Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Howdy Modi – Houston

By   /  September 25, 2019  /  No Comments

    Print       Email
Modi addressing NRI crowd

హౌడీ మోడీ – ఒక దృశ్యకావ్యం
                                – ఫణి డొక్కా

InCorpTaxAct
Suvidha

గమనిక : మీకు ప్రియతమ భారత ప్రధాని శ్రీ.నరేంద్ర మోదీ గారంటే అభిమానం వుంటేనే, ఈ క్రింది వ్యాసం చదవండి. లేకపోతే మీరు నొచ్చుకునే అవకాశం ఉంది. ఎవరినీ మార్చటం నా ఉద్దేశ్యం కాదు. ఎవరినీ నమ్మిచటం నా లక్ష్యం కాదు. నా అనుభవం, నా ఆలోచనలు, నా ఎఫ్.బి పేజి మీద రాసుకుంటున్నాను. నచ్చినవారు చదవండి. నచ్చక పోతే “హైడ్ దిస్ పోస్ట్” అనే ఆప్షనో “అన్ ఫ్రెండ్” అనే ఆప్షనో మీకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి. నమస్సులు.


జయహో !!
ఎక్కడ నీమనసు కుదుటపడుతుందో, ఎక్కడ అప్రయత్నంగా నీ కనులు చెమ్మగిల్లుతాయో, ఎక్కడ నీ చుట్టూ ఆనందం పరచుకుంటుందో, అదే దేవాలయం. ఆ దేవాలయం ఒక రాజకీయ సభలో కనబడడం అరుదు. కాదు కాదు, దాదాపు అసాధ్యం. అటువంటు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారొకరు. మాట, నడక, ప్రవర్తన అన్నిటిలోనూ మానవాతీతమైన శక్తి ఏదో నడిపిస్తోన్న ఒక వ్యక్తిని చూసి, కుల మతాలతో సంబంధం లేకుండా, వచ్చిన భారతీయులంతా ఉప్పొంగిన గుండెలతో, అమితమైన ఆనందంతో, స్వాగతించారు. ఆ మూడు గంటలూ ఎల్లా గడిచాయో, తెలియనే లేదు. వాటిని తెలిపేందుకు, మరలా నెమరు వేసుకునేందుకూ, మీ అందరికీ నేడు బోలెడన్ని యుట్యూబు చానళ్ళు, ప్రైవేటు చానళ్ళు అందుబాటులో ఉన్నాయి. నేను కార్యక్రమ వివరాలు వ్రాయను. నా స్పందన మాత్రమే రాస్తాను. అవి మీకు నావద్ద తప్ప మరెక్కడా దొరకవు కదా.


ఇది ఎలా ఉంటుందంటే, మీరంతా టైటానిక్ సినిమా చూసారు కదా. దానిలో మొదటి సీన్ లాగ ఉంటుంది. నిజంగా “టైటానిక్” ఓడలో వెళ్ళిన ఒక ముసలి హీరోయిన్ కి, గ్రాఫిక్స్ లో ఆ ఓడ ఎలా మునిగిపోయిందో చూపిస్తాడు ఒక బౌంటీ హంటర్ అసిస్టెంటు. “మీ ఓడ ఇలా వెళ్ళింది, ఇలా ఐస్ బర్గ్ ని ఢీకొట్టింది, ఇలా మధ్యకి విరిగి పోయింది, ఇలా పడిపోయింది” అంటూ, ఎంతో తేలికగా వివరించేస్తూ. అవన్నీ విన్న ఆవిడ నవ్వి, “నువ్వు చెప్పినవన్నీ నిజమే. కానీ ఆ అనుభవం మాత్రం వేరేలా ఉంది. ఇప్పటికీ ఆ బాల్ రూం కి వేసిన ఫ్రెష్ పెయింట్ సువాసన్ నా ముక్కు పుటాలని గిలిగింతలు పెడుతోంది” అంటూ మొదలు పెడుతుంది. అద్భుతమైన దర్శకుడు జేంస్ కేమరూన్ ఆ ముసలి హీరోయిన్ కళ్ళ మీద, ఆమె మొహంలోని ముడుతలమీద ఎక్స్ట్రీం క్లోజప్ ఇస్తాడు. సీన్ డిజాల్వ్ అయ్యి సినిమా మొదలౌతుంది. అలాగన్నమాట. మీరంతా ఎన్ని చానెళ్ళు చూసినా, ఎన్ని రిపోర్ట్లు చదివినా, ప్రత్యక్షానుభవం కలిగిన వారి మాట వింటే, ఆ మజానేవేరుకదా. అందుకే ఇది రాస్తున్నా. ఇది ట్రావెలాగ్ కొంతా, రిపోర్ట్ కొంతాను. ఓపిక ఉన్నప్పుడు చదవండి. ఆసక్తిగానే ఉండవచ్చు.


ఒక రాజకీయ సభకు నేను వెళ్ళడం, జీవితంలో ఇది మూడో సారి అని చెప్పాను కదా గతంలో. ఈ అనుభవం మాత్రం గతంలో ఎన్నడూ లేని ఒక గొప్ప అనుభూతిని మిగిల్చింది. మొదటి సభ జరిగింది పసితనంలో. ఏమీ తెలియని వయసది. రెండవ సభ జరిగింది కౌమార్యంలో కాబట్టి పూర్తిగా గుర్తుంది. అయితే, అప్పటి ఆనందానికి పైమాట వేసింది ఈ మూడవ సభ. శనివారం ఉదయమే నాలుగ్గంటలకు బయల్దేరి ఎయిర్ పోర్ట్ కి వెడితే, అక్కడ “సౌత్ ఎకానమీ పార్కింగ్ “లో పార్కింగు ప్లేస్ ఉంది అన్నాడు. లోపలికెళ్ళి ఓ పావుగంట తిరిగాకా తెలిసింది, అక్కడ ఒక్క స్పేస్ కూడా లేదని. దేవుడో గోడో అంటూ బైటికొచ్చి, బుద్ధిగా పార్క్ అండ్ ఫ్లై వాడి దగ్గర పార్క్ చేసుకుని, వాడి బస్సులో వెళ్ళి సెక్యూరిటీ పూర్తిచేసి గేటు దగ్గరికెళ్ళేసరికి బోర్డింగ్ అప్పుడే మొదలెడుతున్నారు. సరే, ఓ మూడు గెంటల తరువాత ఆస్టిన్ లో అతి చిన్న రెండో ఎయిర్పోర్ట్ టెర్మినల్ లో దింపాడు. అక్కడినించి మెట్లు (రాంప్) దిగి, నడుచుకుంటూ లోపలికెడుతుంటే, పెళ్ళైన కొత్తలో భువనేశ్వర్ ఎయిర్ పోర్ట్ లో దిగిన భావన కలిగింది. అన్న వచ్చాడు, మరో గంటలో తమ్ముడు వచ్చాడు.
అందరూ ఇల్లు జేరి, సాయంత్రం నాలుగున్నరకు, మేం ముగ్గురము, మా బంధువు మరొకరితో హ్యూస్టన్ బయల్దేరి వెళ్ళాము. అక్కడ “మహారాజభోగ్” అనేపేరుతో ఒక గొప్ప రెస్టారెంటు ఉందట. అక్కడ డిన్నర్ చేద్దామని వెడితే, బయట కనీసం వందమంది వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు కాక పార్కింగు లాట్ లో మరో వందమందిదాకా కార్లలో వెయిట్ చేస్తున్నారు. అప్పుడర్థమైంది మర్నాటి సభ ఎలా ఉండబోతోందో. బుద్ధిగా ఆ దగ్గరలో ఉన్న బాలాజీ భవన్ లో భోజనం, క్వాలిటీ ఐస్క్రీం షాపులో ఫలూడాలు సేవించి, హోటలు చేరేసరికి తొమ్మిదిన్నర. ఇక్కడ ఒక విషయం. బాలాజీ భవన్ లో రుచులు చాలా బావున్నాయి. అంత తక్కువ రేట్లకి ఎలా పెడుతున్నారో అర్థం కాలేదు. నేను బహుశా ఓ దశాబ్దం క్రితం కూడా అక్కడ అవే రేట్లు చూసినట్లు గుర్తు. ఆ యాజమాన్యానికి హేట్సాఫ్.


మేము ఉంటున్న హాలిడేఇన్ హోటలు సభ జరిగిన “ఎన్.ఆర్.జి” స్టేడియం ఎదురుగా ఉంది. మా రూమునుంచి పార్కింగు లాట్, స్టేడియం ఎంట్రన్సు కనిపిస్తున్నాయి. మేము రూం కి వెడుతుంటే ఒక ఇరవై మంది పంజాబీలని చూసాను. వారంతా కోట్లు వేసుకుని ఉన్నారు. మా ఫ్లోర్ లోనే ఆగారు. నాకు ఎందుకో గుండెలు పీచుమన్నాయి. కొంపతీసి వీరు రేపేవన్నా నిరసన తెలిపే కార్యక్రమానికి వచ్చారా అని అనిపించింది. ఎందుకంటే అటువంటి వర్గాలు కూడా వస్తున్నాయని వాట్సాప్ లో ఎవరో పంపారు ,అంతకు ముందు రెండు రోజుల క్రితం. కాస్త పరిశీలనగా ఒకటికి రెండుసార్లు సార్లు వాకబు చేసి మా బంధువు చెప్పారు, వాళ్ళు కాన్సులేట్ నించి వచ్చిన అఫీషియల్స్ అని. నాకు హాయిగా నిద్ర పట్టింది. పాపం రాత్రంతా పోలీసులు ఆ పార్కింగు లాట్లో పహారా కాస్తునే ఉన్నారు. వాళ్ళ విధి నిర్వహణ ఎంత కష్టమో కదా అనిపించింది, నేను పడుకునేప్పుడు చూస్తే.


ఉదయం ఆరున్నర కల్లా మేమంతా రెడీ. బయట చూస్తే అప్పుడే పండగలా ఉంది. స్టేడియం బయట బారులు తీరి వున్నాయి కార్లు, వేనులు, బస్సులు. కొన్ని రోడ్లు మూసేసారు. ఎంతో మంది పోలీసులు ఒక వ్రతంలాగ తమ విధులు నిర్వహిస్తున్నారు. మేము బ్రేక్ఫాస్ట్ కానిచ్చి, నడక మొదలెట్టాము. పావుగంట పట్టింది, చుట్టు తిరిగి గేట్ నెంబరు 10 చేరుకోవడానికి. అక్కడ వాలంటీర్లని చూస్తే ముచ్చట వేసింది. యువకులు, నడి వయస్సువాళ్ళు, పెద్దలు, వృద్ధులు ఎందరో వాలంటీర్లు. అందరూ నవ్వుతూ, హాయిగా ఉన్నారు. అందరినీ అడిగి మరీ వారికి దారి చూపిస్తున్నారు. గేటు దగ్గర మా టికెట్టు స్కాన్ చేసి లోపలికి పంపారు. స్టేడియం ప్రాంగణంలో ఒక పక్కగా ఒక చిన్న వేదిక మీద అప్పటికే పిల్లల, పెద్దల డాన్సు కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొందరు వాటిని తిలకిస్తున్నారు. రెండు పెద్ద లైన్లు కనిపించాయి. ఒకవైపు ఆడవాళ్ళు, రెండో వైపు మగవాళ్ళు. మేము వెళ్ళి మగవాళ్ళ లైన్లో నిలుచున్నాము. ఓ రెండునిముషాలాగి, తమ్ముడు వెళ్ళి చూసి వచ్చి చెప్పాడు, ఇవి “రెస్ట్ రూం” కి వెళ్ళడానికి కట్టిన లైన్లు అని. నవ్వుకుని, బైటికొచ్చి అవతలవైపున ఉన్న గేట్లలోంచి, ఏవిధమైన క్యూలు లేకుండా, నేరుగా లోపలికి వెళ్ళాము.


అక్కడ టీషర్టులు ఉచితంగా ఇచ్చారు. మనిషిని చూడగానే వారు మీడియమ్మో, లార్జో, ఎక్స్ట్రా లార్జో, మరొకటో ఇట్టే గ్రహించి ఆ టీషర్టు చప్పున ఇస్తున్నారు. వారంతా కూడా సరదాగా, జోకులు వేస్తూ, నవ్వుతూ, నవ్విస్తున్నారు. మేము అక్కడ ఆ టీషర్ట్లు పైన వేసుకుని ఫొటోలు దిగి, ఎస్కలేటరు ఎక్కి పైకి చేరాము. అక్కడ మోదీ గారి బొమ్మతో ఫొటోలు తీసుకున్నాము. ఎదురుగానే మా సీట్ల సెక్షను కనిపించింది. వేదికకి దగ్గరగా, బ్రహ్మాండమైన సీట్లు దొరికాయి. సెటిలయ్యాము. మా అట్లాంటా లో పేరు మోసిన తెలుగువారు, బీజేపీ కార్యకర్తలు కొందరు మెయిన్ ఫ్లోర్ మీద కనిపించారు. మరి కొంతమంది అట్లాంటా మిత్రులు కూడా కలిసారు. పసి పిల్లల దగ్గరనుంచి, పండు ముసలివారి వరకూ అలా అలా వస్తూనే ఉన్నారు. ఎంతోమంది వీల్ చెయిర్లలో కూడా వచ్చారు. అందరి మొహాలలోను తెలియని ఆనందం. ఏవో సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి.

NRG stadium packed with 50,000 crowd.


ఇంతలో తమ్ముడు వెళ్ళి అందరికీ మసాలా టీ తెచ్చాడు. అట్లాంటా మిత్రులొకరు సమోసాలు అందించారు. స్టేడియంలోని ప్రతి సెక్షనూ నిండడం మొదలైంది. పదయ్యేసరికి స్టేడియమంతా జనంతో కిటకిటలాడిపోయింది. ఎటుచూసినా జనం. “ఆకాశం చిల్లు పడిందా, ఒక ఏరు కట్టలు త్రెంచుకు ప్రవహిస్తోందా, నేల ఈనిందా అన్నట్లుగా”నే అనిపించింది. ఆ మాటలకు అసలైన అర్థం ఇదా అన్నట్లుగా ఉందా దృశ్యం. సాంస్కృతిక కార్యక్రమాలయ్యాయి. బానే ఉన్నాయి. హ్యూష్టను కాలేజి పిల్లలు ఏదో “పక్కా లోకల్” అనే పాటకి ఏదో డాన్స్ చేసారు. నేను అది పెద్దగా పట్టించుకోలేదు. పిల్లలు వాళ్ళకి నచ్చిన పాటకి డేన్స్ చేసారు. సరదాగానే చేసారు. “ఆ పాటకి అది వేదిక కాదు, మన తెలుగుదనం, మన సంస్కృతి” ఇటువంటి చర్చలలోకి నేను దిగదలుచుకోలేదు. సంస్కృతికి సంబంధించిన సనాతన మైన అంశాలన్నీ అంతకు ముందే ప్రదర్శించారు, కూచిపూడితో సహా. తరువాత ఏదో వారికి తోచిన మోడరన్ పాట చేసారు. అంతే, వదిలేద్దాం. ఆనక సెనేటర్లు వచ్చారు. టెడ్ క్రూజ్ చాలా క్లుప్తంగా, సూటిగా, చక్కగా మాట్లాడాడు. అతనిలో ప్రజలను ఆకట్టుకునే తత్వమేదో ఉన్నది. భవిష్యత్తులో ఇంకా మంచి పదవులు అలంకరిస్తాడని, ప్రజలకు సేవ చేస్తాడని ఆశిద్దాము. ఆనక అందరూ ఎదుచూస్తున్న సమయం రానే వచ్చింది.


గతంలో ఏ భారత ప్రధానికీ దక్కని గౌరవాన్ని ఇస్తూ, సుమారు 30 మంది సెనేటర్లు అధికారులు స్వాగతించగా, రెడ్ కార్పెట్ పైన సింహంలా ఠీవిగా నడుచుకుంటూ భారత ప్రధాని, ప్రియతమనేత శ్రీ.నరేంద్ర మోదీ గారు వచ్చారు. ఆయన్ని సెనేటర్లు, అధికారులు వేదిక మీదకు స్వాగతించారు. వేదికపైన ఆయన్ని పరిచయం చేసిన సెనేటర్ గారు చాలా పేజీలు చదివారు. మోదీగారు అందరినీ కలిసారు. కరచాలనం చేసి, వారితో మాట్లాడారు. ఆనక ఎందుకో అందరూ మళ్ళీ వేదిక దిగి పక్కకు వెళ్ళారు. ఎందుకా అనుకున్నాము. తరువాత తెలిసింది, అమెరికా అధ్యక్షులు ట్రంప్ గారు రావడం కాస్త ఆలస్యమైందని. ఇంతలో ఏదో సితార్ వాదన జరిగింది.


ఆనక వందిమాగధులతో అమెరికా అధ్యక్షులు ట్రంప్ గారు వచ్చారు. వారు, మోదీ గారు కలసి రెడ్ కార్పెట్ మీద నడవటం, అక్కడ వేచి ఉన్న పిల్లలతో మాట్లాడి, వేదిక వద్దకు రావటం పెద్ద తెరమీద చూపించారు. పిమ్మట మోదీగారు వేదిక పైకి వచ్చి “ట్రంప్ గారిని” సభకు ఆప్యాయంగా ఆహ్వానించారు. ఒక గొప్ప వ్యక్తి, తన మిత్రుణ్ణి ఎలా పరిచయం చేస్తాడో, ఎలా గౌరవిస్తాడో, స్వాగతిస్తాడో, అలా ఉందా పరిచయం. వాటిల్లో అందరికీ అమితంగా నచ్చిన మాట “అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్”. దీనితో మీలో చాలామంది ఏకీభవించకపోవచ్చు. నేను వంద శాతం మళ్ళీ ట్రంపుగారే వస్తారని నమ్ముతున్నాను నా వ్యక్తిగత ఆలోచనలవల్ల, విశ్లేషణలవల్ల. దీన్ని మీరు గౌరవించకపోయినా, నా అభిప్రాయంగా అనుకుని వదిలేస్తే చాలు.


సరే, ట్రంపు గారు ఎంతో సరదాగా, హుందాగా, మాట్లాడారు. ఏమాటలు మాట్లాడితే అమెరికా, భారత దేశాలమధ్య నిజమైన స్నేహం పెరుగుతుందో, ఏ “కీ వర్డ్స్” అమెరికా ప్రెసిడెంట్ మాట్లాడాలి అని ప్రతి భారతీయుడు కోరుకుంటాడో, ఆ మాటలన్నీ మాట్లాడారు. నేను విడమరచి చెప్పనక్కర్లేదు మళ్ళీని. మీకు తెలుసు. టెర్రరిజం గురించి, మిలట్రీ పరస్పర సహకారం గురించి, స్పేస్ రీసెర్చ్ లో సంయుక్తంగా చేయబోయే కార్యక్రమాల గురించీ, ఎన్.బి.ఏ బాస్కెట్ బాల్ కార్యక్రమాలని భారత్ తీసుకురావడం గురించీ హుషారుగా మాట్లాడి “మీరు పిలిచినా పిలవకపోయినా మా ఎన్.బీ.ఏ ఆట చూడ్డానికి ముంబై వచ్చేస్తా” అని జోక్ చేసి, తరువాత అందరూ మెచ్చుకునే రీతిలో భారత ప్రధానిని సభకు పరిచయం చేసి, “యు ఆర్ ఎ వెరీ వైజ్ మేన్” అని మోదీగారికి చక్కని కితాబులిచ్చి, తరువాత, తన ప్రెసిడెన్సీలో అమెరికా లో జరిగిన అభివృద్ధిని గణాంకాలతో సహా వివరించి, హుందాగా తన ప్రసంగం ముగించారు. ప్రోటోకాల్స్ అన్నిటినీ పక్కకు తోసి, సుమారు ముప్ఫై మంది సెనేటర్లు, అధికారులతో సహా, సభలో ముందు వరసలో కూర్చుని, మోదీగారి ప్రసంగం ఆసాంతం ఆసక్తితో విన్నమా ప్రెసిడెంట్ ట్రంప్ గారి స్నేహశీలతకు హేట్సాఫ్.
పిమ్మట శ్రీ నరేంద్ర మోదీ గారు మాట్లాడారు. ఆయన మొదలుపెట్టేముందు, అందరూ లేచి నిలబడి కొద్ది నిముషాలసేపు చప్పట్లతో స్టేడియమంతా మారుమ్రోగించేసారు. ఆ జనాన్ని చూసి ఆశ్చర్య చకితులైన కొందరు సెనేటర్లు తమ ఫోనుల్లో జనాల వీడియో తీసుకోవడం ఆశ్చర్యకరమైన విషయం. ఆ జన సంద్రాన్ని, మోదీగారికి ఇక్కడ ఉన్న ప్రజాబలాన్ని చూసి, టెడ్ క్రూజ్ గారు ఎంత ఆశ్చర్యపోయారో వారిని పరిశీలనగా చూసిన నాకు తెలిసింది.


మోదీ గారు ఏం మాట్లాడారో, ఎలా మాట్లాడారో మీరంతా ఈ పాటికి ఒకటికి రెండు సార్లు వినే ఉంటారు. ఆ వాగ్ధాటి, ఆ నిశితమైన పరిశీలనా దృష్టి, ఆ సంతులనం, ఆ సంయమనం అనితర సాధ్యం. ముఖ్యంగా ఆయన ఒక మాట చెప్పినప్పుడు నాకళ్ళమ్మట నీళ్ళు ఆగలేదు. “ట్రంప్ గారూ, 2017 లో నేను వచ్చినప్పుడు మీ కుటుంబాన్ని పరిచయం చేసారు. ఇదిగో, ఇవాళ నేను మీకు మా కుటుంబ సభ్యుల్ని పరిచయం చేస్తున్నాను” అని. ప్రతి భారతీయుడు తన కుటుంబ సభ్యుడని ఒక అంతర్జాతీయ వేదికమీద గర్వంగా చెప్పటం ఎంత గొప్ప మాట. సభలో ఎంతో మంది కళ్ళు చెమ్మగిల్లాయి. ఎవరైనా చూస్తే బాగుండదని నేను పెద్దరికంగా కళ్ళు తుడిచేసుకున్నాను గబగబాను. తరువాత చెప్పారు, కోట్లాది భారతీయుల అదేశాలమేరకు నేను పరిపాలిస్తున్నాను. వారు లేనిదే మోదీయే లేరు అని. అలా అనటం ఆయన వినయానికి నిదర్శనం. “ఆ, ఈమాటలన్నీ ఎవరో రాసిస్తారండీ, అవి బట్టీపట్టుకొచ్చేసి వీళ్ళు చెప్పడమే” అన్నారు కొందరు. వారందరికీ నేను చెప్పేది ఒక్కటే. ఈసారి ఎప్పుడైనా ప్రధాని మోదీ గారు మాట్లాడినప్పుడు ఆయన కళ్ళలోకి చూడంది. కళ్ళు ఎప్పుడూ అబద్ధం ఆడవు. ఒక గొప్ప యజ్ఞం చేసే అధ్వరుని కళ్ళలో ఎంతటి నిజాయితీ, ఎంతటి విశ్వాసం కనిపిస్తాయో వాటిని మీరు మోదీ గారి కళ్ళలో చూడవచ్చు. అది నటన కాదు, అది డబ్బింగు చెప్పడం కాదు, అది రాజకీయం కాదు. వీటన్నిటికీ అతీతమైనది, ఉన్నతమైనది. అందరికీ దూరంగా, కోరికలకు అతీతంగా, ఒక సన్యాసి వలె, ఎవరికీ తెలియకుండా, గుప్తంగా, ఏకాంతంగా, గంగానది ఒడ్డున జీవితాన్ని గడిపిన ఒక యోగి మనస్తత్వం అది. గంగను భూమిపైకి దించిన భగీరథుని పోలిక ఆయనది.


ఆయన ప్రసంగంలో ఆర్టికల్ 370 రద్దు బిల్లును సమర్ధించిన భారత శాసన సభ్యులకోసం, భారత దేశానికి స్నేహ హస్తాన్ని అందిస్తున్న ట్రంపు గారికోసం లేచి నిలబడి చప్పట్లు కొట్టమని అందరినీ కోరడం, దానికి అందరూ సంతోషంగా ఆ రెండు సందర్భాలలోనూ లేచి, చప్పట్లుకొడుతూ తమ ఆమోదాన్ని తెలియచేయటం చాలా బాగా అనిపించింది. ఆ ప్రసంగం విన్నంతసేపూ, ఇంకా వినాలనిపించేలా ఉంది. ప్రసంగం చివరిలో సపరివారంగా భారతదేశం రావాలని ట్రంపుగారికి మోదీ గారు ఆహ్వానం పలికారు. “ట్రంపు గారూ, మీరు నన్ను టఫ్ నెగోషియేటర్ అంటారు, “ఆర్ట్ ఆఫ్ డీల్” అంటూ మీరు ప్రపంచానికే నెగోషియేషన్స్ నేర్పారు, మీకన్నానా మిత్రమా” అంటూ హాయిగా నవ్వుతూ చమత్కరించారు.


తన ప్రసంగం మొదటిలోనే, ఈ కార్యక్రమానికి వద్దామనుకుని, టికెట్లు దొరకక, స్థలాభావం వల్ల రాలేకపోయిన వారందరినీ వ్యక్తిగతంగా క్షమాపణలు కోరటం మోదీగారి వినయానికి నిదర్శనం. అప్పుడే అయిపోయిందా, కల కరిగిపోయిందా అన్నట్లనిపించింది ఆయన ప్రసంగం పూర్తవగానే. తరువాత మోదీగారు, ట్రంప్ గారివద్దకు వెళ్ళి ఆయన్ను ఏదో కోరారు. ఆయన అంగీకారంగా తల ఊపారు. అప్పటికప్పుడు వారిద్దరూ చేతిలో చెయ్యి వేసుకుని నడుస్తూ, స్టేడియం అంతా ఒక చుట్టు చుట్టి, అందరి వద్దకూ వచ్చి, ఆత్మీయంగా చేతులూపుతూ, అందరికీ అభివాదాలు తెలిపారు. బంగారానికి తావి అబ్భినట్లనిపించింది వచ్చినవారందరికీ. అంతే, ఈ కార్యక్రమానికి రావడానికి మేము పడ్డ శ్రమ అంతా హుష్ కాకి అయిపోయింది, ఎగిరిపోయింది. ఏదో తెలియని శక్తి, విశ్వాసము నిండిపోయాయి మనసులో.


“ఆశ” మనిషిని బ్రతికిస్తుంది. జీవితాన్ని కొనసాగిస్తుంది. కోట్లాది మంది బ్రతుకులలో ఆ “ఆశ” అనే చిరుదీపాన్ని వెలిగించగలిగినవాడే నేత. అటువంటి నేత దర్శనమైనందుకు నాకు ఒడలు పులకరించింది. అపరాహ్నం ఒంటిగంటా నలభై నిముషాలైనా, లంచి కి లేట్ అయిపోయినా, అసలు ఆకలి అన్నదే తెలియలేదు. కడుపు కన్నా ముందు, మనసు నిండిపోయింది, అందుచేత. మోదీగారికీ, మా దేశాధ్యక్షుడు ట్రంపు గారికి వీడ్కోలు చెప్పి, బైటికొచ్చాము. వాలంటీర్లు వచ్చినవారందరికీ వీడ్కోలు చెబుతూ, అందరికీ ఉచితంగా కారప్పూస పొట్లాలు పంచిపెట్టారు. సావనీరు ఇచ్చారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏవిధమైన అడ్డంకులూ లేకుండా, చక్కని ప్రణాళికతో, ఇంత సాఫీగా నడిపించిన టెక్సస్ ఇండియా ఫోరం వారికీ, వారికి సహాయపడిన దాదాపు 160 సంస్థలకీ, వారి వాలంటీర్లకీ పేరు పేరునా కృతజ్ఞతలు.

Phani Dokka with his brothers


ఈ కార్యక్రమంలో, అనుపం ఖేర్ లా ఉన్న ఒకాయన గాంధీగారి వేషం వేసుకు వచ్చి, కాసేపు అటూ ఇటూ ప్రజల మధ్య తిరిగి అలరించారు.
మరో మాట : భారత జాతీయగీతం పాడటంలో అపశ్రుతులు దొర్లడం మాత్రం కాస్త బాధ కలిగించింది (కారణాలు ఏవైనప్పటికీ).
బైటికి వచ్చిన తరువాత, రోడ్డుకి అటువైపు కొందరు భారతదేశానికి వ్యతిరేకంగా, భారతీయులను పరుషమైన పదాలతో, హీనమైన పోలికలతో నిందిస్తూ ఏవో కార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ కనిపించారు. బహుశా ఓ పాతికమంది ఉంటారేమో. మండే హ్యూష్టను ఎండలో, ఆ ఉక్కపోతలో, తాము నమ్మిన సిద్ధాంతంకోసం పోరాడుతున్నారు ఆ జీవులు. వారి దేశభక్తి వారిది. ఏంచేస్తాం. వారికి కాస్త చల్లటి మజ్జిగ ఎవరన్నా ఇస్తే బాగుండును అనిపించింది నాకు.
ఇంతా చదివాకా, ఇంకా ప్రియతమ భారత ప్రధాని గారి పరిపాలన పట్ల అపనమ్మకంతో ఉండేవారికోసం ఒక సినిమా డైలాగు ” కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్”.
అంతే… !!

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →