ప్రజలు అవమానిస్తే పెళ్ళి చేసుకుంటా: ఇరోమ్ షర్మిల
మణిపూర్ ఉక్కుమహిళ ఇరోమ్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల్లో తనను ప్రజలు తిరస్కరిస్తే పెళ్ళి చేసుకుంటానని అన్నారు. ప్రజలు తనను అవమానిస్తే అది తన జీవితంలో కొత్త అధ్యాయానికి తెరతీస్తుందన్నారు.ఇదిలాఉండగా.. షర్మిల దీక్ష విరమణపై కొన్ని మణిపూర్ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు షర్మిలకు కల్లబొల్లి కబుర్లు చెప్పి రాజకీయాల్లోకి లాగుతున్నాయని మండిపడుతున్నాయి. రాజకీయ పార్టీల మాటలు విని షర్మిల దీక్ష విరమించారని ఆరోపిస్తున్నాయి. దీంతో షర్మిల ఉన్న ఆస్పత్రి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈశాన్య రాష్ట్రాల్లో సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలంటూ షర్మిల ఆమరణ దీక్ష చేపట్టారు. సుదీర్ఘంగా 16 సంవత్సరాల పాటు ఆమె దీక్షను కొనసాగించారు. ఆమె ఆరోగ్యం బాగోకపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు ఆమెకు ముక్కు ద్వారా ఫ్లూయిడ్స్ అందజేశారు. అయితే ఆగస్టు 9న షర్మిల తన దీక్షను విరమించారు. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. దీక్ష విరమణ నేపథ్యంలో షర్మిల తాను మణిపూర్ ముఖ్యమంత్రిని అవుతానని ప్రకటించారు. దీక్ష విరమించినా ఈశాన్య రాష్ట్రాల్లో సైనికల బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేసేవరకు గోళ్లు కత్తిరించుకోనని, జుత్తు దువ్వుకోనని, ఇంటికి వెళ్లి తన తల్లితో మాట్లాడబోనని స్పష్టం చేశారు. ఒకవేళ ఎన్నికల్లో ప్రజలు తనను తిరస్కరిస్తే మాత్రం వివాహం చేసుకుని స్థిరపడతానని వెల్లడించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.