Loading...
You are here:  Home  >  Community Events  >  Awareness  >  Current Article

Krishnarjuna Yuddham Movie Review

By   /  April 12, 2018  /  Comments Off on Krishnarjuna Yuddham Movie Review

    Print       Email

‘కృష్ణార్జున

యుద్ధం’ రివ్యూ

InCorpTaxAct
Suvidha

 

 

 

 

చిత్రం: కృష్ణార్జున యుద్ధం

న‌టీన‌టులు: నాని, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, రుక్స‌ర్ మీర్ , బ్ర‌హ్మాజీ, దేవ‌ద‌ర్శిని, నాగినీడు, ప్ర‌భాస్ శ్రీ‌ను, హ‌రితేజ‌, క‌ర్రి మ‌హేశ్‌, సుద‌ర్శ‌న్‌, ఆల‌పాటి ల‌క్ష్మి, విద్యుల్లేఖ రామ‌న్‌, పూజా రామ‌చంద్ర‌న్‌ త‌దిత‌రులు
సంగీతం: హిప్ హాప్ త‌మిళ‌
ఛాయాగ్ర‌హణం: కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని
క‌ళ‌: సాహి సురేశ్‌
కూర్పు: స‌త్య.జి
నిర్మాత‌లు: సాహు గార‌పాటి, హ‌రీశ్ పెద్ది
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: మేర్ల‌పాక గాంధీ
విడుద‌ల తేది: ఏప్రిల్ 12, 2018
నిడివి: 1: 58 నిమిషాలు
విమెన్ ట్రాఫికింగ్ (అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి అమ్మేయ‌డం).. ప్ర‌స్తుతం స‌మాజాన్ని ప‌ట్టిపీడిస్తున్న స‌మ‌స్య‌ల్లో ఒక‌టి. ఈ అంశాన్ని క‌థాంశంగా చేసుకుని రూపొందించిన చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా.. వ‌రుస విజ‌యాల ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ రూపొందించిన ఈ సినిమా గురువారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ చిత్రంపై `డెక్క‌న్ అబ్రాడ్‌’ అందిస్తున్న స‌మీక్ష మీ కోసం..

క‌థాంశం
కృష్ణ (నాని) చిత్తూరు జిల్లా అక్కుర్తి గ్రామానికి చెందిన యువ‌కుడు. అదే గ్రామానికి చెందిన స‌ర్పంచ్ (నాగినీడు) మ‌న‌వ‌రాలు రియా (రుక్స‌ర్ మీర్‌)ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు. రియా కూడా అత‌న్ని ప్రేమిస్తుంది. అయితే.. రియా ప‌రిచ‌యానికి ముందే ఓ విష‌యంలో స‌ర్పంచ్‌తో గొడ‌వ‌ప‌డి ఉంటాడు కృష్ణ‌. దీంతో.. కృష్ణ‌, రియా ప్రేమ విష‌యం తెలిసిన స‌ర్పంచ్‌.. ఆమెని హైద‌రాబాద్‌కు పంపిస్తాడు. ఇదే క‌థ‌తో స‌మాంత‌రంగా జ‌రిగే మ‌రో క‌థ అర్జున్ (నాని)ది. భార‌తీయ సంతతికి చెందిన అర్జున్‌.. యూర‌ప్‌లోని ప్రాగ్‌లో పేరున్న రాక్ స్టార్‌. అమ్మాయిల‌ని త‌న మాట‌ల‌తో, చూపుల‌తో ఈజీగా ప‌డేస్తుంటాడు. అలాగే సుబ్బ‌ల‌క్ష్మీ (అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌)ని కూడా ప‌డేయాల‌నుకుంటాడు. అయితే సుబ్బు మాత్రం.. అత‌న్ని దూరం పెడుతుంటుంది. ఆమె కోసం త‌న లైఫ్‌స్టైల్‌ను కూడా మార్చుకుంటాడు అర్జున్‌. అయిన‌ప్ప‌టికీ.. అత‌ని ప్రేమ‌ని యాక్స‌ప్ట్ చేయ‌దు. అంతేగాకుండా.. అత‌ని నుంచి దూరంగా ఉండాల‌ని.. హైద‌రాబాద్‌కు వెళ్ళిపోతుంది. క‌ట్ చేస్తే.. అటు రియా, ఇటు సుబ్బు ఇద్ద‌రూ కూడా విమెన్ ట్రాఫికింగ్‌లో బాధితుల‌వుతారు. వాళ్ళ‌ను కాపాడుకోనే ప్రాసెస్‌లో అనుకోకుండా క‌లుసుకున్న కృష్ణ‌, అర్జున్‌.. చివ‌ర‌కి విజ‌యం సాధించారా? లేదా? అనేది మిగిలిన క‌థాంశం.

విశ్లేష‌ణ‌
‘వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’.. ఇలా త‌న గ‌త రెండు చిత్రాల విష‌యంలోనూ క‌థ కంటే క‌థ‌నం మీదే ఆధార‌ప‌డ్డ మేర్ల‌పాక గాంధీ.. ఈ సినిమా విష‌యంలోనూ అదే సూత్రాన్ని అనుస‌రించారు. విమెన్ ట్రాఫికింగ్ అనే స‌మ‌స్య‌తో సినిమాని ప్రారంభించి.. ఆ స‌మ‌స్య వైపుగానే విశ్రాంతి స‌న్నివేశాన్ని న‌డిపించి.. ద్వితీయార్థం మొత్తం ఆ స‌మ‌స్య వైపే దృష్టి సారించ‌డం బాగుంది. అలాగే కొన్ని పాత్ర‌లను డిజైన్ చేసుకున్న తీరు బాగుంది. కృష్ణ పాత్రని చిత్తూరు యాస‌తో కొత్త‌గా ప్ర‌జెంట్ చేస్తే.. అర్జున్ పాత్ర‌ని ప్లే బోయ్ త‌ర‌హాలో చూపించారు. ఇద్ద‌రికీ అమ్మాయిలంటే బ‌ల‌హీన‌త ఉన్నా.. సిన్సియ‌ర్ ల‌వ్ వైపుగా న‌డిపించే స‌న్నివేశాలు బాగుంటాయి. రెండు పాత్ర‌లు చెప్పే కామ‌న్‌ డైలాగ్స్ బాగున్నాయి. కృష్ణ పాత్ర మాటిమాటికి ‘ఎవ‌రికి విన‌బ‌డ‌ని ఇళ‌యరాజా పాట నాకు మాత్ర‌మే విన‌ప‌డుతోంది’ అని చెబితే.. అర్జున్ పాత్ర ‘ఇలాంటి సిట్యుయేష‌న్‌లో సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏమ‌న్నాడో తెలుసా’ అంటూ చెబుతుండ‌డం బాగుంది. నాలుగేళ్ళు మెడిసిన్ చ‌దివిన రియా.. అప్పుడ‌ప్పుడు శాస్త్రీయ నామాలు వాడ‌డం బాగుంది. ఇక‌ సుద‌ర్శ‌న్ పాత్ర పెయింటింగ్‌లో ఆంగ్ల‌క్ష‌రాల‌తో అచ్చుత‌ప్పులు రాయ‌డం.. క‌ర్రి మ‌హేశ్ పాత్ర (కృష్ణ ఫ్రెండ్‌) క్యారెక్ట‌రైజేష‌న్‌.. ఇలా ఒక్కో పాత్ర‌ ప‌రంగా ద‌ర్శ‌కుడు చాలా శ్ర‌ద్ధ తీసుకున్నారు. అలాగే నాని, బ్ర‌హ్మాజీ, దేవ‌ద‌ర్శిని మ‌ధ్య సాగే స‌న్నివేశాలు హిలేరియ‌స్‌గా ఉంటాయి. మొత్తానికి.. ప్ర‌థ‌మార్థంలో త‌న మార్క్ కామెడీతో ఆక‌ట్టుకున్న గాంధీ.. ద్వితీయార్థంలో స‌మ‌స్య ప‌రిష్కారంపైనే దృష్టి పెట్ట‌డం వ‌ల్ల వినోదం పాళ్ళు త‌గ్గింది. అయిన‌ప్ప‌టికీ.. ‘ఓటీపీ’ లాంటి సీన్స్‌తో న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశారు. మొత్తంగా.. సినిమా ఓకే అనిపిస్తుంది. ఎండింగ్ టైటిల్స్‌లోనూ కామెడీ ఆక‌ట్టుకుంటుంది.


న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే.. వ‌రుస విజ‌యాల‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్న నాని ఈ సినిమాలోనూ తన‌దైన శైలి న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. కృష్ణ పాత్ర‌లో నాని ప‌లికిన చిత్తూరు యాస సినిమాకి ఓ ఎస్సెట్‌గా నిలిచింది. ఆ పాత్ర‌లోని ప్ర‌తీ భావోద్వేగాన్ని చ‌క్క‌గా ప‌లికించారు. ఎలాంటి స‌మ‌స్య‌కైనా ఎదురు నిల‌బ‌డే వ్య‌క్తిత్వం ఉన్న ఆ పాత్ర‌కి నాని పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. అయితే.. రాక్‌స్టార్ పాత్ర విష‌యంలో కొంచెం త‌డ‌బ‌డ్డార‌నిపిస్తుంది. ఓవ‌రాల్‌గా.. రెండు పాత్ర‌ల్లోనూ మెప్పించే ప్ర‌య‌త్నం చేశారు. ఫొటోగ్రాఫ‌ర్ సుబ్బ‌ల‌క్ష్మి పాత్ర‌లో అనుప‌మ న‌ట‌న బాగుంది. సినిమా మొత్తం సీరియ‌స్ లుక్‌లో క‌నిపించినా.. పాత్ర‌కు త‌గ్గ‌ట్టు హుందాగా న‌టించారు. రుక్స‌ర్ కూడా త‌న ప‌రిధి మేర ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. అయితే.. ప్ర‌థ‌మార్థంలో హీరోయిన్ల‌ పాత్ర‌ల‌కి మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నా.. ద్వితీయార్థంలో మాత్రం ఒక‌టీఅరా స‌న్నివేశాల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. బ్ర‌హ్మాజీ, సుద‌ర్శ‌న్‌, క‌ర్రి మ‌హేశ్‌, దేవ‌ద‌ర్శిని కామెడీ బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. నాగినీడు, ప్ర‌భాస్ శ్రీ‌ను ఓకే అనిపిస్తారు.

సాంకేతిక నిపుణుల విష‌యానికి వ‌స్తే.. హిప్ హాప్ త‌మిళ సంగీతంలో ‘దారి చూడు’, ‘ఐ వాన్నా ఫ్లై’ (చూపుల వంతెన‌పై హృద‌యం ప‌రిగెడెనే అనే వాక్య‌ ప్ర‌యోగం బాగుంది), ‘ఉరిమే మ‌న‌సే’ పాట‌లు విన‌డానికి, చూడ‌డానికి బాగున్నాయి. నేప‌థ్య సంగీతం స‌న్నివేశాల‌కి త‌గ్గ‌ట్టు ఉంది. అలాగే కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. ఆయ‌న కెమెరా.. ఫ్రాగ్ అందాల‌ను ఎంత చ‌క్క‌గా ఆవిష్క‌రించిందో.. గ్రామీణ వాతావ‌ర‌ణాన్ని కూడా అంతే చ‌క్క‌గా ఆవిష్క‌రించింది. స‌త్య‌.జి ఎడిటింగ్ వ‌ర్క్ మెప్పిస్తుంది. ద్వితీయార్థంతో పోలిస్తే.. ప్ర‌థ‌మార్థం నిడివి బాగా ఎక్కువైనా.. త‌న వ‌ర్క్‌తో మెప్పించారు. ఎడిటింగ్‌కు స్కోప్ ఉన్న స‌బ్జెక్ట్ కావ‌డంతో.. ప్ర‌థ‌మార్థంలో ఆయ‌న ప‌నిత‌నానికి మార్కులు ప‌డ‌తాయి. ‘వీడి ఫ్లాష్ బ్యాక్‌లో బాధ కంటే బాదుడే ఎక్కువే ఉంది’, ‘వీడు ప‌క్క‌న ఉంటే.. ప‌నిముట్ల‌తో ప‌నిలేదు బాస్‌’, ‘పురాణాల్లో కృష్ణుడి మాట అర్జునుడు విన్నాడు కానీ.. అర్జునుడి మాట కృష్ణుడు విన‌లేదు’, ‘మీ ఫేసుల్లా మీ ప్రాబ్ల‌మ్స్ కూడా ఒకేలా ఉన్నాయి’, ‘ఆ య‌మ్మీ మాయాబజార్ సినిమాలో సావిత్రిలా ఎంత నాణ్యంగా ఉంది’, ‘లైఫ్‌లో బాగుండాలంటే నేను మంచోడ్నా చెడ్డోడ్నా అని క్వ‌శ్చ‌న్ చేసుకోకూడ‌దు’.. వంటి డైలాగ్స్ బాగున్నాయి. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్‌
నాని
క్యారెక్ట‌రైజేష‌న్స్‌
ఫ‌స్టాఫ్‌
రెండు పాట‌లు
ఎడిటింగ్‌
డైలాగ్స్‌
నిర్మాణ విలువలు

మైన‌స్ పాయింట్స్‌
రొటీన్ సెకండాఫ్‌

చివ‌ర‌గా.. నాని డ‌బుల్ ట్రీట్‌
రేటింగ్‌.. 2.75/5

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →