Loading...
You are here:  Home  >  Community Events  >  Current Article

హనుమంతుడి పరిపూర్ణ సంగీతం!

By   /  September 14, 2016  /  No Comments

    Print       Email

14305208_1536093799749347_2249964990368506014_o(తుంబురుడు. ఎవడురా..అంటే ఈ రోజు పిడుగులు బూరా ఉదేవాడు అనుకుంటారు.)

దేవలోకంలో సంగీత విద్వాంసులుగా తుంబుర నారదులు సుప్రసిద్ధులు. తుంబురుడి వద్ద కళావతి అనే వీణ ఉండేది. నారదుడి వీణ మహతి. ఇద్దరూ ముల్లోక సంచారం చేసేవారు. ఇంద్రాది దేవతలను తమ గానంతో, వీణానాదంతో అలరించేవారు. మహావిష్ణువును స్తుతిస్తూ కీర్తనలను గానం చేసేవారు. తమ గానానికి దేవతలు పొగుడుతూ ఉండటంతో ఇద్దరికీ గర్వం పెరిగింది. ఎవరు గొప్ప అనే విషయంలో ఇద్దరికీ స్పర్థలు కూడా మొదలయ్యాయి.

InCorpTaxAct
Suvidha

ఎవరు గొప్పో సాక్షాత్తు మహా విష్ణువు వద్దే తేల్చుకోవాలనే పట్టుదలతో తుంబుర నారదులిద్దరూ నేరుగా వైకుంఠానికి వెళ్లారు. పోటాపోటీగా గానం చేశారు. నారదుడు తనకు ఎంతటి భక్తుడైనా, విష్ణువు మాత్రం తుంబురుడి గానానికి పరవశుడై, అతడిపై పొగడ్తల వర్షం కురిపించారు. నారదుడు చిన్నబోయాడు. సంగీతంలో విద్వత్తు సాధించడానికి ఏం చేయాలంటూ విష్ణువునే సలహా అడిగాడు. ‘గానబంధు’ అనే గుడ్లగూబ వద్ద సంగీతం నేర్చుకోమని సూచించాడు విష్ణువు. ‘గానబంధు’ వద్ద సంగీతం నేర్చుకున్న నారదుడు సంగీత సమరానికి సిద్ధం కావాలంటూ తుంబురుడిని సవాలు చేసేందుకు అతడి నివాసానికి వెళ్లాడు.

అక్కడ గాయపడ్డ స్త్రీలు విలపిస్తూ కనిపించారు. ఎవరు మీరని ప్రశ్నించాడు నారదుడు. ‘నీ గానంతో గాయపడ్డ రాగాలం మేమంతా’ అని బదులిచ్చారు వారు. ‘ఇక్కడికెందుకొచ్చారు?’ అని ప్రశ్నించాడు నారదుడు. ‘తుంబురుడు గానం చేస్తే స్వస్థత పొందుదామని వచ్చాం’ అని బదులిచ్చారు. ఆ సమాధానంతో చిన్నబోయిన నారదుడు ఈసారి సంగీతం నేర్చుకోవడానికి శ్రీకృష్ణుడి పెద్ద భార్య రుక్మిణీదేవిని ఆశ్రయించాడు. ఆమె శిక్షణలో సంగీతంలో అపార విద్వత్తును సాధించాడు.

ఎవరు గొప్ప విద్వాంసులో సాక్షాత్తు మహావిష్ణువు వద్దే తేల్చుకుందామంటూ తుంబురుడిని సవాలు చేశాడు నారదుడు. ఇద్దరూ వైకుంఠానికి బయలుదేరారు. ఇద్దరి గానాన్నీ విష్ణుమూర్తి సంతృప్తిగా ఆలకించాడు. అయితే, ఎవరు గొప్పో తాను తేల్చలేనన్నాడు. ఈ విషయంలో తీర్పు చెప్పగల దిట్ట హనుమంతుడు ఒక్కడేనని చెప్పాడు. దీంతో దేవతల సమక్షంలో పోటీ ఏర్పాటుకు సిద్ధమైన తుంబుర నారదులిద్దరూ హనుమంతుని వద్దకు వెళ్లారు. హనుమంతుడు న్యాయనిర్ణేతగా రాగా, దేవతల సమక్షంలో పోటీ ఏర్పాటైంది. మొదట తుంబురుడు వీణ వాయిస్తూ గానం చేశాడు. తుంబురుడి సంగీతానికి దేవతలందరూ మంత్రముగ్ధులయ్యారు. లోకమంతా చేష్టలుడిగి సంగీతంలో లీనమైంది.

తుంబురుడు తన గానాన్ని ఆపిన తర్వాత నారదుడు ప్రారంభించాడు. మహతి మీటుతూ గానాన్ని సాగించాడు. నారదుడి గమకాల గారడీలకు ప్రకృతిలో చలనం మొదలైంది. తుంబురుడి గానానికి గడ్డకట్టిన సముద్రాలన్నీ తిరిగి కెరటాల హోరుతో సహజత్వాన్ని సంతరించుకున్నాయి. నింగిలో నిలిచిపోయిన విహంగాలన్నీ స్వేచ్ఛగా ఎగరసాగాయి. ప్రకృతిలో జీవకళ ఉట్టిపడసాగింది. దేవతలందరూ తన్మయత్వంతో తలలూపసాగారు. నారదుడు తన గానాన్ని ముగించడంతో వారందరూ తేరుకున్నారు.

హనుమంతుడి తీర్పు ఎలా ఉంటుందోనని ఆత్రంగా చూడసాగారు. ‘ఇద్దరూ సమ ఉజ్జీలుగానే ఉన్నారు. ఇంకో పరీక్ష పెడతాను. మీ వీణలు ఇలా ఇవ్వండి’ అడిగాడు హనుమంతుడు. ఇద్దరూ తమ వీణలను అతడి చేతికి అందించారు. హనుమంతుడు రెండు వీణలనూ తీసుకుని, రెండింటిలోని చెరో మెట్టును ఊడదీసి వారికి ఇచ్చాడు. ‘ఇప్పుడు వీణ వాయిస్తూ గానం చేయండి’ అన్నాడు. దీంతో తుంబుర నారదులిద్దరూ అసహనానికి గురయ్యారు.

‘వీణలో అన్ని మెట్లూ ఉంటేనే కదా వాయించగలం. చెరో మెట్టు తీసేసి ఇప్పుడు వాయించమంటే ఎలా?’ అని అడిగారు. హనుమంతుడు చిరునవ్వు నవ్వాడు. ఎదురుగా కనిపించిన ఒక వెదురు బొంగును తీసుకుని, దాన్ని చీల్చాడు. దానికి తీగలు తగిలించాడు. ఎలాంటి మెట్లులేని వీణను తయారు చేశాడు. ఇక దానిని వాయిస్తూ గానం చేయడం మొదలుపెట్టాడు. మంద్రంగా మొదలైన స్వరఝరి క్రమంగా ఉధృతి అందుకుంది.

ఆ గానానికి వైకుంఠం నుంచి మహావిష్ణువే పరుగున అక్కడికి వచ్చినా, అతడి రాకను గుర్తించలేనంతగా అక్కడి దేవతలందరూ తన్మయులయ్యారు. హనుమంతుడు తన గానాన్ని ముగించిన తర్వాత తుంబుర నారదులిద్దరూ సంగీతంలో తమ విద్వత్తు ఇంకా పరిపూర్ణం కాదని అంగీకరించారు. హనుమద్గానంతో తమ కళ్లు తెరుచుకున్నాయని అన్నారు. వారి మాటలతో బాహ్యస్పృహలోకి వచ్చిన దేవతలు అక్కడకు వచ్చిన మహావిష్ణువును గమనించారు. ఆయన అభిప్రాయం కోరారు. తుంబుర నారదులిద్దరూ తన భక్తులే అయినా, ఇద్దరిలోనూ ఇంకా అహం పూర్తిగా నశించలేదని, అందుకే వారు తమ విద్యలో ఇంకా పరిపూర్ణత సాధించలేక పోయారని, అహాన్ని వీడటం వల్లనే హనుమంతుడు పరిపూర్ణత సాధించగలిగాడని వివరించాడు విష్ణువు.

 

Author:

Vinjamuri Venkata Apparao

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →