నేటి నుంచి పుష్కర పండుగ
ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం ఉదయం 5.45కు, తెలంగాణలో ఉదయం 5.58 నిమిషాల నుంచి పుష్కరాల పండుగ మొదలైంది. 12 రోజుల పాటు సాగే ఈ పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో మూడున్నర కోట్లమంది… తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో మరో మూడున్నర కోట్లమంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా భారీ ఏర్పాట్లు చేశామని, రద్దీని తట్టుకు నేందుకు అవసరమైన బస్సులు, రైళ్లు సమకూర్చామని చెబుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో జరిగే పుష్కర స్నానాల్లో అధికభాగం… దాదాపు 80 శాతం విజయ వాడలోనే ఉంటాయి. ఆర్భాటపు ప్రకటనల సంగతలా ఉంచి రెండు రాష్ట్రాల్లోనూ పనులు నత్తనడకనే సాగాయని, నాసిరకంగానే ఉన్నాయని ఆరోపణలు వెల్లు వెత్తాయి. పుష్కరాల ముహూర్తం సమీపిస్తున్న సమయానికి కూడా పనులింకా కొనసాగుతూనే ఉన్నాయి. విజయవాడలో పుష్కర ఘాట్లకు చేరువలో ఉన్న ఖాళీ స్థలాలను వదిలిపెట్టి కిలోమీటర్ దూరంలో ఎక్కడో యాత్రికుల కోసం పుష్కర నగర్లు నిర్మించారు. కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాక తలదాచుకునేందుకు భక్తులు అంత దూరం వెళ్లవలసిన అవసరమేమిటో అర్ధంకాదు. పుష్కరాల పనుల సాకుతో ప్రార్థనా మందిరాల కూల్చివేతలు, విగ్రహ విధ్వంసాలు అందరినీ నివ్వెరపరి చాయి.
పనుల వరకూ చూస్తే తెలంగాణలోనూ పెద్ద తేడా ఏం లేదు. జూలై 15 కల్లా పనులన్నీ పూర్తికావాలని దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరుగులు పెట్టిం చినా కదలిక లేదు. దీన్ని ఆగస్టు 5కు పెంచినా ఫలితం లేదు. చివరకు 8వ తేదీకి దాన్ని సాగదీసినా ఉపయోగం లేదు. పుష్కరాలు మొదలుకావడానికి ముందు రోజు కూడా అక్కడక్కడ పనులు నడుస్తూనే ఉన్నాయి. ఒకటి రెండు చోట్లయితే పుష్కరఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన రక్షణ కడ్డీలు విరిగిపోయాయి. నిర్మించిన మట్టిరోడ్లు వర్షాలకు జాడలేకుండా పోయాయి. పుష్కరాలు ఎప్పుడు ప్రారంభమ వుతాయో చాలా ముందే తెలుస్తుంది. అయినా నెల, నెలన్నర ముందు తప్ప చేయాల్సిన పనులకు సంబంధించి స్పష్టత రాకపోవడం, నిధులు విడుదల చేయకపోవడం ఆశ్చర్యం గొలుపుతుంది.
పాలనా వ్యవహారాల్లో ఆరితేరినవారే రెండు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రులుగా ఉన్నా… గత అనుభవాలు పుష్కలంగా ఉన్నా ఈ విషయంలో వైఫల్యం చెందడం విచిత్రం. చంద్రబాబుకైతే నిరుడు గోదావరి పుష్కరాల్లో ఎదురైన చేదు అనుభవాలు ఉండనే ఉన్నాయి. పన్నెండేళ్ల కొకసారి వచ్చే పుష్కర సంరంభం లక్షలాదిమంది భక్తులను ఒకచోట చేర్చే సందర్భం. నదీ స్నానానికి వచ్చే భక్తకోటిని తిరిగి ఇళ్లకు వెళ్లేవరకూ సురక్షితంగా చూసుకోవాల్సిన బాధ్యత పాలనా యంత్రాంగానిది. ఆ బాధ్యతనైనా సక్ర మంగా, చిత్తశుద్ధితో నిర్వర్తించాలని అందరం కోరుకుందాం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.