డాలస్, 14th జనవరి 2014: డాలస్ లోని తెలుగు భాషాభిమానులకి 2014 జనవరి పదకొండవ తేది సువర్ణాక్షరములతో లిఖించదగిన రోజు. స్థానిక “ఎలెన్ పెర్ఫార్మింగ్ ఆర్టు్స సెంటరులో” అంగరంగవైభవముగా జరిగిన సిలికానాంధ్ర మనబడి ఐదవ వార్షికోత్సవము నిజముగ తెలుగు వారికి, తెలుగు భాషాభిమానులకి అచ్చమైన పండుగ దినము. ముక్కోటి వేల్పులు వేడుకతో జూడ వైకుంఠ ఏకాదశి పర్వదినాన, మనబడి బాలబాలికలు తమతమ తల్లితండ్రులతోనూ, గురువులతోనూ స్నేహితులతోనూ కలిసి వచ్చి కార్యక్రమాన్ని కన్నుల పండువగ స్వీయనిర్వహణలో రక్తికట్టించారు. విభిన్నాంశాలతో కూడిన కార్యక్రమాలలో మనబడి విద్యార్ధులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పై తమకున్న మక్కువను చాటుకొన్నారు. “బాలలేరా బా/హా/టా/లీవుడ్ స్టార్లు” అని మరోసారి నిరూపించారు.
ఐటెక్ యూఎస్ సంస్థ వారి సహకారంతో, సకల సాంకేతిక హంగులతోకూడిన సువిశాలప్రాంగణములో, అత్యంత ఆహ్లాద భరితమైన వాతావరణములో, అద్భుతమైన అలంకారాలతో సుశోభితమైన వేదికపై కార్యక్రమము ఖచ్చితముగ పన్నెండు గంటలకు మొదలైనది. సాంప్రదాయకమైన రంగురంగుల దుస్తులలో మెరుస్తూ, త్రివర్ణ పతాకాలను చేతనిడుకొన్న చిన్నారి బాలలు శోభావేదిక మీద ఉండగా, ఉపాధ్యాయులు అందరూ కలిసి, “వందేమాతరము”, “మా తెలుగు తల్లి” గీతాలను ఆలాపించిగా సువిశాలభారతావనియే వచ్చి నిలిచినదా – అని దాదాపు పన్నెండు వందలమందికి పైగా ఉన్న ఆహూతులకు అనిపించకమాని ఉండదు. అతి ప్రాచీనమైన తెలుగు భాషను ప్రపంచభాషగా మార్చటమనే బృహత్కార్యక్రమానికి సంకేతముగా, పెద్దలచేతులలో మొదలైన తెలుగ భాషాజ్యోతి, మూడు తరాల మధ్య చేతులు మారుతూ సభాప్రాంగణములోఉన్న అందరి కరస్పర్శతో మరింత తేజోదీప్తమైనది. ఇలా ఆ జ్యోతి తర్వాత బే ఏరియాలో జరగనున్న తదుపరి సాంస్కృతికోత్సవంలో తెలుగుకాంతి పరచడానికి బయలుదేరింది! బాలబడి పిల్లల చిట్టిచిట్టి గొంతులతో పాడిన పాటల బాలగానామృతము, ప్రవేశం విద్యార్థులు ముచ్చటగా చేసిన “మన పద్యం – నేపథ్యం” లో నీతిపద్యాల సమకాలీన భావం ఎంతో సృజనాత్మకంగా ఉన్నాయి.
ఇర్వింగ్, కోపెల్, ప్లేనో మరియు ఫ్రిస్కో లో ప్రసూనం, ప్రకాశం, ప్రభాసం విద్యార్థులు సమర్థవంతంగా భారీ తెరలు, కళాత్మకమైన వేదిక అలంకరణతో, అత్యాధునిక సాంకేతిక పరికరాల సాయంతో, విజ్ఞాన వినోదభరితమైన కాలయంత్రం, యుగకర్తలు, పంచతంత్రం, విక్రమాదిత్య మరియు భువనవిజయం లాంటి భారీ సంగీతనృత్యపద్య నాటకాలని అత్యద్భుతంగా ప్రదర్శించి అమెరికా సిలికానాంధ్ర మనబడి ద్వారా తెలుగు నేర్చుకుంటున్న పిల్లల ద్వారా మన నాటకరంగ కళ ఆధునిక యుగంలో కూడా రాణిస్తుంది అని నిరూపించారు. ఇంకా మనబడి పిల్లలు చేసే బాలానందం రేడియో కార్యక్రమానికి, ప్రముఖ సినీకవి రామజోగయ్య శాస్త్రి వ్రాయగా, సూపర్ గురు రామాచారిగారు స్వరపరచి లిటిల్ మ్యూజీషియన్ అకాడెమీ పిల్లలు పాడిన స్వాగత గీత ఆవిష్కరణ, పట్టభద్రులవబోతున్న ప్రభాసం పిల్లల గుర్తింపు , ఉపాధ్యాయులు, సమన్వయకర్తలు మరియు వారి కుటుంబ సభ్యుల సన్మానంతో సభ ఎంతో వైభవంగా జరిగింది. ఎందఱో వందల మంది కొన్ని వందల గంటలు విరామంలేకుండా శ్రమించి పిల్లలకి శిక్షణ ఇచ్చి, వారిచే ఇంత గొప్ప కార్యక్రమాలు చేయించడం ద్వారా, వారిలో భాషా ప్రతిభనే కాక, నాయకత్వ , మూర్తిమత్వ లక్షణాల పెంపు, ఆత్మవిశ్వాసం పెరిగి తెలుగు నేర్చుకొనే విషయంలో ఇంకా పట్టుదల పెరుగుతుందని డాలస్ లో ని పిల్లల తల్లితండ్రులు, మనబడి కార్యకర్తలు ప్రకటించారు. ఉచితంగా మధ్యాహ్న మరియు రాత్రిభోజనాలతో అతిథులని ఆదరించడానికి, ఈ భారీ కార్యక్రమ ఖర్చులకి సాయం ఎందఱో పోషక దాతల సహాయం సహకరించింది.
ముందుగ బాలబడి చిన్నారులు తమ చిట్టిచిట్టి గొంతులతో పాడిన పాటలు బాలగానామృతముగా రూపుదిద్దుకున్నాయి. ఆ తరువాత “మన పద్యం – నేపధ్యం” అనబడే కార్యక్రమము లో సుమతీ మరియు వేమన శతకాలలోని నీతి పద్యాల తాత్పర్యాన్ని అతి సులువుగా అర్థమయ్యేలా రూపొందించిబడిన లఘు నాటికలను చిన్నారులు కడురమ్యంగానటించారు. ఈ పద్యాల పై తమకున్న పట్టును నిరూపించుకొని ప్రేక్షకుల మెప్పును పొందారు. ఈ పద్యాలను సమకాలీన నేపధ్యంలో వివరించడంలో ఈ పద్య సంకలన రూపకర్తలు కృతకృత్యులయ్యారని చెప్పాలి.
తదుపరి వచ్చిన కాలయంత్రం నాటికలో ఆరుగురు పాత్రధారులు, టైం మెషిన్ లో ప్రయాణించి, ప్రాచీన కాలం నుండి మానవాళి మనుగడ సాగిన తీరును తెలుసుకొని , ఆధునిక కాలంలో పర్యావరణానికి జరుగుతున్న కీడు వల్ల , భవిష్యత్తు తరాలలో ఈ భూమిపై సాధారణ జీవనానికి పొంచి ఉన్న ముప్పును అర్ధం చెసుకొన్నారు. ఈ సందేశాన్ని చిన్న పిల్లల మదిలో నాటేందుకు తగిన అన్ని హంగులు ఈ కాలయంత్ర ప్రయాణంలో పొందు పరిచారు. ఈ నాటిక కోసము ప్రత్యేకంగా రూపొందించిన భారీ తెరలు దర్శకుల సృజనాత్మకత మరియు కళాతృష్ణ ప్రతిబింబించే విధంగా ఉండి, టెక్సాస్ లో ఏమి చేసినా పెద్దగానే చేస్తారు అని మరో సారి చాటి చెప్పాయి.
ఆకాశవాణి లో పూర్వం వచ్చిన బాలల కార్యక్రమాన్ని తలపించే విధంగా, ఉత్తర అమెరికాలోని అనేక పట్టణాల నుండి గత నాలుగేళ్ళుగా ప్రసారమౌతున్న బాలానందం కార్యక్రమం గురించి కళ్యాణి సిద్ధార్థ సభకు పరిచయము చేసారు. మనబడిలో చదువుకొంటున్న విద్యార్ధులకు తెలుగును మరింత దగ్గిర చేసి, వారిలో వాక్పటిమ, నాయకత్వలక్షణాలు పెంపొందించి తెలుగుని భావితరాలకు అందించటము ఈ కార్యక్రమము యొక్క ముఖ్యఉద్ధేశ్యము అని ఆమె వివరించారు. ఈ కార్యక్రమం కోసం , “రారండోయ్ రారండోయ్” అంటూ సినీ కవి రామజోగయ్య శాస్త్రి గారు ప్రత్యేకంగా వ్రాసిన గీతాన్ని, సూపర్ గురు రామాచారిగారు స్వరపరచగా, వారి సంగీత అకాడమీ బాలలు ఎంతో మధురంగా ఆలపించారు. ఈ గీతాన్ని డల్లాస్ యువ రేడియో సమన్వయ కర్తK C చేతుల మీదుగా ఆవిష్కరింపచేసారు. పిమ్మట, ఇటీవల మనబడిలోని ఆఖరి తరగతియైన ప్రభాసమును పూర్తిచేసుకున్న విద్యార్థినీ విద్యార్థులకు అక్కల విజయలక్ష్మి ఆధ్వర్యములో, జ్ఞాపికలను అందజేసారు. వారి వారి గురువులను ఉచితరీతిలో సత్కరించారు.
ఆ తరువాత వచ్చిన పంచతంత్రము నాటికలోని అంశాలు కథలు మనబడి తరగతులలో బోధించినవే అయినా , ఈ కథలూ , నీతి పద్యాలను నాటికల రూపంలో విద్యార్థులచే ప్రదర్శింప చేయటం ద్వారా వానిలోని పరమార్ధాన్ని చిన్నారుల మనసులలో మరింత హత్తుకొని పోయేలా చేసారు మనబడి నిర్వాహకులు. పాశ్చాత్య ధోరణిలో, వీడియో గేమ్స్ వ్యసనంలో మునిగి పోతున్న వారి పసి మనసులకు తెలుగు సాహిత్యంలోని పంచతంత్ర కథల ద్వారా పునరుత్తేజితులను చేసారు. ప్రేక్షకులను విశేషముగా ఆకట్టుకున్నారు.
ముగ్గరు యుగకర్తల గొప్పతనం నండూరి వారి ఋతుసంహారం, కరుణశ్రీ వారి మ్రోగినగంటలు, శ్రీశ్రీ ప్రతిజ్ఞ వీటిని ఎంతో ప్రతిభావంతంగా ఫ్రిస్కో విద్యార్థులు, అందరిలోనూ గొప్పతనం గుర్తించాలని సందేశంతో “పనికిరాని పాండిత్యం”, ప్రభాసం పిల్లల సాంకేతిక పరిజ్ఞానం , తెలుగు భాష పట్టుని కలగలిపి చేసిన చైతన్యకల్పన (అనిమేషన్) అందరినీ ఆకట్టుకున్నాయి. వెస్ట్ ప్లేనో విద్యార్థులు చేసిన విక్రమాదిత్యలో ఇంద్రసభలో రంభా ఊర్వశి తగవు తీర్చిన విక్రమాదిత్య నుంచి, భట్టి-విక్రమల స్నేహం, బేతాళ కథలు , జ్ఞాన శీలుడి పన్నాగం ఘట్టాలు వివిధ కళాపరికరాల అలంకరణతో అత్యద్భుతంగా చేశారు. తర్వాత ఇర్వింగ్, కోపెల్ విద్యార్థులు చేసిన భువనవిజయంలో రాయలవారికాలంలోకి తీసుకెళ్ళి రాచవీధిలో ముత్యాల అంగళ్ళ నుంచి, పెద్దన, ధూర్జటి, తిమ్మన, తెనాలి కవులు అష్టదిగ్గజాలలో చేరిన వైనం, రాయలు పెద్దనకి పల్లకీ మోయడం, చివరిలో అష్టదిగ్గజాలతో కొలువులో పిల్లలు చేసిన మహా అద్భుతాన్ని ప్రేక్షకులు కరతాళధ్వనులతో దీవించి ఆనందించారు. కోలాట నృత్యాలు, జానపద గీతాలు, లలితగీతాలు, పద్దెమినిది ప్రబంధ పద్యాలతో పిల్లలు బ్రహ్మాండమైన ప్రదర్శనతో భువనవిజయాన్ని రక్తి కట్టించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.