సురాజ్య స్థాపనే లక్ష్యం కావాలి: ప్రధాని మోదీ
భారత ప్రజలు అనుభవిస్తున్న స్వాతంత్య్రం వెనుక ఎందరో మహానుభావుల త్యాగం ఉందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముక్కలు ముక్కలుగా ఉన్న భారత్ ను సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఒక్కటిగా చేశారని అన్నారు. మహాపరుషుల త్యాగ ఫలితమైన దేశాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. దేశాన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్ళేందుకు అందరూ సంకల్పించుకోవాలని పిలుపునిచ్చారు.
సురాజ్యం ఏర్పడాలంటే త్యాగాలు తప్పనిసరి అని మోదీ అన్నారు. అదే మన నిరంతర సంకల్పం కావాలన్నారు. సామాన్యుల జీవితంలో మార్పులు వస్తేనే సురాజ్యం ఏర్పాటు అయినట్లు అని అభిప్రాయపడ్డారు. రెండేళ్ళకాలంగా తమ సర్కారు చేపట్టిన కార్యక్రమాల గురించి చెప్పడం మొదలుపెడితే సమయం సరిపోదని తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించుకుని జీవనంలో మార్పులు తీసుకురావాలన్నారు. ఆరోగ్యం, పౌర సేవల్లో టెక్నాలజీని మరింతగా జోడించాలని సూచించారు. 70 ఏట మనం చేస్తున్న సంకల్పంతో దేశాన్ని రూపాంతరీకరణ చేయాలననారు. తమ ప్రభుత్వ పథకాల్లో పారదర్శకత పాటించడం కోసమే ఆన్ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. దీనివల్ల రాయితీలు నేరుగా లబ్ధిదారులకు చేరుతాయన్నారు. గతంలో ఒక్క పాస్ పోర్ట్ కే నాలుగైదు నెలలు పట్టేదని గుర్తుచేశారు. ఇప్పుడు కేవలం నాలుగు రోజుల్లో పనిజరుగుతోందన్నారు. ఇలా చేయడం కోసం చట్టంలో ఎలాంటి మార్పులు చేయలేదని..కేవలం పనివిధానాన్ని మాత్రమే మార్చామన్నారు. ప్రస్తుత కాలంలో ప్రణాళికలతో లెక్కలు చెబితే జనం నమ్మరని అన్నారు. అందరికి జరిగిన పని కనబడితేనే నమ్ముతారని చెప్పారు.
మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇవే..
*రెండేళ్లలో 70 కోట్ల మంది ప్రజలను ఆధార్‌తో అనుసంధానం.. 21 కోట్ల మందిని జన్ ధన్ యోజనతో అనుసంధానం..
* సోలార్, విండ్ పవర్ రంగాల్లో భారీ అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నాం.
* రెండేళ్లలో 18వేలకు పైగా గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాం.
* రూ.350 విలువగల ఎల్ఈడీ బల్బును రూ.50కే అందించేలా కృషి చేశాం. దేశవ్యాప్తంగా 77 కోట్ల ఎల్ ఈడీ బల్పుల ఏర్పాటుకు సంకల్పం.. ఎల్ ఈడీ బల్పులతో రూ. లక్షా ఇరవైఐదు వేల కోట్ల మేర విద్యుత్ ఆదా..
* ఖతార్‌తో గ్యాస్ సరఫరా ఒప్పందాన్ని పునఃసమీక్షించాం.. దీనివల్ల రూ.20వేల కోట్లు ఆదా అయింది.
* తక్కువ కాలంలోనే 70వేల గ్రామాల్లో రెండు కోట్ల మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టాం.
* గత ప్రభుత్వ కాలంలో ద్రవ్యోల్బణం 10శాతం దాటింది. తమ ప్రభుత్వ హయాంలో 6 శాతానికి మించకుడా చర్యలు తీసుకుంటున్నాం.
* పప్పు ధాన్యాల ఉత్పాదకత తగ్గింది. అయినా ధరలు పెరగకుండా తమ సర్కారు చర్యలు తీసుకుంది.
* 18 అసంతపూర్తి ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తి చేస్తున్నాం. గత పాలకులు పలు ప్రాజెక్టులకు పునాదులు వేసి వదిలిపెట్టారు. వాటిని తమ ప్రభుత్వం పూర్తి చేయబోతోంది.
* అభివృద్ధి అట్టడుగువర్గాల వారికి చేరాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.