“అత్తమ్మా, కొంచెం లేవండి, ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకోండి…” అంటూ జ్వరంతో పడుకున్న అత్తగారిని లేపి వేడి నీళ్ళతో మాత్ర మింగించింది, హరిత. గోరువెచ్చగా ఉన్న పాలను గ్లాసుతో తెచ్చి, కొంచెం కొంచెంగా తాగించింది.
“అబ్బో అత్తగారిని భలేగా మస్కా కొడుతున్నావే?” ఎకసెక్కెంగా అంది అనిత.
“నీకు అమ్మైనా, నాకు అత్తైనా ఈవిడ ఈ ఇంటికి యజమానురాలు. పైగా ఎప్పటికీ నాతో కలిసి ఉండాల్సిన ఆవిడ… నువ్వేమో పెళ్లి చేసుకొని నీ ఇంటికి వెళ్ళాల్సిన దానవే కాని ఇక్కడ నీ స్థానం శాశ్వతం కాదు కదా అనితా?” చెక్కు చెదరని చిరునవ్వుతో చెప్పింది, హరిత.
ఏమనాలో తెలియక హరితను కొరకొరా చూస్తూ ఉండిపోయింది, అనిత.
“మనం ఇచ్చిన ప్రకటనకు చాలా ఉత్తరాలు వచ్చాయి హరితా…” లోపలి ప్రవేశిస్తూ చెప్పాడు అనంత్.
“వెరీ గుడ్ అండీ… చూద్దాము ఏది మనకి అనుకూలంగా ఉంటుందో…” చెప్పి, భర్తకి టీ తెచ్చి ఇచ్చింది, హరిత.
టీ తాగి, లోపలికి వెళ్లి గదిలో పడుకొని ఉన్న తల్లిని పరామర్శించాడు అనంత్.
“త్వరగా ఏదో ఒకటి సెటిల్ చేయండిరా అనంతు…ఆడపిల్లల్లో ఇదొక్కటీ మిగిలిపోయింది…” అనితను చూపిస్తూ చెప్పింది కామాక్షమ్మ.
“అవునమ్మా, మేము కూడా అదే ప్రయత్నంలో ఉన్నాము… నువ్వు దిగులు పడకు, అన్నీ సక్రమంగా జరుగుతాయి…” అనునయంగా చెప్పాడు, అనంత్.
హరిత తమ రూమ్ లోకి వెళ్లి ఆరిన బట్టలు మడతలు పెట్టసాగింది. అదే అదనుగా అన్న దగ్గరికి వచ్చి నిలబడింది, అనిత.
“నీ పెళ్ళాం రీతి మాకేం నచ్చలేదురా…అదేమిటో అసలు అస్తమానూ మమ్మల్ని ‘చదువుకో చదువుకో’ అని చంపుతుంది. పెళ్లి చేసుకుని స్థిరపడాల్సిన ఈ వయసులో నాకు చదువు ఏం ఎక్కుతుంది చెప్పు? అనిల్ గాడిని కూడా అంతే…”
“అనితా, ఏం మాట్లాడుతున్నావు? ఆమె నాకు పెళ్ళాం అయితే నీకేం అవుతుంది? ‘వదిన’ అని అనలేవా? తను ఏం చెప్పినా మన మంచికోసమే కదా? నీవు ఆ టెన్త్ క్లాస్ కంప్లీట్ చేస్తే కాస్త ఏదో ఒక ఉద్యోగం వస్తుందని చెప్పింది. అనిల్ కూడా డిగ్రీ పూర్తి చేసి గాలి తిరుగుళ్ళు తిరుగుతున్నాడు. మీరు సెటిల్ అవ్వాలనే కదా…”
“పెళ్లి చేసేస్తే నా ఇంటికి నే పోతాగా, ఇందాకే ఆవిడగారు కూడా చెప్పారు!” మూతి ముప్పై మూడు వంకర్లు తిప్పింది అనిత.
“క్రిందటి వారం ‘ఈనాడు పెళ్లిపందిరి’ కి ప్రకటన ఇచ్చాము కదా… ఇవిగో, చాలా వచ్చాయి ఉత్తరాలు…” అని బాగ్ లోంచి పది ఉత్తరాలు బయటకి తీసాడు అనంత్.
“తనకెందుకు అవన్నీ చూపిస్తారు? మనం చదివి మంచివి సెలెక్ట్ చేద్దాం లెండి… ఇటివ్వండి…” ఎప్పుడు వచ్చిందో వాటిని తన చేతిలోకి తీసేసుకుంది, హరిత.
“అన్నీ నీ ఇష్టమా?” గట్టిగా అరిచింది అనిత.
“అనితా… పెళ్లి కావలసిన పిల్లవి… ఇలా అరవటం మానెయ్యి … అవును అన్నీ నా ఇష్టమే… ముంజేతి కంకణానికి అద్దమేలా? ఈ ఇంట్లో సంపాదించే చేతులు నాలుగు, ఖాళీగా ఉండి తిని కూర్చునే నోళ్ళు మూడు… నువ్వు, నీ తమ్ముడూ ఏ ఉద్యోగం చేయరు, చదువుకోరు. సరే, అత్తయ్యకి వయసై పోయింది. ఇక నీ పెళ్లి చేయవలసిన బాధ్యత మాదని మాకు తెలుసు. దానికి ఏం చేయాలో, ఎలా చేయాలో కూడా మాకు తెలుసు. అరవటం, గయ్యాళి గంపలా కేకలు వేయటం, సాధించటం, ఇవన్నీ మానేసి, అణకువ నేర్చుకో… అత్తగారింటికి వెళితే పనికొస్తుంది…” పదునుగా చెప్పింది హరిత.
“ఇది మా ఇల్లు. నువ్వు బయటినుంచి వచ్చినదానివి… నువ్వెవరు చెప్పటానికి?” పరుషంగా అంది అనిత.
“ప్రస్తుతానికి ఈ ఇంటి యజమానురాలిని… నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఇది నిజం… సరే, వంట నువ్వు చేస్తావా, నేను చేయనా?”
“నేనేం చేయను… ఒంట్లో బాలేదు. పడుకుంటాను. రాత్రికి ఏమీ తినను…” బింకంగా చెప్పింది అనిత.
“సరే, పడుకో, నేను అరగంటలో వంట చేసి బయటకు వెళ్ళాలి…” అని చెప్పి వంటింట్లోకి వెళ్ళింది, హరిత.
***
ఆ రాత్రి భార్యాభర్తలిద్దరూ కలిసి వచ్చిన ఉత్తరాలు అన్నీ చదివారు. వచ్చిన వాటిల్లో ఒక్కటీ సరైన సంబంధం లేదు. ఎవడూ పదో తరగతి కూడా పాస్ కాలేదు. ఏవేవో మామూలు పన్లు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. హరితకి ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వారు దొరికితే బాగుండునని ఆశ. అందుకే అన్నది… “ఇవేవీ పొసగేవి కాదులెండి, వచ్చేవారం చూద్దాం…”
మరునాడు ఆఫీసుకి వెళ్తూ, ఆ ఉత్తరాలు అన్నీ అనితను పిలిచి ఇచ్చేసింది హరిత. “వీటిల్లో ఏదీ సరైన సంబంధం కాదు అనితా… అందుకని మనం ఇంకా వెయిట్ చేద్దాం సరేనా?”
“అన్నీ ఇవేనా?” బుల్లెట్లా దూసుకువచ్చిన అనిత ప్రశ్నకు నిర్ఘాంతపోయింది హరిత. “అంటే? నేను కొన్ని దాచేసాననా అర్థం?”
“ఎవరికి తెలుసు? నిన్ననే అన్నీ నాకు ఇచ్చేసి ఉండొచ్చు కదా?”
“మరింకేం? ఇకనుంచీ నువ్వే చూసుకో అన్నీ.. వచ్చేవారం ‘ఈనాడు’ ఆఫీసుకు వెళ్లి ఉత్తరాలు తెచ్చుకొని, నువ్వే జవాబులు రాసుకో నీకు నచ్చినవారికి… అనితా, నీకింత అహంకారం తగదు…” తీవ్రంగా చూస్తూ అన్నది హరిత. అంతే, బొటబొటా కన్నీళ్లు కారుస్తూ లోపలి వెళ్ళిపోయింది అనిత.
“ఎందుకు హరితా, దాన్నలా అనేస్తావు? నీకు నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తావా? ఏదో చిన్నపిల్ల…” వెనకేసుకొచ్చాడు అనంత్.
“చిన్న పిల్లా? ఆ వయసుకి నేను ఐదేళ్ళ సర్వీసు పూర్తి చేసాను. అయినా పెళ్లి కావలసిన పిల్ల అంతలా తెగించి మాట్లాడటం, నన్ను ఇష్టం వచ్చినట్టు ఎదిరించి మాట్లాడటం మీకంత తేలికగా అనిపిస్తోందా? సరే, నేను వెళ్తున్నాను…టైమైంది నాకు…” వాకిట్లోకి వచ్చి బైక్ స్టార్ట్ చేసింది, హరిత.
***
“చెన్నై నుంచి వచ్చిన ఈ సంబంధం అన్ని విధాలా భేషుగ్గా ఉంది…పేరు దాసు” చెప్పింది హరిత ఫోటో తీసి చూసి, అనితకు అందిస్తూ…
“కాని అతనికి ముందూ వెనకా ఎవ్వరూ లేరట…పైగా క్లాస్ ఫోర్ ఎంప్లాయీ…” గొణిగాడు అనంత్.
“అయితే ఏమైంది? మనం లేమా? అతనికీ అయినవాళ్ళం మనమే అవుతాము సంబంధం కలుపుకుంటే… గవర్నమెంట్ ఆఫీస్ లో పని…నెల తిరిగేసరికల్లా ఇంచక్కా మంచి జీతం వస్తుంది. అయినా టెంత్ కూడా పాసవని పిల్లకి ఇంతకన్నా మంచి సంబంధం వస్తుందా?”
చేతిలో ఫోటోని బల్లమీద విసిరినట్టుగా పెట్టేసి, విసవిస వెళ్ళిపోయింది అనిత. అనంత్, హరిత ముఖముఖాలు చూసుకున్నారు. “ఇలా అయితే ఎలాగండి? ఇప్పుడు నేనేమన్నాను? ఉన్నమాటే కదా?”
ఏమీ అనలేక తలపంకించాడు అనంత్. మర్నాడు అనిత కూడా అతను నచ్చాడని చెప్పిన తర్వాత మంచిరోజు చూసి అతన్ని పెళ్లి చూపులకి ఆహ్వానించారు. తనకి అక్క వరస అయ్యే ఆవిడని, ఆవిడ భర్తని, వాళ్ళ కొడుకును వెంట తీసుకొని వచ్చాడు దాసు.
చూడటానికి బాగానే ఉన్నాడు. తన సంస్థలో ప్రమోషన్ కోసం పరీక్ష వ్రాసానని, అందులో గెలిస్తే క్లర్క్ అవుతానని చెప్పాడు. అమ్మాయి నచ్చిందని వరకట్నం ఏమీ అవసరం లేదని అన్నాడు. అయినా అమ్మాయి పేరున వేసే డబ్బు తాము బ్యాంకు లో వేస్తామని అన్నారు అనంత్ దంపతులు. అన్నీ ఓకే అయిపోయాయి.
హరిత ఆనందంగా వాళ్ళతో చెప్పింది… “మా అనిత చక్కగా వంట చేస్తుంది, ఇల్లు శుచిగా శుభ్రంగా ఉంచుతుంది… అయితే…” ఆమె మాటను అర్థోక్తిలో ఆపుతూ, గట్టిగా దగ్గాడు అనంత్. “హరీ, ప్లీజ్ కొంచెం మంచి నీళ్ళు తీసుకురా…” అని వంటింట్లోకి పంపించేసాడు. అనిత కూడా హరిత వైపు అదోలా చూసింది. హరితకి అర్థం కాలేదు కాని, తాను చెప్పబోతున్న విషయం వాళ్లకి రుచించలేదని అర్థమైంది. అందుకే ఏమీ మాట్లాడలేక అక్కడినుంచి వెళ్ళిపోయింది మౌనంగా.
దాసు వాళ్ళ అక్కా బావలతో ప్రయాణమై వెళ్ళిపోయాడు. ‘లగ్నపత్రిక వ్రాసుకొని పంపిస్తామని వాళ్ళతో చెప్పాడు అనంత్. వాళ్ళు వెళ్ళగానే భర్తమీద విరుచుకు పడింది హరిత.
“లగ్న పత్రిక వరకూ వచ్చేసారు… ఆ విషయం చెప్పాలి కదా అతనితో?”
“ఏమీ అక్కరలేదు!” మొండిగా చెప్పింది అనిత.
“అదేమిటి? అంత ముఖ్యమైన విషయం చెప్పకపోతే ఎలా?” పానిక్ గా అరిచింది హరిత.
“చెప్తే దీన్ని ఎవడు చేసుకుంటాడు?” గట్టిగా కసిరాడు అనంత్. “అవును వదినా, ప్లీజ్… ఆ విషయం మరిచిపో… నేను చూసుకుంటాను… పెళ్లి అయిపోనీ…” బ్రతిమాలింది అనిత.
“చాలా ఈజీగా తీసుకుంటున్నారు మీరు… ముందుగా చెప్పటం మన విధి… ఇష్టమైతే చేసుకుంటాడు, లేకుంటే లేదు… తేలిపోతుంది కదా…”
“వద్దు హరితా, ఈ సారికి ఊరుకో… ప్లీజ్… దాని జీవితాన్ని నాశనం చేయకు…” గట్టిగా చెప్పాడు అనంత్.
తన ప్రమేయం ఏమీ లేనట్టు పెళ్లి ఏర్పాట్ల గురించి భర్త తన చెల్లెలితో, తల్లితో చర్చిస్తూ ఉండిపోతే నిస్సహాయంగా పెదవి కొరుక్కుంటూ నిలబడిపోయింది హరిత. అనిత కుడి కాలి తొడపై అర్థరూపాయి అంత సైజు లో తెల్లని మచ్చ ఒకటి ఉంది. ఆమె దానికి చికిత్స తీసుకుంటోంది, కాని ఈ విషయం చెప్పి తీరాలి అని హరిత వాదన. అక్కరలేదని వాళ్ళు అంటున్నారు. కాని పెళ్లి విషయంలో ఈ విషయం దాచి పెట్టటం తప్పని హరితకు అనిపిస్తోంది.
పెళ్ళికి ఏ కళ్యాణ మంటపం బుక్ చేయాలో సీరియస్ గా చర్చిస్తున్న అనంత్ హరిత మాటలతో ఆమె వైపు చూసాడు.
“రిజిస్టర్ మేరేజ్ చేస్తే మంచిది. ఆ పెళ్లి ఖర్చు అంతా అనితకి డబ్బు రూపంలో ఇద్దాము.”
“ఏం అక్కరలేదు, దిక్కులేనివాళ్ళలా, రిజిస్టర్ మేరేజ్ అక్కరలేదు… ఇదేమైనా లేచిపోయిన వాళ్ళ పెళ్ళా?”
మూర్ఖంగా మాట్లాడుతున్న భర్త మాటలకి చర్రున లేచింది, హరిత. “ఛీ, అసలు మీ ఆలోచనా విధానమే అంత… అంత హీనమా రిజిస్టర్ పెళ్లి అంటే మీకు? రేపు ఎటుబోయి ఏమైనా మనకి కాస్త రక్షణ ఉంటుంది…. ఆలోచించండి…”
“వదినా, నా మీద ఎందుకింత పగ నీకు? అంటే నా కాపురం నాశనం అయిపోతుందని ఫిక్స్ అయిపోయావన్న మాట!” వ్యంగ్యంగా అంటున్న అనితను తేరిపార చూసి మౌనం వహించింది, హరిత.
***
“ఏదైనా సూటిగా మాట్లాడతావని అపార్థం చేసుకుంటాము నిన్ను… కాని నువ్వు చెప్పిందే నిజం హరితా…” విచారంగా చెప్పింది ఆమె అత్తగారు.
హరిత ఏమీ మాట్లాడలేదు. పెళ్లి అయి, అనిత కాపురానికి వెళ్ళింది మొదలు దాసు ఆమెను సాధించటం మొదలు పెట్టాడు. కాలి మీది మచ్చ చూసి ఇంత చర్మవ్యాధి ఉంటే దాన్ని దాచిపెట్టి పెళ్లి చేసారన్న ఆరోపణతో ఆమెను మాటలతో హింసించసాగాడు. అనంత్ తన అక్కలు, తమ్ముడితో కలిసి వెళ్లి సర్దుబాటు చేద్దామంటే, తనకు న్యాయం జరగాలంటే మూడు లక్షలు ఇవ్వమని డిమాండ్ చేసాడు దాసు. గొడవ పడటం ఇష్టం లేక, ఆ డబ్బు ఇచ్చేసి అనితను చెన్నై లో దింపేసి వచ్చారు. భర్త అడిగాడని ఆఫీసులో లోన్ పెట్టి డబ్బు ఇవ్వటం తప్ప తానేమీ కల్పించుకోదలచుకోలేదు, హరిత.
రెండు మూడు నెలలు గడిచాయో లేదో మరో సంఘటన…
ఆ రాత్రి టీవీలో ఏదో కామెడీ షో వస్తుంటే చూసి, తర్వాత గదిలోకి వచ్చింది, హరిత. ఆమెను చూసి కంగారుగా రాస్తున్న కాగితాలు డ్రాయర్ లో పెట్టి దాన్ని మూసేసాడు అనంత్. హరిత గమనించనట్టే ఊరుకుంది కాని, మర్నాడు ఉదయం అతను స్నానానికి వెళ్ళినప్పుడు చూస్తే తెలిసింది, అవి ఆఫీస్ కొలీగ్ కి అనంత్ ష్యూరిటీ ఇస్తున్న పేపర్స్ అని. అప్పటికి ఊరుకున్నా ఇద్దరూ ఎవరి ఆఫీసులకి వాళ్ళు వెళ్ళగానే ఫోన్ చేసి, తాను ఆ కాగితాలు చూశానని, అలా సంతకాలు పెట్టి చిక్కుల్లో పడవద్దని భర్తతో గట్టిగా చెప్పింది హరిత. అతను అలాంటి వాడు కాదని, తప్పక నిజాయితీగా డబ్బులు కట్టేస్తాడని అంతకంటే గట్టిగా ఢంకా భజాయించి మరీ చెప్పాడు అనంత్. పైగా అతను తన మేనమామ వైపు బంధువని, హెల్ప్ చేయకపోతే మాట వస్తుందని, ఆమెను తన స్వవిషయాల్లో కల్పించుకోవద్దని గట్టిగా చెప్పాడు. హరిత మనసు నిస్సహాయతతో బాధగా మూల్గింది.
***
బాగా తలనొప్పిగా ఉండటంతో త్వరగా ఆఫీసు నుంచి వచ్చేసి పడుకున్న హరిత గదిలో లైట్ వెలగటంతో ఉలిక్కిపడి నిద్ర లేచింది. గోడ గడియారం సాయంత్రం ఏడు గంటలను సూచిస్తోంది. బల్లమీద కాగితాలు పెట్టి వాష్ రూమ్ లోకి వెళ్లి వచ్చిన అనంత్ నిస్త్రాణ గా కుర్చీలో కూలబడ్డాడు. అతని ముఖం చాలా అప్రసన్నంగా ఉంది.
“ఏమిటి అలా ఉన్నారు?” లేచి కూర్చుంటూ అడిగింది, హరిత.
“నువ్వు మంచి మాటలు పలకవా హరితా, ఆ రోజు ఏ ముహూర్తాన అన్నావో… ఆ చిట్ కంపెనీ వాడు నోటీసు పంపించాడు…” కవర్ని మంచం మీదికి విసురుగా గిరాటేస్తూ తీవ్రంగా చూసాడు అనంత్.
“నేను అనటం ఏమిటండీ? సామాన్యంగా అలా జరిగే అవకాశం ఉంది కాబట్టి, ముందు జాగ్రత్తగా హెచ్చరించాను అంతే కదా?”
“ఈ వెధవ చిట్ పాడుకొని పారిపోయాడు. ఇప్పుడు నా తలకు చుట్టుకుంది…ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయి అనుకుంటాను?”
“మీకేమైనా మతిపోయిందా? మీరు పొరపాటు చేసి నన్నంటారెందుకు? అతన్ని ఎవరు నమ్మమని అన్నారు? మీరే అతను మీ మేనమామ బంధువని, చాలా నిజాయితీ పరుడని చెప్పారు…”
అనంత్ మాట్లాడలేదు.
“మొదటినుండీ అంతే, నేను నిజం చెబుతాను కాబట్టి, అది చురుక్కున కాలే నిప్పులా ఉంటుంది కాబట్టి నా మాటలు మీకు నచ్చవు. అనితైనా, మీరైనా, అనిల్ అయినా అందరూ అంతే…నాకు నిజాయితీగా ఉండటం ఇష్టం… మోసాలు, కపటాలు నాకు దూరం… కాని నా దురదృష్టం, మీ దృష్టిలో అవేం పెద్ద నేరాలు కావు… అనిల్ తన జాబ్ కి లంచం పెట్టమని మిమ్మల్ని అడిగితే, ‘నా దగ్గర లేవురా’ అని చేతులు ఎత్తేసారే తప్ప, ‘అది తప్పురా’ అని చెప్పరు మీరు…అది మీ దృష్టిలో తప్పే కాదు మరి… మీ అక్క కొడుకు ఇంటర్లో కాపీ కొడుతూ పట్టుబడి డిబార్ అయితే, ‘జాగ్రత్తగా ఉండవద్దూ…’ అని మందలించారు కాని, ‘అలా ఎందుకురా చేయటం, కష్టపడి చదివి పాసవ్వచ్చు కదా…’ అని అనరు మీరు. నేను చెబితే మీకు చాదస్తంగానో, మీ వాళ్ళని ఎత్తి చూపించినట్టో భావిస్తారు. నా విషయానికి వస్తే నేను చాలా గర్వంగా చెబుతాను. ఎవరు ఎంత వత్తిడి తీసుకొచ్చినా నేను తప్పు చేయను… చేస్తే నా ఆత్మ ముందు తల ఎత్తుకోలేను. అందుకనే నేను ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు… అపరాధ భావనకు గురి కావలసిన అగత్యం లేదు… అలాగే నా వాళ్లైన మీరు కూడా అలాగే ఉండాలని నేను ఆశించి, మీకు భయంకరమైన శత్రువుగా మారిపోయాను… పోనీలెండి… ఎప్పటికైనా మీరు మారుతారు అన్న ఆశే నన్ను మీతో కాపురం చేయనిస్తోంది…నిజానికి… అదే మన ఇద్దరి మధ్యా ఉన్న ప్రేమను బ్రతికిస్తోంది కూడా…” గొంతు గద్గదమవటంతో చెప్పటం ఆపేసింది, హరిత.
ఏమీ మాట్లాడలేక, ఆమె మాటల్లోని నిజాన్ని కాదనలేక మౌనంగా కూర్చున్నాడు అనంత్.
“సరే, లేవండి… భోజనం చేద్దాం… తర్వాత ప్రశాంతంగా చర్చించుకొని జరగాల్సింది ఆలోచిద్దాం. మీ మామయ్యగారి నంబరిస్తే నేను ఫోన్ చేసి మాట్లాడతాను. ప్రతి తాళం కప్పకూ దాన్ని తెరిచే చెవి ఎలా ఉంటుందో అలాగే ప్రతీ సమస్యకూ పరిష్కారం ఉంటుంది…” అతని భుజమ్మీద చేయి వేసి, అనునయంగా చెప్పింది హరిత.
ఆ చేతిని గబుక్కున లాక్కుని చెంపలకి ఆనించుకున్నాడు అనంత్… అతని చెంపల మీది తడి ఆమె వేళ్ళకు అంటి, అతని మనసులోని భావాలను ఆమెకు చెప్పకనే చెప్పింది.
***
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.