ఫ్రాన్స్‌లో నర మేధం
బాస్టిల్ డే సంబరాల్లో అంతా మునిగితేలుతున్నారు… ఆట పాటలతో సందడి చేస్తున్నారు. మరో సంగీత ప్రదర్శన చూసేందుకు అంతా సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో ఓ నర హంతకుడు మనుషుల మీద ఏదో ద్వేషం ఉన్నట్టు.. కడుపునిండా కసి ఉన్నట్టు.. 25 టన్నుల బరువైన ట్రక్కులో 50 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చాడు. వాహనాన్ని అడ్డదిడ్డంగా నడుపుతూ దాదాపు 100 మంది చావుకు కారణమయ్యాడు. చివరకు అతన్ని పోలీసులు కాల్చి చంపారు. కాగా ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారో వారి మాటల్లోనే “బాస్టిల్ డే సందర్భంగా బీచ్‌లో నిర్వహిస్తున్న బాణసంచా ప్రదర్శన అప్పుడే ముగిసింది. 1000-1500 మంది అక్కడ కూర్చుని అప్పటిదాకా ఆ ప్రదర్శనను తిలకించారు. మరికొద్ది క్షణాల్లో మొదలుకానున్న సంగీత ప్రదర్శన చూసేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో.. వారి మీదికి దూసుకొచ్చిందో ట్రక్కు. తెల్లగా ఉన్నదా ట్రక్కు. డ్రైవింగ్ సీట్లో గడ్డంతో ఉన్న మహ్మద్ లహోయెజ్ బౌహ్లెల్ (31) అనే వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఉన్నట్లుండి తన వాహనాన్ని50 కిలోమీటర్ల వేగంతో నడుపుతూ అక్కడ కూర్చున్నవారి మీదకు పోనిచ్చాడు. ఎంత ఎక్కువమందిని వీలైతే అంత ఎక్కువమందిని చంపడమే లక్ష్యంగా.. అంత భారీ ట్రక్కునూ జిగ్‌జాగ్‌గా నడపడం ప్రారంభించాడు.
దీంతో అక్కడున్నవారంతా కకావికలమయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు.. కనిపించిన దిక్కుకేసి పరుగులు తీశారు. కొందరు దురదృష్టవంతులు మాత్రం.. అయినవారు కళ్లముందే.. వారు చూస్తూ ఉండగానే ఆ మృత్యుశకటానికి బలైపోయారు. ట్రక్కు తాకగానే గడ్డిబొమ్మల్లా ఎగిరిపడ్డారు. కొందరు చక్రాల కింద పడి నలిగి నుజ్జునుజ్జయిపోయారు. దాదాపు 2 కిలోమీటర్ల మేర ఆ నరహంతకుడు ఈ వేట కొనసాగించాడు. అతడు వెళ్లిన దారంతా శవాలు. తలలు పగిలి.. మెదళ్లు ఛిద్రమైన మృతదేహాలు! చిన్నపిల్లల మృతదేహాల పక్కనే పడి ఉన్న బొమ్మలు!! కొందరేమో కాళ్లూచేతులూ విరిగి కొన ఊపిరితో కొట్టుకుంటున్నారు. తమను కాపాడాలంటూ హృదయవిదారకంగా రోదించారు.“ అని చెప్పుకొచ్చారు ప్రత్యక్ష సాక్షులు. కాగా ఫ్రాన్స్‌లో జరిగిన ఈ నరమేధాన్ని ప్రపంచ దేశాలు అన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. తీవ్రవాదాన్ని అందరం కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చాయి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.