హరికృష్ణ – కొడాలి నాని జట్టాపట్టాల్..?
టీడీపీ నేత నందమూరి హరికృష్ణ విజయవాడ పర్యటన.. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ లా మారింది. బెజవాడ బందరు రోడ్డులో 4కోట్ల రూపాయిలతో నిర్మించిన వెటర్నిటీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి హరి కృష్ణ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి హరికృష్ణతో పాటు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా హాజరయ్యారు. ఇంకో విశేషం ఏమిటంటే.. ఇద్దరు ఒకే కారులో రావడం అటు టీడీపీ ఇటు వైసీపీ నేతల్లో చర్చలకు తావిచ్చింది.
ఇక.. ఆస్పత్రి ఓపెనింగ్ కి ఎక్కువగా టీడీపీ నేతలే హాజరయ్యారు. ప్రస్తుతం ఏపీలో జంపింగ్ జిలానీల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొడాలి నాని టీడీపీ నేతలతో కలిసి తిరగడంతో.. హరికృష్ణ ద్వారా కొడాలినాని తిరిగి టీడీపీ గూటికి చేరాలని ప్రయత్నిస్తున్నారంటూ ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే తాను జగన్ వెంటే ఉంటాను కాని.. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీలో తిరిగి చేరేది లేదని కొడాలి నాని అన్నారట. ఎన్టీఆర్ పేరు మీద ఉన్న ఆస్పత్రి ఓపెనింగ్ కాబట్టి తాను హాజరయినట్లుగా చెబుతున్నారట. దీంతో కొడాలి నాని జంపింగ్ అంశంపై కాస్తంత బ్రేక్ పడినట్లేనని అయింది.
మరోవైపు.. అసెంబ్లీలో జరిగిన ఘటన విషయంలో కొడాలి నానిపై సస్పెన్షన్ వేటు దిశగా అధికార పక్షం స్కెచ్ వేస్తోందని సమాచారం. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు పడింది. ఇక వైసీపీకి చెందని మరో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సైకిల్ ఎక్కేశారు. ఇక నాని అయితే ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరై క్షమాపణ కూడా చెప్పేశారు. అయితే.. క్షమాపణ విషయంలో సభదే తుది నిర్ణయమని ప్రివిలేజ్ కమిటీ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో కొడాలి నాని టీడీపీ నేతలతో కలిసి జట్టాపట్టాల్ వేసుకుని తిరగడం రాజకీయ వర్గాల్లో చర్చలకు తావిచ్చింది.
టీడీపీ సీనియర్ నేత హరికృష్ణకు పార్టీలో సరైన గుర్తింపు లేదు. కొడాలినానితో ఆయన ఒకే కారులో రావడంతో హరికృష్ణ చూపు వైసీపీ వెపు మరలిందా అన్న చర్చలు కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నాయి. ముఖ్యంగా తన తనయుడు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో టీడీపీ అనుసరిస్తున్న వైఖరిపైనా.. మరోసారి తనకు రాజ్యసభ టికెట్ విషయంలోనూ హరికృష్ణ అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మరి తాజా పరిణామం ఆధారంగా టీడీపీ హరికృష్ణకు షోకాజ్ నోటీసు ఇస్తుందని కొందరు రాజకీయ నేతలు చర్చించుకుంటున్నారు. మరోవైపు.. వైసీపీ హై కమాండ్ కూడా కొడాలి నానికి షోకాజ్ నోటీసు ఇచ్చేఅవకాశం ఉందని కూడా ప్రచారం సాగుతోంది. అసలు ఈ అంశంపై ఏం జరగబోతోంది అన్నది తెలియాలంటే కాస్త వేచిచూడాల్సిందే.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.