ఆరుగురు ఏకగ్రీవమే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నలుగురు, తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు మొత్తం ఆరుగురు రాజ్యసభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీ నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు, మాజీ మంత్రి టీజీ వెంకటేష్, సుజనా చౌదరి కాగా, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయసాయిరెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి, శాసనసభ కార్యదర్శి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అధికార పార్టీ టీఆర్ఎస్కు చెందిన కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరికి రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజాసదారాం ధ్రువపత్రాలు అందజేశారు. రాజ్యసభకు ఎన్నికైన సందర్భంగా పలువురు వారి సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు.కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని ఆంధ్రప్రదేశ్ అభివృధ్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. తనకు మద్దతు ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు.
టీజీ వెంకటేష్, సుజనాచౌదరిలు కూడా మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సహా ఇతర హామీల అమలుకు తాము కృషి చేస్తామన్నారు. పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ సమస్యలను ఏకరువు పెట్టి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. వివిధ రాష్ట్రాల్లో తెలుగువారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. అనంతరం తమకు రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించినందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలుతెలిపారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.