తెలుగు బాష ప్రాచీనమైనదే.. మద్రాస్ హై కోర్టు తీర్పు..
తెలుగు భాష ప్రాచీనమైనదేనని మద్రాసు హైకోర్టు తేల్చిచెప్పింది. తెలుగుకు ప్రాచీన హోదా ఇచ్చేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పింది. ప్రాచీన హోదా విషయంలో.. కేంద్ర ప్రభుత్వం నియమించిన.. ప్రత్యేక కమిటీ చేసిన సిఫారసులతో తాము ఏకీభవిస్తున్నామని చెప్పింది.
తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, ఒడియా భాషలకు ప్రాచీన హోదా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఆయా బాషలకు ప్రాచీన హోదా ఇవ్వడం కరెక్టేనని హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ , ఆర్.మహదేవనలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.
2006లో ఏర్పాటైన నిపుణులతో కూడిన కమిటీ కొన్ని నియమాలను తయారు చేసింది. వాటికి అనుగుణంగా ఉన్న తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియాలకు కేంద్ర ప్రభుత్వం ప్రాచీన హోదా ఇచ్చింది. ఇదంతా కూడా నియమ నిబంధనలకు అనుగుణంగానే జరిగిందని కోర్టు అభిప్రాయపడింది. పిటిషనర్ ఏమైనా అభ్యంతరాలు ఉంటే కమిటీకి నివేదించుకోవాలని సూచించింది. ఇప్పటివరకు ప్రాచీన హోదాపై దాఖలైన అన్ని కేసులను మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది.
నాలుగు బాషలకు ప్రాచీన హోదా కల్పించడంతో .. 2009లో ఆరు పిటిషన్లు మద్రాస్ హై కోర్టులో దాఖలయ్యాయి.వీటిపై ఈ ఏడాది జూలై 13న విచారణ పూర్తైంది. తెలుగు రాష్ట్రాల తరపున సీనియర్ న్యాయవాది రవీంద్రనాథ్ వాదనలు వినిపించారు. దీంతో అప్పుడు రిజర్వు చేసిన తీర్పును ధర్మాసనం వెలువరించింది. ఈ నేపథ్యంలో న్యాయవాది రవీంధ్రనాథ్ మాట్లాడారు. హై కోర్టు తీర్పు తెలుగు బాషకు శుభదాయకమని అభిప్రాయపడ్డారు. ప్రాచీన హోదాకు తెలుగు అర్హమైనదేనని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేయడం పట్ల తెలుగువారందరిలోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.