టాప్ ప్లేస్ లో ట్రంప్.. వెనుకబడిన హిల్లరీ క్లింటన్..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమాక్రటిక్ పార్టీ అభ్యర్ధి ఎంపిక కోసం రసవత్తర పోరు సాగుతోంది. ఇందులో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణి హిల్లరి క్లింటన్.. బెర్నీ శాండర్స్ మధ్య హోరా హోరీ పోరు సాగుతోంది.వీరిద్దరిలో.. శాండర్స్ కంటే హిల్లరీకి కేవలం ఒక్క శాతం మాత్రమే ఆధిక్యం లభించింది.
ఇదిలాఉండగా.. రిపబ్లికన్ పార్టీ తరపున బరిలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ మాత్రం తిరుగులేని ఆధిక్యంలో ఉన్నారు. దీంతో ఆ పార్టీ తరపున అభ్యర్ధిగా ఆయన పేరే ఖరారు అయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది జూన్లో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నట్లు ప్రకటించిన ట్రంప్ తనదైన శైలిలో ప్రచారంలో దూసుకెళ్ళారు. దీంతో పార్టీలో ఆయనకు పోటీ లేకుండా పోయింది. అదే సమయంలో డెమాక్రటిక్ పార్టీ తరపున హిల్లరీ ప్రచారంలో బాగా వెనుకబడ్డారు. ట్రంప్ తన ప్రచారంలో ముఖ్యంగా మూడు అంశాలను ప్రస్తావిస్తున్నారు. దేశ సరిహద్దుల భద్రత, అక్రమ వలసలు, ఉగ్రవాదంపై ఉక్కుపాదం.. వీటిని పదే పదే ప్రస్తావిస్తూ ఓటర్ల మనసును గెలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తాను అధ్యక్షుడినైతే అమెరికాలోకి ముస్లింల వలసలను అడ్డుకుంటానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో ఆయనపై బ్రిటన్ లో ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.మరోవైపు.. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ట్రంప్ పై విమర్శలు చేశారు. ఆయన ఎప్పటికీ అమెరికా అధ్యక్షుడు కాలేడంటూ అభిప్రాయ పడ్డారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.