రచన : “పద్య కళాప్రవీణ”, “కవి దిగ్గజ”
డా. ఆచార్య ఫణీంద్ర
కుదియించి భాష, యందున
మదియించి యనల్ప భావ మాధుర్యములన్,
చదువంగ ధార రమ్యము –
పదుగురిలో మెప్పు బొందు పద్యము గాదే?
చక్కని భావమ్మును బల్
చక్కని ధారను బలికిన సరళోక్తులలో
చక్కని పద్యమ్మై – యది
చక్కగ రంజింపజేయు జనులందరినిన్!
ఆద్య కవుల్ జగద్ధితమె ఆశయమై రచియింప పద్యముల్,
మధ్య కవుల్ రచించిరి సమత్వము భిన్న మతాల నెంచి; న
వ్యోద్యమ పద్యకర్త దళితోద్ధరణంబును గోరె – ఇట్టులా
పద్యమె నిల్చె మానవత పట్టము గట్టి సహస్ర వర్షముల్!
పుట్టిన భువి మారి పొరుగు రాజుల కొల్వు
తీర్థమ్ము గొని మారె తెలుగు భాష –
సంస్కృత, మురు, దాంగ్ల సంకీర్ణమై మారె
వేల వత్సరములు వే విధముల –
కాలానుగుణముగా చాల రూపములలో
లిపి మార్పు జెందెను లేఖనమున –
గ్రాంథికమ్ము వ్యవహార గతిని మార్పొందె –
సంధుల్, సమాసముల్ సరళమయ్యె –
మారనిది ఛంద మొక్కటే మన తెలుగున!
నన్న యాదుల నుండి మా చిన్న కవులు
పద్యమున వాడి, రదె అనవద్య, మటుల
తెలుగు పద్యమే భాషా ప్రతీక యయ్యె!
పెరిగినన్ మరవక పెదవుల నాడంగ
పిల్లలు సులువుగా వల్లె వేయ-
అక్షర జ్ఞానమే అబ్బని వానినిన్
వినినంత, విజ్ఞాన వేత్త జేయ –
పండిత పామర ప్రజలకు నాసక్తి
కావ్య పఠనమందు కలుగ జూప –
నిత్య జీవితమందు నీతి శతక సూక్తి
తలపోసి, సరియైన దారి నేగ –
పలు ప్రయోజనంబులు గదా పద్యమునకు –
తెలుగు ప్రజలార! మేల్కాంచి తెలుసుకొనుడు!
ఆదరించుచో పద్యంబు, నదియె గాచు
మన తెలుగును, తద్భాషా ప్రమాణములను!!
Author: DrAcharya Phaneendra
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.