భూమాకు హోం శాఖ ఇస్తున్నారా?
విజయవాడ కాల్‌మనీ కేసు, తుని విధ్వంసం ఘటనలో హోం మంత్రి నిర్లిప్తత, సరిగా స్పందించకపోవడం తదితర కారణాల దృష్ట్యా ఆయన్ను తప్పిస్తారని..ఆయన స్థానంలో మరో వ్యక్తికి హోం శాఖ ఇస్తారన్న వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నా తాజాగా మాత్రం జగన్ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఓ సీనియర్ ఎమ్మెల్యే మాత్రం మంత్రి వర్గ ప్రక్షాళనలో హోం శాఖ తనదే అని తన సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. గతంలో టీడీపీలో పలు పదవులు అనుభవించి తర్వాత జగన్ పార్టీలో చేరి తిరిగి టీడీపీ గూటికి చేరుకున్న నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హోం శాఖ తనకే ఇస్తారని ప్రచారం చేసుకుంటున్నట్టు సమాచారం. రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడం, రాయలసీమకు చెందిన వ్యక్తి కావడం… పార్టీలో చేరేటప్పుడు మంచి భవిష్యత్తు ఇస్తామన్న హామీ తనకు కలిసొచ్చే అంశంగా ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.
భూమా ఆశలు ఎలా ఉన్నా మరో టాక్ ప్రకారం ప్రస్తుతం కాపు ఉద్యమం, కాపు రిజర్వేషన్ల దృష్ట్యా చంద్రబాబు చినరాజప్పను తప్పించే సాహసం చేయరని, ఒక వేళ ఆయన్ను తప్పించినా అదే సామాజికవర్గానికి చెందిన వ్యక్తికే ఆ బాధ్యతలు ఇస్తారని తెలుస్తోంది. మరి ఈ లెక్క ప్రకారం భూమా ఆశలు ఎంత వరకు నెరవేరతాయో చూడాలి. ఇక ఆగస్టు లేదా సెప్టెంబర్లలో మంత్రి వర్గ విస్తరణ ఉండనుందట. అప్పుడే లోకేష్‌ని మంత్రి వర్గంలో తీసుకోవడంపైనా చంద్రబాబు స్పష్టత ఇవ్వనున్నారని తెలియవస్తోంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.