కోహ్లీ హ్యాట్రిక్ సాధించేనా?
కరీబియన్ గడ్డపై టీమిండియా ఆడబోతున్న టెస్ట్ మ్యాచ్‌లకు ఓ ప్రాధాన్యత ఉంది. ఇది టెస్ట్ సిరీస్ కెప్టెన్ కోహ్లీకి, అలాగే కోచ్ అనిల్ కుంబ్లేకి చాలా ప్రతిష్టాత్మకమైనది. ఈ సిరీస్‌లో గెలిస్తే కోహ్లీ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకోనున్నారు. గతేడాది శ్రీలంక, దక్షిణాఫ్రికాలపై సిరీస్‌లు గెలిచిన కోహ్లి ఇప్పుడు హ్యాట్రిక్ కోసం చూస్తున్నాడు. అలాగే కరీబియన్ గడ్డపై కూడా మూడో సిరీస్ విజయాన్ని పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. 2006లో ద్రవిడ్, 2011లో ధోనిల కెప్టెన్సీలో విండీస్ గడ్డపై భారత్ సిరీస్ గెలిచింది. అయితే కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పట్నించీ ఐదుగురు బౌలర్ల వ్యూహాన్ని పక్కగా అమలు చేస్తున్న విరాట్.. ఈ మ్యాచ్‌లోనూ దీన్ని కొనసాగించే అవకాశాలున్నాయి.
ఓపెనింగ్‌లో ధావన్, విజయ్‌లను కొనసాగించి వన్‌డౌన్‌లో పుజారా స్థానాన్ని రాహుల్‌తో భర్తీ చేస్తే ఎలా ఉంటుందని మేనేజ్మెంట్ యోచిస్తోంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లకు బౌన్సీ వికెట్లను రూపొందించిన విండీస్.. రాబోయే నాలుగు టెస్టులకు ఇదే అనవాయితీని కొనసాగించనుంది. అయితే పిచ్‌లపై పచ్చిక ఉన్నా వాటి స్వభావం (స్లో)లో పెద్దగా మార్పు ఉండదని సహాయక సిబ్బంది ఆలోచన. దీంతో ముగ్గురు స్పిన్నర్లు (అశ్విన్, జడేజా, అమిత్ మిశ్రా) లను కూడా ఆడించే అవకాశం ఉంది. కాగా నేటి రాత్రి 07:30 గంటల నుంచి వెస్టిండిస్‌లో ప్రారంభమయ్యే తొలి టెస్టులో టీమిండియా ఆతిథ్య జట్టుతో అమీతుమీ తేల్చుకోనుంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.