ముఖ్యమంత్రులకు ఏమైంది?
ఇన్ని రోజులు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకే వాస్తు… జ్యోతిష్యాలపై నమ్మకం ఉందని అనుకున్నాం కానీ.. ఈ జాడ్యం పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా సోకిందని ఇప్పుడే అర్థమవుతోంది. ఈ జ్యోతిష్యాల పిచ్చితో కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. రాష్ట్రాలను మరింత అప్పుల పాలు చేస్తున్నారు. తాజాగా ఈ కోవలోకి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య కూడా వచ్చి చేరారు. ఇంతకీ విషయమేమిటంటే ఓ వారం కిందట.. అంటే జూన్ 2న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కారుపైన ఒక కాకి వాలింది. దాన్ని ఎంత తోలినా అది మాత్రం కారు మీద నుంచి వెళ్లిపోవటానికి ఏ మాత్రం ఇష్టపడలేదట. కాకిని అపశకునంగా భావించే సిద్ధరామయ్య.. వెంటనే కారును వదిలేసి.. కొత్త కారు కొనేందుకు రెఢీ అయిపోయారు. శనివారం ఆయన రూ.35 లక్షలు పోసి టొయోటా ఫార్చ్యూనర్ కారును కొనుగోలు చేశారు.
అంతే కాకి వాలటం వల్లనే ఆయన పాత కారును వదిలేసి.. కొత్త కారు కొన్నారన్న వార్తలు కర్ణాటక వ్యాప్తంగా ఛానళ్లు హోరెత్తించటం.. అది కాస్త ఇప్పుడు జాతీయ స్థాయిలో ఇప్పుడో హాట్ వార్తగా మారింది. ఆ మధ్యన ఖరీదైన వాచీని ధరించిన అందరి దృష్టిలో పడ్డ సిద్ధరామయ్యకు.. ఈ కాకి – కారు వ్యవహారం ఆయన ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేసిందన్న మాట వినిపిస్తోంది. కీలక స్థానాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు వారి నమ్మకాల కోసం ప్రజా ధనాన్ని ఇలా నీళ్లలా ఖర్చుచేయడం అంత మంచిది కాదు. దీన్ని ఎవరూ సమర్థించరు కూడా.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.