అవకాశం ఉందన్న అంచనాతో అధికారపార్టీ నేతలు రంగంలో దిగారు. ఏపీ మంత్రి మాణిక్యాలరావు స్వయంగా కన్నా ఇంటికి వెళ్లి బుజ్జగించారు. త్వరలో కాపు ఉద్యమం కూడా రాజుకుంటే కన్నా లక్ష్మీనారాయణకు అధికారపార్టీ కంటే ప్రతిపక్షమే శ్రేయస్కరం. అందుకే ఆయన అటు చూస్తున్నట్లు సమాచారం.
మరోవైపు కన్నా మాత్రం జగన్ అనుచరులతో నిత్యం టచ్ లో ఉంటున్నట్టు సమాచారం. ముఖ్యంగా తన మాజీ సహచరులతో ఆయన సంబంధాలు నెరుపుతున్నట్టు చెబుతున్నారు. తొలుత పెదకూరపాడు నుంచి ఆతర్వాత గుంటూరు వెస్ట్ నుంచి ప్రాతినిథ్యం వహించిన ఆయనకు వచ్చే ఎన్నికల నాటికి సీటు విషయంలో స్పష్టత వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. గతంలో గుంటూరు వెస్ట్ నుంచి మోదుగల చేతిలో ఓడిపోయిన లేళ్ల అప్పిరెడ్డి తో పోలిస్తే కన్నా బలమైన క్యాండిడేట్ అని భావిస్తే గుంటూరులోనూ..లేకుంటే మరోచోటనయినా కన్నాకు సీటు విషయంలో పెద్ద ఇబ్బంది ఉండదంటున్నారు. దాంతో ఇక కన్నా జంపింగ్ ఖాయమనే చెప్పవచ్చు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.