Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Birthday wishes to legend Ghantasala

By   /  December 4, 2018  /  No Comments

    Print       Email

maxresdefault(నేడు ఘంటసాల గారి జన్మదినం!ఆ సందర్భంగా ఆ మహనీయుని గురించి గతంలో నేను వ్రాసిన ఈ వ్యాసం ఒక పత్రికలో ప్రచురించబడింది!అదే వ్యాసాన్ని మరలా మీ కోసం ఈ దిగువన పొందుపరుస్తున్నాను!)

గాయకులు చాలామంది ఉంటారు.కానీ గంధర్వ గాయకులు శతాబ్దానికి ఒక్కరో ఇద్దరో జన్మిస్తారు.నేటి తరానికి శ్రీ బాలసుబ్రహ్మణ్యం గంధర్వ గాయకుడైతే, నాటికి,నేటికీ, ఎప్పటికీ గంధర్వ గాయకుడు శ్రీఘంటసాల.ఘంటసాల అనే పదాన్ని తెలుగు నిఘంటువులో చేర్చి దానికి అర్ధంగా ‘బాగా పాటలు పాడేవాడు’ అని చెప్పుకోవచ్చు. ఎన్నో మధురమైన గీతాలను పాడి తెలుగు వారి హృదయాలలో చిరస్థాయిగానిలిచిపోయిన అమర గాయకుడు శ్రీ ఘంటసాల.

InCorpTaxAct
Suvidha

ఆ మహనీయుని గురించిన కొన్ని విషయాలను తెలుసుకుందాం!ఘంటసాల 04-12-1922న కృష్ణా జిల్లాలోని చౌటుపల్లి అనే కుగ్రామంలో జన్మించారు.తండ్రిపేరు సూరయ్య గారు.ఆయన స్వతహాగా మంచి గాయకుడు. ఆయన శ్రీ నారాయణతీర్థులవారి తరంగాలను చక్కగా,వినసొంపుగా పాడేవారు. అంతే కాకుండా, వారికి మృదంగ వాయిద్యంలో కూడా మంచిప్రవేశముంది.ఘంటసాల గారికి వారి తండ్రే మొదటి సంగీత ఉపాధ్యాయుడు.ఘంటసాల పాటలు పాడటంతో పాటుగా,నృత్యం కూడా చేసేవారు. శ్రీ తీర్థుల వారి తరంగాలను పాడటంలో తండ్రికి సహాయకుడిగాకూడా ఉండేవారు.అలా పాటలు పాడుతూ,నృత్యాన్ని అభినయించే ఘంటసాలను అందరూ ‘బాల భరతుడు’ అని పిలిచేవారు. సూరయ్య గారికి సంగీతం తప్ప వేరే ప్రపంచం తెలియదు.కుటుంబ బాధ్యతలనుసరిగ్గా నిర్వర్తించలేకపొయారు. దురదృష్ట వశాత్తు ఘంటసాల గారి 11 వ ఏటనే తండ్రి సూరయ్య గారు మరణించారు.కుటుంబం దిక్కుతోచని పరిస్థితులలో,ఘంటసాల మేనమామ గారైన శ్రీ ర్యాలిపిచ్చిరామయ్య గారి నీడకు చేరారు.ఘంటసాలకు సంగీతమంటే ప్రాణం.

12341508_10205495370598804_4961416116225153015_nఈ పరిస్థితులలో సంగీతాన్ని నేర్చుకోవటానికి ఆయనకు అవకాశాలు మృగ్యం.ఒకానొక సందర్భంలో ఘంటసాల గారు సంగీత కచేరీచేస్తున్న సమయంలో,కొద్దిమంది ఆయన సంగీత పరిజ్ఞానాన్ని హేళన చేసారు.ఆ హేళనును ఆయనొక సవాల్ గా స్వీకరించి,సంగీతంలో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించటానికి కృతనిశ్చయులయ్యారు.ఆరోజుల్లో సంగీతాన్ని అభ్యసించటానికి ఒక్క విజయనగరం తప్ప మిగిలిన ప్రదేశాలలో అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.అదీగాక, విజయనగరానికి వెళ్లి సంగీతాన్ని నేర్చుకోవటానికి వారి కుటుంబపరిస్థితులు కూడా అనుకూలంగా లేవు.చేతికున్న బంగారు ఉంగరాన్ని అమ్మి,సంగీతాన్ని నేర్చుకోవటానికి విజయనగరానికి పయనమయ్యారు.ఆయన విజయనగరం చేరుకునేటప్పటికి,అక్కడి సంగీతకళాశాలకు సెలవులు ప్రకటించారు.అలా కొద్ది కాలం విజయనగరంలో ఇబ్బందులు పడ్డారు. కళాశాల తెరిచిన తరువాత అందులో ఘంటసాలకు ప్రవేశం దొరికింది.అయితే వీరు మొదట్లో వాయిద్య సంగీతాన్నినేర్చుకున్నారు.

కళాశాలలో సాలూరు గ్రామానికి చెందిన శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారు వీరికి సంగీతాన్ని నేర్పిన అధ్యాపకులు (వారి కుమారుడయిన శ్రీ సంగీతరావు గారు తరువాతి కాలంలోఘంటసాలకు సినిమాలలో సహాయకుడిగా పనిచేసారు. అంతేకాకుండా,శ్రీ సంగీతరావు గారు వెంపటి చిన సత్యం గారి నాట్య బృందంలో కూడా సంగీత సహకారాన్ని అందించారు.) ఆ రోజుల్లో విజయనగరంలోనిసంగీత కళాశాలకు శ్రీ ద్వారం వెంకటస్వామినాయుడు గారు ప్రిన్సిపాల్ గా ఉండేవారు.ఘంటసాల గారి గాన మాధుర్యాన్ని,గొంతులో పలికే చక్కని సంగతులను గుర్తించి, శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడుగారు ఘంటసాల గారిని గాత్ర సంగీత తరగుతులలో చేర్పించారు.విజయనగరంలో వారాలు చేసుకొని సంగీత విద్యను అభ్యసించారు ఘంటసాల.ఘంటసాల ఎంత గొప్పస్థితికి చేరుకున్నా తనను ఆదరించినవారిని మరువలేదు. ఆయన ఎన్నడూ మరొకరిని నొప్పించేవాడుకాదు. కోరినవారికి కాదనక సహాయంచేసేవాడు.”నాడు ఏతల్లి మొదటి కబళం నా జోలెలో వేసిందో ఆమె ఆ వాత్సల్యపూరితమైన భిక్ష నాకుఅష్టైశ్వర్యాలతో కూడిన భవిష్యత్తును ప్రసాదించింది ” అని ఎన్నోసార్లు చెప్పేవాడు. ఆ తరువాత,లక్ష్మీనరసమ్మ గారనే మహా ఇల్లాలు,గాయని,హరికథా కళాకారిణి, gramophone రికార్డింగ్కళాకారిణి,ఘంటసాలలోని తృష్ణను, ప్రతిభను గుర్తించి ప్రోత్సహించింది. ఈ విషయాన్ని ఆయన జీవితాంతం గుర్తుంచుకున్నారు.సంగీత శిక్షణను పూర్తిచేసుకొని,డిగ్రీని చేతబట్టుకొని ఇంటికి చేరారు.

వివాహవేడుకల్లో,పండుగ పర్వదినాల్లో, శ్రీరామనవమి పందిళ్ళలో సంగీత కచేరీలు చేసేవారు. కుటుంబం గడవటం కష్టంగా ఉండటం వలన నాటకాలలో వేషాలు వేసేవారు.అవి స్వాతంత్ర్య పోరాట దినాలు. 1942 లోక్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించారు.పెదపులివర్రు గ్రామానికి చెందిన సావిత్రి గారితో వీరికి 1944 మార్చి 4న వివాహం జరిగింది.సావిత్రి గారు ఘంటసాలగారి మేనకోడలే!విశేషమేమంటే ,ఆయన వివాహానికి ఆయనే సంగీత కచేరీ చెయ్యటం. ఆ వివాహాని నాటి ప్రఖ్యాత సినీ రచయిత శ్రీ సముద్రాల రాఘవాచార్యులుగారు విచ్చేసి,వధూవరులను ఆశీర్వదించి,ఘంటసాల గానానికిమంత్రముఘ్ధులై వారిని మద్రాస్ కు రమ్మన్నారు.ఘంటసాల గారు మొదట్లో H.M.V సంస్థ వారికి ప్రైవేటు గీతాలను పాడేవారు.ఆ రోజుల్లో ఆ కంపెనీకి శ్రీ పేకేటి శివరాం గారు ముఖ్య అధికారిగా ఉండేవారు.ఘంటసాల గారిని వెన్నుతట్టి ప్రోత్సహించిన మరో మహానుభావుడు శ్రీ పేకేటి. మద్రాస్ ఆకాశవాణిలో శాస్త్రీయ సంగీత కార్యక్రమాలలో పాల్గొన్నారు. సముద్రాల వారి ప్రోత్సాహంతో 1944 లో పాటలకు కోరుస్ గాపాడేవారు.సముద్రాల ఘంటసాలను రేణుకా ఫిలింస్ కు తీసుకెళ్ళి చిత్తూరు నాగయ్య,  బి.ఎన్.రెడ్డిల ముందు పాటకచేరీ చేయించాడు. వారిరువురు ఘంటసాల పాటవిని అవకాశాలు ఉన్నపుడుఇస్తామన్నారు.సముద్రాలవారి ఇల్లు చాలాచిన్నది కావడంతో ఆయనకు ఇబ్బంది కలిగించడం ఇష్టంలేక ఘంటసాల తన మకాంను పానగల్ పార్కు వాచ్‌ మన్‌ కు నెలకు రెండురూపాయలు చెల్లించే పద్ధతిపైఅక్కడకు మార్చాడు.

పగలంతా అవకాశాలకోసం వెతికి రాత్రికి పార్కులో నిద్రించేవాడు.తమ సినిమా అయిన స్వర్గసీమలో మొదటిసారి నేపథ్యగాయకుడిగా అవకాశాన్ని ఇచ్చారు. భానుమతి పక్కనభయపడుతూ ఘంటసాల పాడుతుంటే భానుమతి,    నాగయ్యలు ధైర్యం చెప్పేవారు. ఆపాటకు ఆయనకు 116 రూపాయల పారితోషికం లభించింది.తర్వాత భానుమతి, రామకృష్ణలుతీసిన రత్నమాల చిత్రానికి సహాయ సంగీత దర్శకునిగా పనిచేసే అవకాశం వచ్చింది. తర్వాత బాలరాజు వంటి హిట్ చిత్రాలకు కూడా సంగీత దర్శకత్వం వహించాడు.నాగయ్య గారి త్యాగయ్యలో ఒక ప్రాధాన్యతలేని చిన్న వేషంలో కనిపించారు. అలానే నాగయ్య గారి యోగి వేమనలో ఒక నృత్య సన్నివేశానికి సంబంధించి నట్టువాంగం నిర్వహించారు.అలనాటి ప్రముఖ నటీమణి శ్రీమతి కృష్ణవేణి గారు ఘంటసాలలోనిప్రతిభను గుర్తించి,ఆమె నిర్మించిన ‘మనదేశం'(1949) చిత్రానికి సంగీత దర్శకునిగా తీసుకున్నారు. శ్రీ నందమూరి రామారావు గారు కూడా ఇదే సినిమాలో మొదటిసారిగా నటించారు.1949 లో విడుదలైన’కీలుగుఱ్ఱం’ సినిమాకి కూడా ఘంటసాలే సంగీతాన్ని సమకూర్చారు. అలా గాయకునిగా,సంగీత దర్శకునిగా ఆయన జైత్రయాత్ర ప్రారంభమైంది.1951 లో విడుదలైన విజయావారి పాతాళభైరవి చిత్రంతోఘంటసాల పేరు ఆంద్ర దేశమంతా మార్మోగింది.దేవదాసు,చిరంజీవులు,అనార్కలి,సువర్ణసుందరి,మల్లీశ్వరి, లవకుశ,జయసింహ,పాండురంగ మహాత్మ్యం,శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం,నర్తనశాల,జగదేకవీరునికథ,రహస్యం …..లాంటి అనేక చిత్రాలలో అతి మధురంగా పాడి తన ప్రతిభను చాటుకున్నారు.ఇలా చెప్పుకుంటూ పొతే ఈ జాబితాకి అంతే  ఉండదు.

నాటి అగ్రశ్రేణి కథానాయకులకు ఘంటసాల గారు తనగాత్రాన్ని అరువు ఇచ్చి,వారి నటనకు మరింత ప్రాచుర్యం తెచ్చారు .రామారావు,నాగేశ్వరరావు గార్లకు ఘంటసాల గారు ఆరవప్రాణం అని చెప్పవచ్చు. మొదట్లో ఘంటసాల గారు వరుసలు కూర్చిన పాటలుపక్కా శాస్త్రీయ పద్ధతిలో ఉన్నాయి. ఆ తరువాత నెమ్మదిగా లలిత లలితంగా తనదైన బాణిలో పాటలకు సంగీతాన్ని సమకూర్చారు.అయితే ఆయన ఒక్క త్యాగారాజ కృతిని కూడా సినిమాల్లో పాడకపోవటంఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశా నిర్మాతలకు,దర్శకులకు ఆయనచేత ఆ కృతులను పాడించే అవకాశం దొరకలేదేమో అయితే ఘంటసాల గారు తన తృష్ణను అమెరికా పర్యటనలో ఉండగా’మరుగేలరారాఘవా!’ అనే త్యాగరాజ కృతిని పాడి తీర్చుకున్నారు.ఘంటసాల గాయకుడు,సంగీత దర్శకుడు మాత్రమే కాదు,చక్కని రచయిత కూడా!

స్వీయ రచనలో ఆయన పాడిన ప్రైవేటు గీతం ‘బహుదూరపుబాటసారి’ విపరీతమైన ప్రజాదరణ పొందటమే కాకుండా నేటికీ సంగీత ప్రియులను అలరిస్తుంది.అమెరికా పర్యటను విజయవంతంగా ముగించుకొని వచ్చిన తరువాత తన అనుభవాలను’భువన విజయం’పేరిట ఒక గ్రంధంగా వెలువరించారు. సముద్రాల గారికి అతి సన్నిహితుడైన శ్రీ మల్లాది రామకృష్ణశాస్త్రి గారితో వీరికి కూడా సాన్నిహిత్యం ఉండేది.నాటకాల పద్యాల వరవడికి అలవాటుపడ్డ తెలుగు ప్రజలకు,తనపద్య గానంతో ఆకట్టుకున్నారు ఘంటసాల .లవకుశ,పాండవ వనవాసం,నర్తనశాల మొదలైన సినిమాలలో ఆయన పాడిన పద్యాలు ఆయా పాత్రలు పోషించిన వ్యక్తుల పాత్రలను elevate చేసాయనటంలోఏమాత్రం అతిశయోక్తి లేదు! కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పుష్పవిలాపం,కుంతీ కుమారి … మొదలైన గీతాలను పాడి వాటికి  ప్రాణం పోసారు. అలాగే శ్రీ జాషువా గారు వ్రాసిన శిశువు(పాపాయి) అనేగీతాన్ని భావగర్భితంగా పాడి సంగీత సాహిత్యప్రియులను ఓలలాడించారు. అమ్మా సరోజినీ దేవీ,భారతీయుల,చైనా యుద్ధంలాంటి ప్రబోధగీతాలను పాడారు.సింతసిగురు సిన్నదానా లాంటి జానపదగీతాలనుకూడా చక్కగా పాడారు. వీరికి వెంకటేశ్వరస్వామి వారంటే విపరీతమైన భక్తి.వెంకటేశ్వరస్వామి వారి మీద అనేక ప్రైవేటు గీతాలను పాడటమే కాకుండా,శ్రీ వెంకటేశ్వరరమహాత్మ్యం సినిమాలో ‘శేష శైలావాస శ్రీవెంకటేశ ‘ అనే పాట పాడే సన్నివేశంలో నటించారు కూడా!

వీరికి బడేగులాం ఆలీఖాన్ గారు అన్నా,ఆయన సంగీతమన్నా ప్రాణం. బడేగులాం ఆలీఖాన్ గారు మద్రాస్ కు వచ్చినప్పుడల్లా సపరివారంగాఘంటసాల వారి ఇంటనే విడిది చేసేవారు.బడేగులాం ఆలీఖాన్ గారు ఘంటసాల శ్రీమతి గారిని ‘బడే బహూ’ అని పిలిచేవారు.1969 లో మధుమేహ వ్యాధికి గురై తరచుగా అనారోగ్యం పాలయ్యేవారు.1972లోరవీంద్రభారతిలో కచేరీ చేస్తున్న సమయంలో గుండె నొప్పి అనిపించి హాస్పిటల్ లో చేరారు. ఆయన చిరకాల కోరిక భగవద్గీతను గానం చెయ్యటం! ఆఖరి క్షణాల్లో ఆయన పాడిన ఏకైక స్టీరియో రికార్డు భగవద్గీత.భగవద్గీతను మైమరచి,భావయుక్తంగా అందరికీ ఒక దృశ్యకావ్యంగా ఉండే విధంగా పాడి తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. భగవద్గీతను పాడిన తరువాత ఆయన సినిమా పాటలుపాడలేదనుకుంటాను.

1973లో భక్త తుకారాం, జీవన తరంగాలు, దేవుడు చేసిన మనుషులు మొదలైన సినిమాల్లో  పాటలు పాడారు. 1974 లో ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది.11-02-1974 న యావదాంధ్రప్రజలను శోకసముద్రంలో ముంచి ఆయన అమరలోకానికేగారు.ఆయన మరణానంతరం పలుచోట్ల ఆయన శిలా విగ్రహాలను స్థాపించి తెలుగువారు ఆయనను నిత్యం స్మరించుకుంటున్నారు. ఆయనభగవద్గీత ప్రతి దేవాలయంలోనూ, ఆస్తిక మహాశయుల ఇళ్ళలోనూ నిత్యం వినబడుతుంది. ఈటీవీ వారి పాడుతా తీయగా కార్యక్రమంలో నేటికి కూడా చిన్నారి పిల్లలు ఘంటసాల గారి పాటలు పాడుతూమనల్ని అలరిస్తున్నారు. ఘంటసాలకు మరణం లేదు,ఆయన చిరంజీవి !

ఆ గంధర్వ గాయకునికి నా కళాంజలి!స్మృత్యంజలి!!

Courtesy: టీవీయస్.శాస్త్రి

1499603_1381816042085892_1565440850_n

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Prayer to protect from Corona Virus

Read More →