మోడీ డ్రెస్‌ల విలువ రూ.75 కోట్లా?
దేశం మొత్తం మోడీ హవా నడిచేటప్పుడు సామాన్యుడిగా వచ్చి మోడీని ఎదుర్కొని దేశరాజధాని ఢిల్లీ పీఠాన్ని చేజిచ్చుకున్న వ్యక్తి ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. దేశం మొత్తం బీజేపీ పాలన ఉంటే దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ పాలన ఉండడం మోడీకి నచ్చలేదో ఏమోకానీ కేజ్రీవాల్ టార్గెట్ చేసి పాలన చేశారు. కేజ్రీవాల్ కూడా సమయం వచ్చినప్పుడల్లా మోడీపై విరుచుకుపడేవారు. అప్పుటి నుంచి వాళ్ల మధ్య మొదలైన గొడవ నేటికీ ఆగలేదు. తాజాగా ప్రభుత్వంలో జవాబుదారీతనం గురించి ఎక్కువగా మాట్లాడే ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రచారం కోసం ప్రభుత్వం నిధులు విపరీతంగా ఖర్చు చేస్తున్నారని వస్తున్న విమర్శలను తిప్పి కొట్టేందుకు ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన దుస్తులపై పెట్టె భారీ ఖర్చులను ఉదహరించారు. తన ప్రభుత్వ విజయాలను ప్రచారం చేసుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఏకంగా రూ. 526 కోట్లను వెచ్చించిందన్న వార్తలను ఆయన తిప్పికొట్టారు. ప్రభుత్వ విజయాలను ప్రచారం చేసేందుకు తమ ప్రభుత్వం ఖర్చు చేసిన వ్యయం రూ. 76 కోట్లు మాత్రమేనని ఆయన చెప్పారు. ఇక ఈ ఖర్చు ప్రధాని నరేంద్ర మోడీ రెండేళ్ల కాలంలో ధరించిన దుస్తుల ఖర్చు కంటే కూడా తక్కువేనని ఆయన మరో వాదనను వినిపించారు.
ప్రధాని పదవి చేపట్టిన తరువాత ఒక్కొక్కటి రూ.2 లక్షలు విలువ చేసే డ్రెస్‌లను వేసుకుంటున్న మోడీ ఒకసారి వేసుకున్న డ్రెస్‌ను రెండో దఫా వాడడం లేదని చెప్పారు. ఈ లెక్కన 700 రోజుల పాలనను పూర్తి చేసుకున్న మోడీ రోజుకు రూ. 10 లక్షల చొప్పున కేవలం డ్రెస్సులకే రూ. 70 కోట్లు తగలేశారని ఆరోపించారు. ఇక ఇతర దుస్తుల ఖర్చు రూ. 5 కోట్ల మేర ఉంటుందని చెప్పిన కేజ్రీవాల్ ప్రధాని కేవలం రెండేళ్లలో తన దుస్తుల కోసం రూ. 75 కోట్లను తగలేశారని ఆరోపించారు. ఈ క్రమంలో ప్రధాని మార్చిన దుస్తుల ఖరీదు ముందు తమ ప్రభుత్వ ప్రచారానికైన ఖర్చెంత అంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజేపీ పెద్దలు కానీ, నరేంద్ర మోడీ కానీ ఇప్పటి వరకు స్పందించకపోవడం విశేషం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.