కంభంపాటికి బాబు హ్యాండ్ ఇస్తారా?
ఢిల్లీలో కీలకమైన ప్రభుత్వ అధికార ప్రతినిధి పదవిని అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంటాయి. ఇది రాజకీయ పదవే అయినప్పటికీ…కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం, ఢిల్లీ రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుని పార్టీ నాయకత్వానికి చేరవేయడం, రాష్ట్ర పెండింగ్ ప్రాజెక్టుల స్థితిగతులను ఆయా ప్రభుత్వ శాఖల మంత్రులు, ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లి, వాటిని క్లియర్ చేయించుకోవడం వంటి అంశాలు ప్రభుత్వ అధికార ప్రతినిధి చూస్తుంటారు. చాలాకాలం పాటు టీడీపీ నుంచి జాతీయ రాజకీయాలను బాబు పక్షాన పర్యవేక్షించిన అనుభవం ఉన్నందున అధికారం వచ్చిన తర్వాత కంభంపాటికి ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు.అయితే, ఆయన పదవీకాలం ముగిసి 20 రోజులు దాటినప్పటికీ కొనసాగింపుపై క్లారిటీ రావడంలేదు. తనకు రాజ్యసభ ఇవ్వనందున, తిరిగి అదే పదవి కొనసాగించాలని కంభంపాటి కోరుతున్నారు. అయితే కంభంపాటితో పాటు మరో ముగ్గురి పేర్లు ఆ పదవికి ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
చంద్రబాబుకు సన్నిహితుడైన మాజీ ఐఏఎస్ అధికారి, స్కిల్ డెవలప్మెంట్ డైరక్టర్గా కొనసాగుతున్న కె.లక్ష్మీనారాయణ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గంటా సుబ్బారావు, ఐటి సలహాదారు జె.సత్యనారాయణ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ కంభంపాటిని తిరిగి కొనసాగించకపోతే, అనుభవంతోపాటు విధేయత, నమ్మకస్తుడైన లక్ష్మీనారాయణ వైపే మొగ్గు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, ఆ పదవిని ఒకే సామాజికవర్గానికి చెందిన వారికే ఇస్తుండటం వల్ల, ఈసారి మరొక సామాజికవర్గానికి చెందిన వారిని ఎంపిక చేస్తారనే చర్చ కూడా సాగుతోంది. ఢిల్లీలో సీఎం ఓఎస్డి పదవిని కూడా, అదే సామాజికవర్గానికి ఇచ్చారని ఈ నేపథ్యంలో పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.