కాశీ పంచకము
ఆది శంకరులు దేశమంతా పర్యటిస్తూ కాశీ పట్టణంలో చాల కాలం గడిపారు. ఆ నగరంలోనే ఆయన కాశీ పంచకం, మనిషి తాను ఎవరో తెలుసుకునే సాధనమైన మనీషా పంచకం రచించారు.
కాశీ పంచకము, తాత్పర్యము..
మనోనివృత్తిః పరమోపశాన్తిః, నతీర్థవర్యా మాణికర్ణికాత్ర !
జ్ఙాన ప్రవాహా విమలాదిగఙ్గా, స కాశికాహం నిజబోధరూపా !!
ఎక్కడైతే మనోవృత్తితో పరమకాంతివెలుగుతుందో,అదే తీర్థములలో శ్రేష్ఠమైన మణికర్ణిక , జ్ఙానప్రవాహముతో కూడిన అది గంగతోకూడినటువంటి కాశీ క్షేత్రమును సృష్టించుచున్నది. ‘బోధ’ కూడ ఇట్టిదే, బోధ స్వరూపుడనైన నేనే కాశికా స్వరూపుడను!
యస్యామిదం కల్పితమిన్ద్రజాలం, చరాచరం భాతి మనోవిలాసమ్ !
సచ్చిత్సుఖైకా పరమాత్మరూపా స కాశికాహం నిజబోధరూపా !!
దేనిలో మనస్సు యొక్కచాంచల్యం , మాయ అనే ఈ కల్పిత ప్రపంచము ఉన్నదో , ఏది సత్ చిత్ సుఖ స్వరూపమో, ఏకము,పరమాత్వ స్వరూపము, ఆ స్వరూపాన్ని, ఆ బోధ స్వరూపుడనైన నేనే కాశికా స్వరూపుడను!
కోశేషు పఞ్చస్వధిరాజమానా, బుద్ధిర్భవానీ ప్రతి దేహగేహమ్ !
సాక్షీ శివః సర్వగతోన్తరాత్మా, సా కాశికాహం నిజబోధరూపా !!
దేహమంతా వ్యాపించి,ప్రతిదేహమును తన ఇల్లుగా మార్చుకొనిన బుద్ధియే పార్వతి . అంతరాత్మ, సర్వసాక్షి ఐనవాడే శివుడు. ఈ ఉభయులూ కలిసిన క్షేత్రము కాశిక. ఆ బోధ స్వరూపుడనైన నేనే కాశికా స్వరూపుడను!
కాశ్యాం హి కాశతే కాశీ కాశీ సర్వప్రకాశికా !
సా కాశీ విదితా యేన తేన ప్రాప్తికా కాశికా !!
ఆత్మజ్ఙానమందే కాశిక ప్రకాశించును, ఈ జ్ఙానరూపమగు కాశికయే అన్నిటినీ ప్రకాశింప
చేస్తున్నది . ఇటువంటి కాశికను ఎరిగిన వానికే కాశీ ప్రాప్తి.
కాశీ క్షేత్రం శరీరం త్రిభువనజననీ వ్యాపినీ జ్ఙానగఙ్గౌ
భక్తిః శ్రద్ధా గమేయం నిజగురుచరణ ధ్యానయోగః ప్రయాగః!
విశ్వేశోయం తురీయఃసకలజనమనఃసాక్షిభూతోన్తరాత్మా
దేహే సర్వం మదీయే యది వసతి పునస్తీర్థమన్యత్ కిమస్తి!!
ముల్లోకాలకు జననియైన జ్ఙానగంగయే ప్రవాహము, ఈ దేహమే కాశిక్షేత్రము,భక్తి శ్రద్ధలే గయ,ధ్యాన యోగమే ప్రయాగ, తురీయమే విశ్వేశ్వరుడు,ఆయనే అంతరాత్మ, మనస్సాక్షి! ఈ సర్వమూ నా శరీరమునందే ఉన్నవి! ఈ నేనే కాశికా స్వరూపుడను. ఇక వేరు తీర్థములు ఎందుకు?.
ఇతి శ్రీ శఙ్కర భగవత్పూజ్యపాద విరచిత కాశీపఞ్చకమ్
ఇది శ్రీ శంకర భగవత్పాదుల విరచితమైన కాశీ పంచకము.
టీవీయస్.శాస్త్రి
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.