న్యూ యార్క్ అక్టోబర్ 6: అమెరికాలో అమరగాయకుడికి అరుదైన గౌరవం దక్కింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ , తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం టీఎల్ సీఏ సంయుక్తంగా న్యూయార్క్ లో ఘంటసాల పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. తెలుగు ప్రజల గుండెల్లో చిరంజీవిగా నిలిచిపోయిన ఘంటసాల పోస్టల్ స్టాంపు విడుదల చేయడం ఎంతో గర్వంగా ఉందని నాట్స్ ఛైర్మన్ మధు కొర్రపాటి అన్నారు. తెలుగు పాట బతికున్నంత కాలం ఘంటసాల బతికే ఉంటారని న్యూజేర్సీ ప్రజా అవసరాల శాఖ కమిషనర్ ఉపేంద్ర చివుకుల అన్నారు. ప్రముఖ వైద్యులు నోరి దత్తాత్రేయుడు, పైళ్ల మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఘంటసాలకు సంబంధించిన స రి గ మ ప ద ని పుస్తకాలను కూడా ఆవిష్కరించారు. ప్రతి వీధికి ఘంటసాలను తయారుచేయాలనే సంకల్పంతో కృషి చేస్తున్న ఘంటసాల వీరాభిమాని స రి గ మ ప ద ని కళాశాలల వ్యవస్థాపకుడు శరత్ చంద్ర గానమృతం అందరిని అలరించింది. ఘంటసాల మధురగీతాలను శరత్ చంద్ర ఆలపించారు. ప్రముఖ గాయకుడు ఎస్.పి బాలసుబ్రమణ్యం అమెరికాలో ఘంటసాలకు పోస్టల్ స్టాంప్ విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సందేశాన్ని ఆయన ఈ కార్యక్రమానికి పంపించారు. ప్రముఖ వైద్యులు గురవారెడ్డి, వరప్రసాద రెడ్డి, ఘంటసాల సావిత్రి, గజల్ శ్రీనివాస్ లు కూడా తమ వీడియో సందేశాల ద్వారా ఘంటసాల పోస్టల్ స్టాంప్ విడుదలపై తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.. నాట్స్, టీఎల్ సీఏ నిర్వహించిన ఘంటసాల గానవిభావరిలో పలు తెలుగు కుటుంబాలు హాజరై శరత్ చంద్ర ఆలపించిన ఘంటసాల పద్యాలు, పాటల్లో మునిగితేలాయి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.