ఇల్లాలికి కూలి!
భర్త తన ఆదాయంలోంచి నెలకు కొంత ధనం తన ఇల్లాలికి ఇవ్వాల్సిందే!కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లుగా వచ్చిన వార్తను పత్రికలలో చూసి విస్తుపోయాను.ఇల్లాలితో రోజంతా దర్జాగా సపర్యలు చేయించు కుంటున్నారా? అయితే ఇకపై ఉచితంగా వారి సేవలు పొందడం కుదరదు. మీ చేతిలోకి టీ అయినా ప్లేట్లోకి భోజనమైనా ఒంటిపైకి ఉతికిన దుస్తులైనా రావాలంటే. భార్యకు నెల నెలా జీతం చెల్లించాల్సిందే! ఇంటెడు చాకిరీని ఓపిగ్గా చేసుకుంటూ, ఇంటిని చక్కబెట్టే గృహిణుల శ్రమకు తగిన ప్రతిఫలం కల్పించాలని కేంద్రం యోచిస్తోంది. భార్యలకు భర్తలు తమ ఆదాయంలో కొంత భాగాన్ని చెల్లించడం తప్పనిసరి చేసే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. గృహిణులకు సామాజిక-ఆర్థిక సాధికారత కల్పించాలన్నదే తమ కర్తవ్యమని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి కృష్ణా తీరథ్ చెప్పారు. ఈ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం సర్వే కూడా చేయించిందట! ‘మీరేం పని చేస్తున్నారని గృహిణులను అందులో ప్రశ్నించగా.. ఏమీ చేయట్లేదన్న జవాబే చాలా మంది నుంచి వచ్చింది’. ఇంట్లో గృహిణులు చేసే పని కూడా ఆర్థిక కార్యకలాపమే(ఎవరు కాదన్నారో!).అయితే దానికి ఓ విలువంటూ లేకుండా పోతోంది.అందుకే ఇంట్లో వారి పని విలువను లెక్కగట్టేందుకు ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు మహారాజశ్రీ మన ప్రభుత్వంవారు. దీనివల్ల వారికి మరింత సామాజిక సాధికారతా గుర్తింపు లభిస్తుందట! ‘భర్త ఆదాయంలోంచి భార్యకు కొంత ధనం కేటాయిస్తే… ఆ సొమ్మును పిల్లల పౌష్టికాహారానికి, చదువుకు, మొత్తంగా ఆ ఇంటి బాగోగులకు వినియోగించవచ్చు’ అని తీరథ్ వివరించారు.
ఈ ప్రతిపాదన ప్రస్తుతం చర్చల దశలోనే ఉందని, త్వరలో వివిధ రాష్ట్రాల మంత్రులతో దీనిపై చర్చిస్తామని చెప్పారు. ఇదీ ఆ వార్త పూర్తి సారాంశం.స్త్రీలు చేస్తున్న సేవలు నిజంగా unproductive labour గానే గుర్తింపు లేకుండా పోయిన మాట వాస్తవం.నూటికి నూరుపాళ్ళు నిజం.గృహిణులకు సామాజిక-ఆర్ధిక సాధికారత కల్పించాలన్న ఆలోచన చాలా కాలం నుండే ఉంది.మహిళా సంఘాలతో పాటుగా,పలు అభ్యుదయ వాదులు కూడా ఈ అంశాన్ని చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లు,చాలా కాలం నుండి గగ్గోలు పెడుతున్నారు.కేంద్ర ప్రభుత్వం గృహిణులకు పైన చెప్పిన విధంగా ఆర్ధిక సాధికారత కల్పించాలని అనుకోవటం పూర్తి అవివేకమే! మరో విధంగా చెప్పాలంటే స్త్రీ జాతి యావత్తును అవమానించినట్లే!పాశ్చాత్య దేశాల్లో కూడా లేని ఈ విషసంస్కృతిని మనదేశంలో ప్రవేశపెట్టబోయే ఘనత మనదే!బహుశ:ఇటలీలో ఇటువంటి సాంప్రదాయం,చట్టం ఉందేమో!భారత దేశపు ఔన్నత్యం తెలియని మూర్ఖుల ఆలోచన ఇది.భారత దేశంలో స్త్రీని దైవంగా కొలుస్తారు.ప్రకృతికి ప్రతిరూపమే స్త్రీ. ఆమె చేసే సేవలు వెలకట్టలేనివి.ఆ’ఘర్మజలానికి’ ఖరీదు కట్టే షరాబు లేడు.
ఇరవయ్యి ఏండ్లు తల్లితండ్రుల వద్ద అల్లారుముద్దుగా పెరిగి,ముక్కూమొహం తెలియనివాడి చిటికెన వేలు పట్టుకొని మరో ఇంటికి వచ్చి–ఇదంతా నాది,వీరందరూ నావారు అనే భావనను పెంచుకున్న ఇల్లాలి జీవితమే త్యాగమయం.అటువంటి స్త్రీమూర్తి సేవలకు విలువకట్టటం మనలను పుట్టించిన బ్రహ్మ తరం కూడా కాదు.మేఘాలు కురిపించిన వర్షాలకు ప్రతిఫలం ఎంత?వెన్నెల కురిపించిన చంద్రుడికి ప్రతి ఫలం ఎంతని ఇవ్వగలం!ప్రకృతి ప్రతిఫలం ఆశించకుండా మానవ కళ్యాణానికి తోడ్పడుతుంది.గీతా సారం కూడా ఇదే!స్త్రీ చేసే సేవలు కూడా అటువంటివే!వారు చేసిన సేవలకు విలువ కట్టడానికి కొలమానం ఏది?ఎక్కడుంది? మన వంశాంకురాలైన పిల్లలను నవమోసాలు మోసి,కని,రక్త మాంసాలు కరగించి పాలిచ్చి పోషించి,వారిని పెద్దవారిని చేసిన ఆమె సేవలకు విలువకట్టగలమా?తాను కొవ్వొత్తిలా కరగిపోతూ ఇతరులకు వెలుగు పంచే ఆమెను మన హృదయపు కోవెలలో ఒక దేవతగా కొలవాలి.అదే ఆమె సేవకు తగిన గుర్తింపు.భర్త సహృదయుడు, అర్ధం చేసుకునే వాడైతే చాలు,అంతకన్నా ఏ గృహిణీ మరేమీ కోరుకోదు.నిజానికి ఇల్లాలు ఇంటికి రాణి.అటువంటి రాణిని బంత్రోతుగా చేయాలనే ఆలోచనే అసహ్యకరమైనది.అన్ని రంగాలలో మహిళలు స్వయం కృషిలో పైకి వస్తున్న ఈ రోజుల్లో, ‘ఇల్లాలికి జీతం ఇచ్చే బిల్లు’ను తేబోవటం ఒక అనాగరిక చర్యే కాక,స్త్రీ ఆర్ధిక,సామాజిక సాధికారత మీద ప్రభుత్వానికి అవగాహన లేనట్లు స్పష్టమౌతుంది.అంతే కాక ప్రభుత్వపు ద్వందనీతికి ఇదో ఉదాహరణ.దేశంలో నిరుద్యోగ సమస్య తాండవిస్తుంటే, ఇటువంటి చట్టాలను తెస్తే ఆడ,మగవారికి కూడా పెళ్ళిళ్ళు కావు.గతంలో చేసిన సేవలకు బకాయిలు కూడా చెల్లించమంటే,చాలా మంది పురుషులు బకాయిలు చెల్లించలేక సన్యసిస్తారు! భార్యా భర్తలమధ్య ఉండవలసినది ముఖ్యంగా ప్రేమ ,అవగాహన.ఆ దివ్యమైన ‘మిధునం’కు ఆర్ధిక అవసరాలు అనే అంశం పెద్ద అడ్డంకి కాదు,అసలు సమస్యే కాదు.భార్యా భర్తలు,సంసారం అనే కాడిని భుజాన వేసుకొని సజావుగా బండిని సమంగా లాక్కొస్తుంటారు ఈ దేశంలో. ఇదంతా, చూడబోతే–ఓటు బాంక్ రాజకీయం లాగా కనబడుతుంది. సగం శాతం మంది ఉన్న మహిళలను ఆకట్టు కోవటానికి చేసిన కుటిల ఆలోచనలా ఇది కనబడుతుంది. ఓట్ల కోసం తాపత్రయపడే నేతలకు ఇటువంటి ఆలోచనలు కాక మంచి ఆలోచనలు ఎలా వస్తాయి?
ఇంటికి దీపం ఇల్లాలే!
టీవీయస్.శాస్త్రి
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.