కేసీఆర్.. మోస్ట్ పాపులర్ సీఎం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కె.చంద్రశేఖర్ రావు తన మార్కు రాజకీయాలతో ముందుకు దూసుకుపోతున్నారు. గత అభివృద్ధితో పోల్చుకుంటే ఈ రెండేళ్లలో జరిగిన అభివృద్ధే భేష్ అనేటట్లుగా ప్రజలకు పరిపాలన అందిస్తున్న కేసీఆర్ రికార్డులను సొంతం చేసుకుంటున్నారు. వీడీపీ అసోసియేట్స్ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో కేసీఆర్కు మరో గౌరవం దక్కింది. ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో కేసీఆర్ మోస్ట్ పాపులర్ సీఎంగా నిలిచారు. దేశవ్యాప్తంగా 86శాతం మంది సీఎం కేసీఆర్ పాలనపై సంతృప్తికరంగా ఉన్నట్టు వీడీపీ అసోసియేట్స్ సర్వే వెల్లడించింది. తద్వారా దేశంలోని మిగతా సీఎంలను తోసిరాజని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రప్రథమ స్థానంలో నిలిచారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు జాతీయ స్థాయిలో ఆకట్టుకుంటున్నాయని ఈ సందర్భంగా ఆ సర్వే తేల్చింది. ఇదిలాఉండగా ఏపీ సీఎం – తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పాలనపై 69 శాతం మంది మాత్రమే సంతృప్తికరంగా ఉన్నట్టు సర్వే పేర్కొంది. సీఎం కేసీఆర్ తర్వాతి ర్యాంకుల్లో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ – పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ నిలిచారు. కేసీఆర్ ఈ గౌరవంతో పాటు గతంలోనూ పలు జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. కాగా కేసీఆర్కు ఇన్ని అవార్డులు వస్తున్నా ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం తెలంగాణలో దొరల పాలన నడుస్తోందని, కేసీఆర్ కుటుంబ సభ్యులు అంతా ఒక్కటై రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శిస్తుండడం గమనార్హం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.