క్లారిటీ ఇచ్చిన కేసీఆర్!
“కొత్త జిల్లాల ఏర్పాటు అనేది పరిపాలనా సౌలభ్యం కోసం.. పాలన అందుబాటులో ఉండటం కోసం.. ప్రజల క్షేమాన్ని కాంక్తిస్తూ చేసిన నిర్ణయం. దీనికి విస్తృత స్థాయిలో ప్రజల ఆమోదం ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఈ విషయాన్ని పొందుపరిచాం. అందుకే ప్రజలు మాకు అధికారం కట్టబెట్టారు. అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతించాయి. తమ సలహాలు సూచనలు అందించాయి. కొత్త జిల్లాల ఏర్పాటుకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న జిల్లాల పునర్విభజన చట్టాన్ని తెలంగాణకు అన్వయించుకున్నాం. ఆ చట్టం ప్రకారమే జిల్లాల ఏర్పాటు జరుగుతుంది“ అని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ అఖిల పక్షం సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అన్నమాటలు ఇవి. అయితే కొత్త జిల్లాల వ్యవహారం ప్రస్తుతం దుమారం రేపుతున్న నేపథ్యంలో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు పూర్తి క్లారిటీ ఇచ్చారు. ప్రజా స్వామ్య పద్ధతిలో ప్రజల అభీష్టం మేరకు కొత్త జిల్లాలపై అంతిమ నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. అంతేకాదు ఏ గ్రామం.. ఏ మండలం.. ఏ జిల్లా ఎక్కడా ఉంటుందనేది ప్రజలకు అందరికీ తెలిసేలా పేపర్లలో ప్రకటలు ఇస్తున్నట్లు కేసీఆర్పేర్కొన్నారు.
నేడు విడుదల కానున్న నోటిఫికేషన్…
ఇదిలా ఉంటే… జిల్లాల పునర్వ్యవస్థీకరణ నోటిఫికేషన్‌కు సమయం రానే వచ్చింది. 27 జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్ సోమవారం విడుదల కానుంది. జిల్లాలకు ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల అనంతరం నాలుగు అంచెల్లో అభ్యంతరాలు, అభిప్రాయాలను తెలంగాణ సర్కార్ స్వీకరించనుంది. ఇందుకు ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నారు. ప్రజలెవరైనా ఆన్లైన్లోనే నేరుగా అభిప్రాయాలను పొందుపరచవచ్చు. నాలుగు అంచెల్లో తహసీల్దార్, రెవెన్యూ డివిజనల్ కార్యాలయం, కలెక్టరేట్‌తోపాటు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కార్యాలయంలోనూ విజ్ఞప్తులను స్వీకరించనున్నారు.
ఆ తర్వాత వీటిని మన్నించారా.. తిరస్కరించారా అనే విషయాన్ని కూడా ప్రజలకు వివరించనున్నారు. సెప్టెంబరు 20వ తేదీ దాకా అభ్యంతరాల స్వీకరణ చేపట్టనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత 15 రోజుల పాటు వీటిని పరిశీలించి.. అక్టోబరు రెండోవారంలో తుది నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి సెప్టెంబర్ నెలలో మరో రెండుసార్లు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబరు 5వ, 20వ తేదీల్లో వీటిని నిర్వహించనున్నారు. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక పథకం ప్రకారం ముందుకు వెళ్తూ ప్రజలకు క్లారిటీ ఇస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.