దసరా నుంచి పాలన షురూ!
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన పాలనను జెట్ స్పీడ్‌లో పరుగెత్తిస్తున్నారు. అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. అంతేకాదు వారికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. కేసీఆర్ అలా చేయడానికి కూడా ఒక కారణం ఉంది. అదే దసరా నుంచి కొత్త జిల్లాల నుంచి పాలన. అందులో భాగంగానే అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా జిల్లా కలెక్టర్లతో సమావేశమైన కేసీఆర్ పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేస్తున్న 17 జిల్లాలకు కేసీఆర్ ఒక్కో జిల్లాకు కోటిన్నర రూపాయల నిధులను విడుదల చేశారు. వీటితో పాటు కలెక్టరేట్ ఏర్పాటుకు రూ.కోటి, పోలీస్ కార్యాలయం ఏర్పాటుకు రూ.50 లక్షల చొప్పున నిధులను మంజూరు చేశారు. కొత్త జిల్లాల్లో పనిభారం లేకుండా ఉండేందుకు శాఖల కుదింపు చేస్తున్నట్లు సీఎం చెప్పారు. ఒకే పనితీరు కలిగిన శాఖలన్నీ ఒకే గొడుగు కిందికి తెచ్చేందుకు చర్యలు తీసుకున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. దసరా నుంచి కొత్త జిల్లాలతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు అన్నీ ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.
కొత్త జిల్లాల్లో పనిభారాన్ని బట్టి పరిపాలనా విభాగాలు ఉండాలని తెలిపారు. అధికారుల సర్దుబాట్లు, కొత్త ఉద్యోగుల నియామకాలు జరగాలని సూచించారు. దసరా నాడు కొత్త జిల్లాలు ప్రారంభమైన తర్వాత.. మొదటి రోజు నుంచే రెవెన్యూ, పోలీసు శాఖలు ప్రారంభం కావాలని, మిగిలిన శాఖల కార్యాలయాలు, అధికారుల నియామకం ఆ తర్వాత చేపట్టాలని కేసీఆర్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తూ ఉండాలని ఆయన సూచించారు. ఏది ఏమైనా కేసీఆర్ మాత్రం పాలనను పరుగులు పెట్టిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.