రాష్ట్రపతి ఆమోదానికి జీఎస్టీ బిల్లు..
ఎన్డీయే సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జీఎస్టీ బిల్లు ఆమోదంలో రెండో అడుగు పడింది.ఇక.. జీఎస్టీ బిల్లుకు దేశంలోని సగానికి పైగా రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదం తెలిపాయి. దీంతో ఈ బిల్లును కేంద్ర సర్కారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదానికి పంపించనుంది. ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో దేశంలోని సగం కంటే ఎక్కువ రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం తప్పనిసరి అన్నమాట. రాష్ట్రాల మద్దతు తెలిపిన తర్వాతే బిల్లును రాష్ట్రపతికి పంపించాల్సి ఉంది. దీంతో కేంద్రం పలు రాష్ట్రాలను బిల్లును ఆమోదించాల్సిందిగా కోరింది.
కేంద్రం విజ్ఞప్తి మేరకు బీహార్, అసోం, ఛత్తీస్ గఢ్, ఢిల్లీ, గుజరాత్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, నాగాలాండ్, తెలంగాణ, సిక్కిం, మిజోరాం, గోవా రాష్ట్రాలు జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలిపాయి. తాజాగా ఒడిసా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచి ఆమోదం తెలిపారు. బిల్లుకు ఆమోదం తెలిపిన రాష్ట్రాల్లో 8 బీజేపీ పాలిత, సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నాయి. మిగిలిన 8 ప్రతిపక్షపార్టీల పాలిత రాష్ట్రాలు కావడం గమనార్హం. దీంతో, సగం రాష్ట్రాలు ఆమోదించాలన్న నిబంధనను సంతృప్తిపరచినట్లు అయింది.
దీంతో బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపించనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తర్వాత.. జీఎస్టీ కౌన్సిల్‌ను ప్రభుత్వం నోటిఫై చేస్తుంది. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన ఈ కౌన్సిల్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వం వహిస్తారు. ఏయే ఉత్పత్తులు, సేవల మీద ఎంత శాతం పన్ను విధించాలి..? ఎంత శాతం సెస్సులు విధించాలి..? ఎంత శాతం సర్‌చార్జీలను విధించాలి..? అన్న అంశాలపై కౌన్సిల్ చర్చిస్తుంది. అనంతరం కేంద్ర, రాష్ట్ర సర్కారులు కేంద్ర జీఎస్టీ, రాష్ట్ర జీఎస్టీ, ఉమ్మడి జీఎస్టీ చట్టాల ముసాయిదాలను రూపొందిస్తాయి. వీటిని పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఆమోదించాల్సి ఉంటుంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.