ఐపీఎల్ హీరోస్..సన్ రైజర్స్!
అదో అద్భుత గట్టం… సమిష్టి పోరాటం…. ఉత్కంఠ పోరులో చిరస్మర విజయం… అందరి ఊహలను తలకిందులు చేస్తూ… తామేమీ ఎవరికీ తీసిపోమంటూ ఐపీఎల్-9లో విజేతగా నిలిచింది హైదరాబాద్ టీం సన్‌రైజర్స్. బెంగళూరు జట్టు రాయల్ ఛాలెంజర్స్‌పై 8పరుగుల తేడాతో గెలిచి కప్‌ను సొంతం చేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ తుదిపోరులో సొంతగడ్డపై ఓడిపోవడం రాయల్ ఛాలెంజర్స్‌కు బాధ కలిగించే అంశమే.
టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ వార్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మంచి ప్రారంభాన్ని అందిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జోడీ డేవిడ్ వార్నర్ (69: 38 బంతుల్లో, 8 పోర్లు, 3 సిక్సర్లు), శిఖర్ ధవన్ (28: 25 బంతుల్లో 3 ఫోరు, 1సిక్సర్) మరోసారి అద్భుత ఆరంభాన్నిచ్చారు. తొలుత 4ఓవర్లను ఆచితూచి ఆడిన ఇద్దరూ ఐదో ఓవర్‌నుంచి బాదడం మొదలు పెట్టారు. వాట్సన్ వేసిన ఆ ఓవర్లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదిన వార్నర్ స్కోరుబోర్డును రాకెట్ వేగానికి తీసుకెళ్లాడు.
మరోవైపు గేల్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ అందుకోలేకపోవడంతో బతికిపోయిన ధవన్ సైతం బ్యాటింగ్‌లో వేగం పెంచడంతో పవర్ ప్లే ముగిసేసరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ నష్టపోకుండా 59 పరుగులు చేసింది. ఈ దశలో బౌలింగ్‌కు దిగిన బెంగళూరు లెగ్‌స్పిన్నర్ చాహల్ ధవన్ ఔట్ చేసి తొలిదెబ్బ తీశాడు. అయినా వార్నర్ వెరవలేదు. బౌలర్ ఎవరైనా బాదుడు కామనే అన్నట్లుగా ధూమ్‌ధామ్‌గా పరుగుల వరద పారించాడు. మరోవైపు హెన్రిక్స్ (4) పరుగులకే వెనుదిరిగినా యువరాజ్ (38: 23 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అండగా వార్నర్ దూకుడు కొనసాగింది. చివరకు పేసర్ అరవింద్ వార్నర్‌ను ఔట్ చేయడంతో బెంగళూరు బౌలర్లు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
ఒకవైపు వేగంగా పరుగులు చేసే ప్రయత్నంలో యువీ కూడాజోర్డాన్ బౌలింగ్‌లో వెనుదిరగడంతో సన్‌రైజర్స్ స్కోరుబోర్డు కాస్త నెమ్మదిగా కదిలేలా కనిపించింది. అయితే ఈ దశలో బెన్ కటింగ్ (39 నాటౌట్: 15 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రెచ్చిపోయాడు. రాయల్ బౌలర్లు జోర్డాన్, వాట్సన్‌ల బంతులను ఊచకోత కోసాడు. కొడితే బౌండరీ లేదంటే సిక్సర్ దీంతో 180 పరుగులు చేస్తే గొప్ప అన్న స్థితి నుంచి కటింగ్ జోరుతో సన్‌రైజర్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఏకంగా 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో జోర్డాన్ (3-45) వికెట్లు తీసుకోగా అరవింద్ 2, చాహల్ 1 వికెట్ పడగొట్టాడు.
కాగా బెంగళూరు టీం రాయల్ చాలెంజర్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి విజయానికి కాస్త దూరంలో ఆగింది. ఓపెనర్లు క్రిస్‌గేల్ (76: 38 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లు), కెప్టెన్ కోహ్లీ (54: 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. గేల్ సిక్సర్ల మోత మోగించడం మరోవైపు కోహ్లీ నిలకడగా ఆడుతుండడంతో బెంగళూరు జట్టు విజయం దిశగా సాఫీగా సాగినట్లుగా కనిపించింది. వీరిద్దరూ కేవలం 10. 3 ఓవర్లలో 114 పరుగులు జోడించారు. ఈ దశలో కటింగ్ గేల్‌ను ఔట్ చేయడం అనంతరం కోహ్లీ ని బరీందర్ బోల్తా కొట్టించడంతో బెంగళూరు ఒత్తిడిలో పడింది. దీంతో డివిలియర్స్ (5), వాట్సన్ (11), రాహుల్ (11) పరుగులకే చేతులెత్తేయడంతో హైదరాబాద్ జట్టుదే పై చేయిగా నిలిచింది. చివరలో సచిన్ బేబి (18నాటౌట్: 10 బంతుల్లో 1 పోర్, 1 సిక్సర్ ) పోరాడినా పరుగుల అంతరాన్ని తగ్గించడం మినహా ఏం చేయలేకపోయాడు. స్లాగ్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసిన భువనేశ్వర్ , ముస్తాఫిజుర్ హైదరాబాద్ విజయంలో కీలకపాత్ర పోషించారు. కటింగ్ 2 వికెట్లు పడగొట్టాడు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.