కేసీఆర్‌ను మళ్లీ ప్రశ్నించిన కోదండరాం
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం గత కొద్ది రోజులుగా విమర్శల దాడి చేస్తున్నారు. కేసీఆర్ చేసే ప్రతి పనిలోనూ తప్పులు ఎత్తిచూపుతున్నారు. కేసీఆర్ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. తాజాగా కొత్తజిల్లాల ఏర్పాటుపై కోదండరాం స్పందించారు. కొత్త జిల్లాలను ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారో ప్రభుత్వం చెప్పాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. లేకపోతే ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెరుగుతాయని ఆయన అన్నారు. ఐదో షెడ్యూలులోని ఏజెన్సీ ప్రాంతాలు అన్నింటినీ ఒకే జిల్లాలో ఉంచాలని కోరారు. వరంగల్ ను రెండు జిల్లాలుగా విభజించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందో తెలపాలని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఆయన అన్నారు. కోదండరాం ఒక్కసారిగా జిల్లాల ఏర్పాటుకు గల కారణాలను – వాటి వల్ల కలిగే ప్రయోజనాలను చెప్పాలని ప్రశ్నించడంతో టీఆరెస్ ప్రభుత్వం కొంత ఇరకాటంలో పడింది. అంతేకాదు మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకోవాలనుకుంటున్న ఒప్పందంపైనా ఆయన మాట్లాడారు. ఈ విషయంలో పారదర్శకత అవసరమని సూచించారు.
ఒప్పందానికి తాము వ్యతిరేకం కాదని.. కానీ ఒప్పందం వివరాలేంటో బహిర్గతం చేయాలని కోరారు. గ్యాంగ్ స్టర్ నయీముద్దీన్ డైరీలో ఉన్న వివరాలు అన్నింటినీ కూడా బయటపెట్టాలని.. నయీంతో ఎవరెవరికి సంబంధాలున్నాయో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలను ప్రతిపక్షాలు సైతం నోరు ఎత్తని పరిస్థితులు ప్రస్తుత తరుణంలో కనిపిస్తుంటే కోదండరాం మాత్రం కేసీఆర్‌ను ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఏదేమైనా కోదండరాం తెలంగాణ సర్కార్‌కు కొరకరాని కొయ్యగా తయారయ్యారనడంలో ఎలాంటి సందేహం లేదు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.