భారత్ ను హెచ్చరించిన ఉగ్రవాద సంస్థ నేత..
కశ్మీర్ అంశంలో భారత్ ను ఇరకాటంలో పెట్టేందుకు పాక్ శతవిధాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇక ఆ దేశానికి ఉగ్రవాద సంస్థలు కూడా వంతపాడుతున్నాయి. తాజాగా కశ్మీర్ అంశంలో భారత్ ను హిజ్బుల్ ముజాహుద్దీన్ నేత సైయిద్ సలాహుద్దీన్ హెచ్చరించారు. కరాచీలో ఆయన ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు.కశ్మీర్ ప్రజలు స్వాతంత్య్ర పోరాటం చేస్తున్నారని అన్నారు. వారికి మద్దతు ఇచ్చేందుకు పాక్ కట్టుబడి ఉందన్నారు. కశ్మీర్ ప్రజలకు పాక్ నైతికంగా, రాజకీయంగా, రాజ్యాంగపరంగా మద్దతు ఇస్తుందన్నారు.
పాకిస్థాన్ అండగా ఉంటే.. పాక్-భారత్ మధ్య అణుయుద్ధం జరిగే అవకాశాలున్నాయని అన్నారు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య మూడుసార్లు యుద్ధం జరిగిందని గుర్తు చేశారు. కశ్మీర్ ప్రజలు స్వాతంత్య్రం విషయంలో రాజీపడేందుకు సిద్ధంగా లేరని.. దీనివల్ల నాలుగోసారి కూడా యుద్ధం జరిగే అవకాలున్నాయని అన్నారు.
కశ్మీర్ విషయంలో పాక్ మద్దతు ఇవ్వకపోయినా, ఐక్యరాజ్యసమితి పట్టించుకోకపోయినా.. అక్కడి ప్రజలు తమ చివరి రక్తపు బొట్టువరకు పోరాటం చేయాలని ప్రతినబూనారని అన్నారు. సాయుధ యుద్ధం చేయడం తప్ప వారికి వేరే ప్రత్యామ్నాయం లేదని కశ్మీర్ ప్రజలు నిర్ణయించుకున్నారని అన్నారు. కశ్మీర్ లో జరుగుతున్న హింసాకాండను ప్రపంచం పట్టించుకోకపోతే.. విభజిత కశ్మీర్ లోని ప్రజలు స్వయంగా పరిస్థితులను చేతుల్లోకి తీసుకుంటారని అన్నారు. కశ్మీర్ ప్రజల అణచివేతను భారత ప్రభుత్వం ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. కశ్మీర్ ను విముక్తి చేయడం కోసం వాస్తవాధీన రేఖను అతిక్రమించే ప్రకటన చేసేందుకు కూడా హిజ్బుల్ ముజాహుద్దీన్ వెనకాడబోదని స్పష్టం చేశారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.