దేవుడికి డెబ్బై ఏళ్ళు ట..
విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం
పాత్రత్వాన్ ధనమాప్నోతి ధనాత్ ధర్మం తతః సుఖం
విద్య గానీ, కళ గానీ కొంతమందికే సిద్ధిస్తుంది. ఆ సిద్ధించిన వ్యక్తి వినయ శీలుడైతే, అది మరింత భూషిస్తుంది. నాలుగు కాలాల పాటు నిలుస్తుంది. ఆ కళాకారుణ్ణి నిలబెడుతుంది. అతని ద్వారా అందరికీ ఆనందాన్ని పంచుతుంది. వినయశీలత వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ధర్మ కార్యాలకు ఆ ధనాన్ని వినియోగించడం వలన శాశ్వతమైన సుఖం లభిస్తుంది.
ఈ ఉపనిషద్వాక్యం మన బాలుగారి గురించే చెప్పారని నాకనిపిస్తుంది. విశ్వమంతటా అభిమానులను సంపాదించుకున్నా, వినయం తప్పని గొప్ప వ్యక్తిత్వం. చేసిన మేలు మరువని అపూర్వ కృతజ్ఞతాభావం. రూపు కట్టిన ఆప్యాయత, ప్రేమకు తార్కాణం మన బాలు గారు. ఈ ప్రపంచానికి ఒకే ఒక సూర్యుడు, ఒకే ఒక నెల బాలుడు. అలాగే ఒకే ఒక్క “మన” బాలుడు.
నూత్న యవ్వన వేళ, ఉద్దండులైన సంగీతజ్ఞులకి నిలయమైన సినీ ప్రపంచంలో అడుగిడి, అందరి దృష్టినీ ఆకర్షించి, అచంచలమైన ఆత్మ విశ్వాసంతో పండిత పామర హృదయాలను చూరగొని, ఎన్నో ఇడుములకోర్చి, ఏటికి ఎదురీది గెలిచాడు, ఒకే ఒక్కడై నిలిచాడు ఆ బాల గంధర్వుడు. అగణితమైన, అమృత రసగుళికలను అందిస్తూ అయిదు దశాబ్దాలుగా అప్రతిహతంగా సాగిపోతోన్నది మన బాలు గారి ప్రయాణం.
ఎదురైన ప్రతి సవాలునీ అధిగమించి, ప్రతి మైలు రాయినీ దాటుకుంటూ, ఎన్నో భాషలలో వేలాది గీతాలను ఆలపించిన గీతా చార్యుడు బాలు గారు. లేత గొంతులో “వసంత రాత్రి” ని శ్లాఘిస్తూ గానం చేసినా, “తనివి తీరని” మోహాన్ని తన గొంతులో తీయగా పలికించినా, “దివిలో విరిసిన పారిజాతకుసుమాన్ని” తన గానంతో ఆవిష్కరించినా, గండు కోయిల లా “మానస వీణ మధుగీతాలు” వినిపించినా, “సిరిమల్లె నీవే” నని ముగ్ధ “మోహనం” గా ఆలపించినా, “తన గాన లహరి తో” శివార్చన చేసినా, “ప్రభాత వేదికపై ప్రణవ నాదాలు” వినిపించినా ” బాలుగారికే చెల్లింది. ఆయన సినీ రంగంలో ప్రవేశించే నాటికి అందరూ “పాత్ర” ను దృష్టిలో ఉంచుకుని పాడే గాయకులే వుండేవారు. అయితే అప్పటికే కొత్త ఒరవడి మొదలై హీరో వర్షిప్పులూ, అభిమాన సంఘాలు వచ్చేసాయి. ఈ అంశాలని దృష్టిలో పెట్టుకుని ఏ హీరో కి ఎలా పాడాలో, అలా పాడి, పాటకు పైమాట వేసిన ఘనత బాలు గారిదే. ముఖ్యంగా మేటి హీరోలు, ఎన్.టీ.ఆర్, ఏ.ఎన్.ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి వారి కేరీర్లకి బాలు గారి గాత్రం ప్రాణం పోసింది. వారిని తిరుగులేని హీరోలుగా నిలబెట్టింది.
ఆయన ఒక సుధా సముద్రుడు. ఆయనను పూర్తిగా వర్ణించి చెప్పడం అసాధ్యం. మనం పట్టుకెళ్ళిన పాత్రను బట్టి మనకెంత ప్రాప్తమో అంత క్షీరామృతం మనకు లభిస్తుంది. ఆయన పరిచయం కలగడం ఒక అదృష్టం. సాంగత్య లభించడం సంచిత పుణ్య ఫలం.
2000 సంవత్సరంలో నాకు బాలు గారితో ప్రత్యక్ష పరిచయం. అట్లాంటాలో మేము నిర్వహించిన శతావధానంలో పృఛ్ఛకులుగా పాల్గొన్నారు బాలుగారు. ఆనాడు నేను, మా అన్న రామభద్ర అవధానాన్ని అప్పటికప్పుడు టైపు చేసి, తెరమీద ప్రేక్షకులకందరకూ చూపించాము. ఆ కృషిని బాలు గారు ఎంతో మెచ్చుకున్నారు. తరువాత, బాలు గారికి ఆప్త మిత్రులు మా అట్లాంటా వాసి శ్రీ.బాల ఇందుర్తి గారింట్లో ఒకటి రెండు సార్లు కలిసాను. తరువాత 2010 లో అట్లాంటా లో జరిగిన నా రెండవ హాస్య కథా సంకలనం “టేకిట్ ఈజీ” ఆవిష్కరణ సభలో, మా బాల ఇందుర్తిగారి అభ్యర్థనను మన్నించి, భారత దేశం నించి ఫోను చేసి, ఆశీస్సులందిచారు. తరువాత 2014 లో జరిగిన పాడుతా తీయగా కార్యక్రమం కోసం, అమెరికాలో ని పలు నగరాల గురించి అందరకూ అర్థమయ్యే రీతిలో చిన్ని చిన్ని పరిచయవాక్యాలు, నన్ను రాయమన్నారు. ప్రతి వూరు గురించి నేను రాసిన నాలుగు మాటలు బాలు గారు ప్రతి ఎపిసోడ్ లోనూ చదవడం నా అదృష్టం. డొక్కా సీతమ్మ గారిని గురుతు చేసుకుని, ఆ వంశ వారసుడిగా నన్ను నలుగురిలో గుర్తించడం మరచిపోలేని గొప్ప సన్మానం. ఇవన్నీ ఒక ఎత్తు. నేను రచించి, దర్శకత్వం వహించిన నా తొలి చిత్రం “పల్లకీ” (డిసెంబరు (2014)) లో సాక్షాత్తూ బాలు గారు, నేను రాసిన మొట్టమొదటి సినిమా పాటలోని సాహిత్యాన్ని మెచ్చుకుని, తానే స్వయంగా పాడడం ఆయన నాకిచ్చిన గొప్ప వరం.
తనకు చేసిన మేలుని మరచి పోని వ్యక్తిత్వం, మెత్తనైన మాట, విరిసిన మల్లెలంత స్వఛ్ఛమైన నవ్వు, రూపుకట్టిన వినయం, సాటి మనిషికి ఎన్నడూ మేలు చేసే నైజం, అనితర సాధ్యమైన ప్రతిభ, ఇదీ బాలుగారి జీవన చిత్రం.
బాలు గారూ, మీరు నిండు నూరేళ్ళు హాయిగా నవ్వుతూ, నవ్విస్తూ, పాడుతూ, మమ్మల్ని అలరిస్తూ ఒక జీవనదిలాగ ప్రవహిస్తూ వుండిపోవాలి. ప్రతి భారతీయుడూ మీకు కొన్ని జన్మలపాటు ఋణపడిపోయాడు. ఆ ఋణం అలా తీరకుండానే వుండిపోవాలి. ఎన్ని జన్మలైనా మా బాలు సాంగత్యం మాకు లభిస్తూనే ఉండాలి. మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు, మరెన్నెన్నో ఆనందకర పునరాగమనాభిలాషలు !!
మీ డొక్కా ఫణి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.