కృష్ణా పుష్కరాల సందర్భంగా “ఆకాశవాణి – హైదరాబాదు కేంద్రం” వారు నిర్వహించిన కవి సమ్మేళనంలో నేను గానం చేసిన పద్య కవిత :
“కృష్ణా పుష్కర నీరాజనం”
———————————–
రచన : “పద్య కళాప్రవీణ” డా. ఆచార్య ఫణీంద్ర
———————————————————-
నీరము పుట్టి విష్ణుపద నీరజ యుగ్మమునందు గంగయై,
పారుచు దేవలోకముల పావనమై, శివ శీర్షమెక్కి, తా
జారి ధరిత్రి సాగి పలు స్థానములందు జనోపయోగమై,
చేరె సముద్ర గర్భమున జీవనదీ నద సంవిధానమై!
“కన్య” రాశిన్ బృహస్పతి కాలిడంగ –
పుష్కరుండు కృష్ణా నదిన్ మునిగి సేయు
పాప హరణమ్ము నా దివ్య వాహినీ జ
లములతో భక్తులకు పుష్కరముల వేళ!
రారో! భక్త జనావళి!
రారో! మరి వచ్చె పుష్కరంబులు! కృష్ణా
నీరముతో తడిసిన పలు
తీర క్షేత్రంబులందు తీర్థంబాడన్!
తూర్పున తెల్లవార – నది తోయము లందున మున్గి భక్తులున్
అర్పణ జేసి మానసము, నాచరణమ్మొనరించి స్నానమున్,
తర్పణమిచ్చి పెద్దలకు ధన్యత నొందగ వారు వీరు, సం
తర్పణ చేయుచుందురు క్షుదార్థులకు న్నట పుష్కరాలలో!
బీచుపల్లిని వెల్గు వీరాంజనేయుని
పలుకరించి కడు పావనము చెంది,
ఆలంపురము జోగులాంబను దర్శించి
శక్తి తేజస్సు సంసక్త మొంది,
శ్రీశైలమందున శివదీక్షను తరించి
కొండంత పుణ్యమ్ము కొంగు జుట్టి,
నాగార్జున గిరిపై నాట్యమ్ములే సల్పి,
అమరావతిని “బౌద్ధ” మాలపించి,
విజయవాడ క్షేత్రమ్ములో వెలసియున్న
కనకదుర్గను భక్తితో కాళ్ళు గడిగి,
అరిగి హంసలదీవిలో అబ్ధి గలియు
కృష్ణవేణి! నీరాజన మ్మిదియె నీకు!
పన్నెం డేడుల కొకపరి
నిన్నంటియు స్నానమాడి, నిష్ఠను గొలువన్-
వెన్నంటిన పాప ముడిగి
పున్నెమె యగు కృష్ణ! నీదు పుష్కర లీలన్!
— &&& —
Author:
DrAcharya Phaneendra
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.