చిత్రం-గాలి మేడలు(1962)
MUSIC : TG Lingappa
Lyricist : Samudrala Jr.
Singers : Ghantasala, Renuka
****
ఈ మూగ చూపేలా బావా మాటాడగానే రావా
ఓ.. హో.. మాటాడవదే బొమ్మా నీ దరి నే చేరి మాటాడనా
ఈ మూగ చూపేలా బావా మాటాడగానే రావా
ఓ.. హో.. మాటాడదే బొమ్మా
రెప్పెయ్యకుండా ఒకే తీరున నువ్వు చూస్తే నాకేదో సిగ్గౌతది
ఓ.. హో.. హో… హో … ఓఓఓఓ
రెప్పెయ్యకుండా ఒకే తీరున నువ్వు చూస్తే నాకేదో సిగ్గౌతది
ఈ సిగ్గు ఈ ఎగ్గు ఎన్నాళ్ళులే … ఈ సిగ్గు ఈ ఎగ్గు ఎన్నాళ్ళులే
చెయ్యి చేయీ చేరా విడిపోవులే
ఈ మూగ చూపేలా బావా మాటాడగానే రావా
ఓ.. హో.. మాటాడదే బొమ్మా
చల్లగ నీ చేయి నన్నంటితే చటుకున నా మేను ఝల్లంటది
ఆ.హా.. హా…హా… ఆఆఆఆ
చల్లగ నీ చేయి నన్నంటితే చటుకున నా మేను ఝల్లంటది
నా ముందు నిలుచుండి నువ్వు నవ్వితే ..
నా ముందు నిలుచుండి నువ్వు నవ్వితే
నా మనసే అదోలాగ జిల్లంటదే…
ఈ మూగ చూపేలా బావా మాటాడగానే రావా
ఓ.. హో.. మాటాడదే బొమ్మా
జాగ్రత్త బావా చెయీ గాజులు ఇవే కన్న చిన్నారి తొలి మోజులూ …
ఓ.. హో.. హో… హో … ఓఓఓఓ
జాగ్రత్త బావా చెయీ గాజులు ఇవే కన్న చిన్నారి తొలి మోజులూ
చాటే నీ ఎలుగెత్తి ఈ గాజులే చాటే నీ ఎలుగెత్తి ఈ గాజులే
ఈ వేళా మరేవేళా మన రోజులే ….
ఈ మూగ చూపేలా బావా మాటాడగానే రావా
ఓ.. హో.. మాటాడదీ బొమ్మా
***
విశేషం-ఘంటసాలతో ఈ పాట పాడిన రేణుక గారు అలనాటి తమిళ నేపధ్య గాయని. బహుశా:ఆమె తెలుగులో పాడింది ఈ ఒక్క పాటేనేమో! ఆమె ఘంటసాల గారితో పోటీగా, హుషారుగా పాడింది ఈ పాటను. మా చిన్నప్పుడు రోజుకొకసారైనా ఈ పాట రేడియోలో వినిపించేది . రేణుక గారు నేటి తమిళ,తెలుగు సినీ,శాస్త్రీయ సంగీత కళాకారిణి శ్రీమతి అనూరాధ శ్రీ రాం గారి తల్లి. ఇదే పాటను ఆమె ‘పాడుతా తీయగా ‘ కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం గారితో కలసి అద్భుతంగా పాడింది.
ఆ లింకు —https://www.youtube.com/watch?v=UfZ90a4PJv8
*****
*****
సముద్రాల జూనియర్
సముద్రాల జూనియర్ గా ప్రసిద్ధి చెందిన తెలుగు సినిమా రచయిత సముద్రాల రామానుజాచార్య. ఈయన తండ్రి సముద్రాల రాఘవాచార్య కూడా ప్రఖ్యాత సినీ రచయిత. వీరిది పండితవంశం. వీరి స్వస్థలం గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పెదపులివర్రు
గ్రామం. 1923 వ సంవత్సరం లో జన్మించాడు. 1985 మే 31న కాలం చేశారు.రాఘవాచార్యులుగారు ‘ప్రజామిత్ర’ పత్రికలో పనిచెయ్యడానికి మద్రాసుకి మకాం మార్చడంతో, రామానుజం కూడా మద్రాసు చేరి, జార్జ్టవున్ లోని హైస్కూల్లో చదివాడు. ఉన్నత పాఠశాల చదువులో ఉండగానే, అతను రాసిన పద్యాలు, గేయాలూ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ‘సముద్రుడు’ పేరుతో ‘ప్రజాబంధు’లో రాసేవాడు. అభ్యాసం, అధ్యయనం రెండూ సవ్యసాచిలా నిర్వహిస్తూ రామానుజం బి.ఎస్సి.కి వచ్చాడు. ఆ వేళకి పెద్ద సముద్రాలవారు సినిమాలకి వచ్చేశాడు. ఐతే, తనలాగా తనయుడికీ సినిమా ఉత్సాహం రాకూడదనీ, పెద్ద ఇంజనీరు కావాలనీ
ఆయన ఆశించారు తండ్రి బాటలోనే సాగుతూ సినీరంగంలో స్థిరపడాలని రామానుజాచార్య చిన్ననాటనే నిర్ణయానికొచ్చారు.రామానుజం దృష్టి సౌండ్ ఇంజనీరింగ్ మీదికి వెళ్లింది. రేడియో సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్ కోర్సు చదివి 1946లో డిప్లొమా పుచ్చుకున్నారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా చదవాలనుకున్నారు గాని, ఆ ఊహ ఇంకోదారి చూపించింది. కొడుకు ఉత్సాహం చూసి, రాఘవాచార్యులు గారు అతన్ని వాహిని స్టూడియో శబ్దగ్రహణ శాఖలో చేర్పించారు. నేటి ప్రసిద్ధ దర్శకుడు, నటుడు- కె.విశ్వనాథ్ కూడా అప్పుడు ఆ శాఖలో ఉండేవారు. ఇద్దరిలోనూ శక్తి సామర్థ్యాలుండడంతో చేరిన తొమ్మిది నెలల్లోనే ‘రికార్డిస్టు’లు అయ్యారు. ఎ.కృష్ణయ్యర్ మాకు పెద్ద గురువు అని చెప్పేవాడు రామనుజాచార్య. స్టూడియోలో ఉండడం వల్ల సినిమా చిత్రీకరణ, కథనాలూ అవగాహన అయ్యాయి అతనికి. సినిమా రచనలో తండ్రిగారికి సహాయపడడం కూడా అలవాటు చేసుకున్నాడు. కృష్ణయ్యర్ , ఇంకో ఇంజనీరు శ్రీనివాస రాఘవన్ రామానుజంలో ఉన్న సాహిత్యానుభవం చూసి, ఇలా రికార్డింగ్లు చేసుకుంటూ ఉండడం కంటే, రచన చేపట్టు- రాణిస్తావు అని ప్రోత్సహించారు. శబ్దగ్రహణ శాఖలో రాణించి, ఇంజనీర్ కావాలని రామానుజం కోరిక. నీకున్న ప్రజ్ఞే గనక నాకుంటే, నేను శబ్దగ్రహణ శాఖ విడిచిపెట్టి రచయితని అయ్యేవాడిని అని కృష్ణయ్యర్, రెండు మూడేళ్ళు రచయితగా పని చెయ్యి, సక్సెస్ కాలేదనుకో మళ్ళీ మన శాఖకి రా, నేను ఉద్యోగం ఇస్తాను అని శ్రీనివాసరాఘవన్- రామానుజాన్ని ఉక్కిరి బిక్కిరి చేశారు. తండ్రిగారికీ అంత ఇష్టం లేకపోయినా ఇతరుల ఆకాంక్షలకి తల ఒగ్గి, రామానుజం సినిమా రచన చెయ్యడానికి ఉద్యమించాడు. నీ రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. నీ ఇష్టం! అన్నారు తండ్రిగారు. దాంతో ఆయన రచయితగానే ప్రవేశించాడు. వినోదావారు ‘శాంతి’ (1952) సినిమా మొదలు పెడుతూ రామానుజం చేత పాటలు రాయించారు. తర్వాత ‘అమ్మలక్కలు’ (1953)లోనూ,
‘బ్రతుకు తెరువు’ (1953)లోనూ పాటలు రాశాడు.“బ్రతుకుతెరువు” సినిమా జూనియర్ సముద్రాలకు బతుకు తెరువు చూపించి, పాటల రచయితగా పరిశ్రమలో నిలదొక్కుకునేలా చేసింది. ఆ సినిమాలోని “అందమె ఆనందం…..ఆనందమె జీవిత మకరందం…..” ఆయన కలం నుంచి జాలువారిందే.యన్.టి.రామారావుకి- రామానుజం రికార్డిస్టుగా ఉన్నప్పట్నుంచీ తెలుసు. ఆయన సాహిత్యాభిలాష
తెలుసు. పాటలు రాస్తున్న విషయమూ తెలుసు. అంచేత తను ప్రారంభిస్తున్న ‘తోడు దొంగలు’ (1954)కు రచన చెయ్యమని అడిగి ఆ సినిమాకి రాయించారు. అది రామానుజం మాటలు రాసిన తొలి సినిమా. దర్శకత్వ శాఖలో కూడా పనిచెయ్యాలని, ఆయన ఎన్.ఎ.టి.లో సెట్సు మీద కూడా పనిచేశాడు. రామానుజం రెండో సినిమా ‘జయసింహ’ (1955) జయ పతాకం ఎగరవేసినప్పట్నుంచి, రామానుజం ‘సముద్రాల జూనియర్’ గా మారి సంభాషణలు రాయడం మీదనే దృష్టి సారించాడు. ‘పాండురంగ మహాత్మ్యం’ (1957), ‘మంచి మనసుకి మంచి రోజులు’ (1958), ‘శాంతి నివాసం’ (1960), ‘ఆత్మ బంధువు’ (1962), ‘ఉమ్మడి కుటుంబం’ (1967) ‘స్త్రీ జన్మ’ (1967), ‘తల్లా? పెళ్లామా?’ (1970), ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’ (1975) లాంటి 70 చిత్రాలకు పైగా రచన చేశాడు జూనియర్ సముద్రాల.
(సేకరణ)
టీవీయస్.శాస్త్రి
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.