
చిత్రం –ఆత్మబలం (1964)
సంగీతం–KV మహాదేవన్
గానం-ఘంటసాల, P.సుశీల
రచన-ఆత్రేయ
******
విశేషాలు–ఆత్మబలం, 1964లో విడుదలైన తెలుగు సినిమా. జగపతి పిక్చర్స్ పతాకంపై విడుదలైన ప్రతిష్టాత్మక చిత్రాలలో ఇది ఒకటి. ఇందులో “చిటపట చినుకులు పడుతూ ఉంటే” అనే పాట చరణం తెలుగునాట చాలా మందికి పరిచయమైనది.నిర్మాతగా వి.బి. రాజేంద్రప్రసాద్ కు ఇది రెండో విజయం. తనకు అండదండ, వెన్నూదన్నూ అనుకున్న ప్రధాన భాగస్వామి పర్వతనేని రంగారావు హఠాత్తుగా కాలం చేశారు. దాంతో మిగిలిన భాగస్వాములు కూడా ఎవరి దారిన వాళ్లు ళ్లిపోయారు.ఇప్పుడు వి.బి.రాజేంద్రప్రసాద్ ఒంటరి. తన వాళ్లనుకున్నవాళ్లెవరూ అండగా లేరు. అయితే ఊరు తిరిగి వెళ్లిపోవాలి. లేకపోతే ఒంటరిగా సినీ సముద్రాన్ని ఈదాలి.వి.బి.రాజేంద్రప్రసాద్ మొండివాడు. చావో రేవో ఇక్కడే తేల్చుకోవాలనుకున్నాడు. గుండెల నిండా త్మవిశ్వాసం నింపుకున్నాడు. మళ్లీ సినిమా
మొదలుపెట్టాలి. ఉన్నపళంగా కథ కావాలి.అప్పట్లో తెలుగు సినిమా వాళ్లందరికీ కలకత్తానే పెద్ద అడ్డా. బోలెడన్ని బెంగాలీ సినిమాలు. తెలుగు ప్రేక్షకులకు నచ్చే ఉద్వేగాలు వాటిల్లో పుష్కలం. వి.బి.రాజేంద్రప్రసాద్ కూడా కలకత్తా ప్రయాణం కట్టాడు. అప్పుడు అక్కడ ఉత్తమ్‌కుమార్ నటించిన ‘అగ్ని సంస్కార’ సినిమా ఆడుతోంది. ఈయనకు బాగా నచ్చేసింది. అప్పటికప్పుడు నిర్మాతను కలిసి హక్కులు కొనేశారు. ప్రింట్ తీసుకుని మద్రాసులో దిగారు.ఇప్పుడు దీన్ని అక్కినేనికి చూపించాలి. ఆయన చూడ్డానికి కొంచెం టైం పట్టింది. కానీ చూడగానే ‘ఓకే’ అనేశారాయన. ఇంకేముంది… ‘ఆత్మబలం’ సినిమా ప్రారంభం. వి.మధుసూదనరావు దర్శకుడు. కేవీ మహదేవన్ సంగీతం. సి.నాగేశ్వర్రావు ఛాయాగ్రహణం. ఆత్రేయ మాటలూ పాటలూ. ప్రధాన నాయికగాబి.సరోజాదేవిని ఎంచుకున్నారు. జగ్గయ్య, కన్నాంబ, రేలంగి, రమణారెడ్డి, గిరిజ, సూర్యకాంతం… ఇలా హేమాహేమీలను మిగిలిన పాత్రలకు ఎన్నుకున్నారు. చిత్ర తారాగణం ఎంపికైన తర్వాత పిడుగు లాంటి వార్త వినవలసి వచ్చించి. అదేమంటే ‘అక్కినేని మద్రాసు వదిలిపెట్టి హైదరాబాద్ వెళ్లిపోతున్నారు. ఇక ఏ నిర్మాత అయినా అక్కడకు వెళ్లి సినిమా తీయాల్సిందే’. దాంతో వి.బి.రాజేంద్రప్రసాద్ కూడా హైదరాబాద్‌కు పయనమయ్యారు. మొదట పాటల తయారీ మొదలైంది. స్వరాల కోసం కె. వి. మహదేవన్, ఆత్రేయ, మధుసూదనరావు, వి.బి.రాజేంద్రప్రసాద్… నలుగురూ బెంగళూరు వెళ్లారు. బృందావన్ హోటల్లో బస. కె. వి. మహదేవన్ కు కథ చెబితే ‘‘ఇందులో పాటలు పెట్టడం కష్టం. సిట్యుయేషన్స్ కుదరవు’’ అనేశారు. అప్పటికాయన సుప్రసిద్ద సంగీత దర్శకుడు. ‘ఆంధ్రపత్రిక’ ఎడిటోరియల్ ఇచ్చినా ట్యూన్ కట్టేస్తాడని ప్రతీతి. అలాంటాయనే ఇందులో సిట్యుయేషన్ కుదరదన్నాడంటే?.. వి.మధుసూదనరావుకి గుండెల్లో రాయి పడింది. రాత్రంతా ఆలోచించి సిట్యుయేషన్స్ ఎంచుకున్నారు. పొద్దున్నే మహదేవన్ కు చెబితే ఓకే అన్నారు. మనసుకవి ఆత్రేయ కూడా పాటలు రాయడానికి సిద్దం అయిపోయారు.ఈ సినిమాలోని అన్ని పాటలు బాగుంటాయి.
ఈ పాట ప్రత్యేకత— అత్రేయ పాటలన్నీ అర్ధవంతంగా ,సామాన్య జనం పాడుకునేలా ఉంటాయి. ఇదొక ప్రణయ గీతం.ఇందులో సైతం ఆయన ఒక గొప్ప సందేశాన్ని సరళమైన భాషలో ఇమిడించారు. పాట మొత్తం గొప్పదే.ఉదాహరణగా ఒక వాక్యాన్ని చెబుతాను! కుర్రకారు కోరికలు గుర్రాలవంటివి,కళ్ళాలు వదిలితే కదం తొక్కుతాయి,పట్టు తప్పినంతనే పరువే తీస్తాయి,ఒళ్ళు దగ్గరుంచుకుంటే మంచిదబ్బాయీ….నిజంగానే కుర్రకారు- కోరికలను కళ్ళం వేసి ఆపుకోవాలి! కళ్ళాలు కనుక వదిలితే ఒక్కొక్కసారి ‘పరువే’ తీస్తాయి!ఇక్కడ పరువు అంటే మర్యాద అని అర్ధం కూడా చెప్పుకోవచ్చు!అందుకని ఒళ్ళు దగ్గరుంచుకుంటే మంచిదని చక్కగా చెప్పాడు ఆత్రేయ. ఆత్రేయకు స్మృత్యంజలి!
****
గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి
నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి
గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి
నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయీ
బుల్లి కారున్న షోకిలా అబ్బాయి
నీ పోజుల్లో ఉన్నది భలే బడాయి
బుల్లి కారున్న షోకిలా అబ్బాయి
నీ పోజుల్లో ఉన్నది భలే బడాయి
వయసు తోటి దోరదోర సొగసులొస్తాయి
సొగసులతో ఓరఓర చూపులొస్తాయి
వయసు తోటి దోరదోర సొగసులొస్తాయి
సొగసులతో ఓరఓర చూపులొస్తాయి
చూపులతో లేని పోని గీరలొస్తాయి
ఆ గీరలన్ని జారిపోవు రోజులొస్తాయి
బుల్లి కారున్న షోకిలా అబ్బాయి
నీ పోజుల్లో ఉన్నది భలే బడాయి
కుర్రకారు కోరికలు గుర్రాలవంటివి
కళ్ళాలు వదిలితే కదం తొక్కుతాయి
కుర్రకారు కోరికలు గుర్రాలవంటివి
కళ్ళాలు వదిలితే కదం తొక్కుతాయి
పట్టు తప్పినంతనే పరువే తీస్తాయి
ఒళ్ళు దగ్గరుంచుకుంటే మంచిదబ్బాయీ..ఈ..
గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి
నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి
మొదట మొదట కళ్ళతోటి మొదలుపెట్టి లడాయి
హృదయమంత పాకుతుంది హుషారైన హాయి
మొదట మొదట కళ్ళతోటి మొదలుపెట్టి లడాయి
హృదయమంత పాకుతుంది హుషారైన హాయి
కలకాలం ఉండదు ఈ పడుచు బడాయి
తొలినాడే చల్లబడి పోవునమ్మాయి
బుల్లి కారున్న షోకిలా అబ్బాయి
నీ పోజుల్లో ఉన్నది భలే బడాయి
కళ్ళు చూసి మోసపోయి కలవరించకు
ఓరచూపు కోరచూపు ఒకటనుకోకు
కళ్ళు చూసి మోసపోయి కలవరించకు
ఓరచూపు కోరచూపు ఒకటనుకోకు
ఇస్తేను హృదయమెంతో మెత్తనైనది
ఎదురుతిరిగితే అదే కత్తి వంటిది
గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి,నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి
బుల్లి కారున్న షోకిలా అబ్బాయి,నీ పోజుల్లో ఉన్నది భలే బడాయి
ఈ సుమధుర గీతాన్ని ఇక్కడ https://www.youtube.com/watch?v=lSIbaPzu7wU వినండి!
టీవీయస్. శాస్త్రి

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.