గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణకు భూ సమీకరణ నోటిఫికేషన్ జారీ
గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణకు సర్కారు వేగంగా అడుగులు వేస్తోంది. విస్తరణలో భాగంగా భూ సమీకరణకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 1,229.94 ఎకరాల భూమిని సమీకరించేందుకు సర్కారు సిద్ధమైంది. భూ సమీకరణ కోసం కాంపిటెంట్ అథారిటీ పేరుతో ప్రకటన రిలీజ్ చేసింది. 10 పంచాయతీల్లోని 11 గ్రామాల్లో భూ సమీకరణ చేపట్టనుంది. వీటిలో అజ్జంపూడి, అల్లాపురం, బుద్ధవరకం, చినఅవుటుపల్లి, గన్నవరం, జక్కుల నెక్కలం, పురుషోత్తపట్నం, కేసరపల్లి, వెంకట నర్సింహాపురం, పెద అవుటుపల్లి, ఆత్కూరు గ్రామాలు ఉన్నాయి. ఇందులో అభ్యంతరాలు ఉంటే మార్చి 6లోగా తెలియజేయాలని, భూ సమీకరణకు సుముఖత వ్యక్తం చేసిన వారు 15 రోజుల్లో కాంపిటెంట్ అథారిటీకి దరఖాస్తులు అందజేయాలని ప్రకటనలో సూచించారు. సమీకరణ పథకానికి ప్రతిపాదించిన ప్రాంతాల వివరాలు, ప్రణాళిక, భూ యజమానుల వివరాలన్నీ నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంతో పాటు ఆయా పంచాయతీ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. మరో వైపు గత కొంతకాలంగా విస్తరణలో భాగంగా భూములు ఇచ్చేందుకు అజ్జంపూడి, బుద్దవరం, కేసరపల్లి, గ్రామాల రైతులు మాత్రం వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ ధరలకు అనుగుణంగా పరిహారం ప్రకటించేంత వరకూ భూములు ఇచ్చే ప్రశక్తే లేదని రైతులు అధికారుల ఎదుట స్పష్టం చేశారు. ఈ తరుణంలో రైతుల్ని సమీకరణకు ఎలా ఒప్పిస్తారనే అంశంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.