మోడీ నన్ను హత్య చేయిస్తారేమో
రెండున్నర సంవత్సరాలుగా కేంద్రం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న పరోక్ష యుద్ధం తార స్థాయికి చేరింది. ఇంత వరకు కేంద్రంపైన ప్రధాని నరేంద్ర మోడీ తీరుపెనౖ తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి -ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ఏకంగా ఒక వీడియో విడుదల చేశారు. అందులో ‘నరేంద్ర మోడీ నన్ను హత్య చేయిస్తారేమో’ అంటూ కేజ్రీవాల్ సంచలనాత్మక ఆరోపణలు చేశారు. తనపై మోడీ భయంకరమైన కోపంతో ఉన్నారని కూడా ఆయన ఆరోపించారు. ప్రశ్నించే తన వంటివారి గొంతు నొక్కేందుకు మోడీ అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటూ కేజ్రీవాల్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆప్ ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణలతో అరెస్టులు జరగడంతో కేజ్రీవాల్ ఈ ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ గతంలో ప్రధాని మోడీని ‘సైకోపాత్’ అని ఆరోపించిన విషయం విదితమే. యూట్యూబ్లో విడుదల చేసిన ఈ వీడియోలో కేజ్రీ తమ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి పది నిమిషాల సేపు మాట్లాడారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న మోడీ ఆప్ కార్యకర్తలను చంపించినా చంపిస్తారేమోనని, ప్రాణాలు పోతాయనే భయం ఉన్నవాళ్లు పార్టీని వీడవచ్చని, లేదంటే జరిగే పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆప్ ఎమ్మెల్యేలకు కేజ్రీవాల్ సూచించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం సురక్షితంగా ఉంటుందని తాను అనుకోవడం లేదని కేజ్రీవాల్ పేర్కొంటూ, ప్రతి ఆప్ కార్యకర్త జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానిపై ఈ స్థాయిలో విమర్శలకు దిగడం దేశ రాజకీయాల్లో అరుదు. ఢిల్లీలో ఎంఎల్ఎలు వరుసగా అరెస్టు కావడం, చిన్న చితక కేసుల్లో లేదా బలమైన సాక్ష్యాధారాలు లేని కేసుల్లో సైతం జైళ్లకు వెళ్లవలసి రావడంతో ఆప్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వీటన్నింటిపై ఇప్పటి వరకు ఒక స్థాయిలో స్పందించిన ఆప్ అధినేత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిజెపితో, ప్రధాని మోడీతో అమీ తుమీకి సిద్ధమయినట్లు వీడియో సందేశాన్ని బట్టి విదితం అవుతోంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.