మోడీ స్పీచ్‌కు ఫిదా అయిన అమెరికన్లు
ప్రధాని నరేంద్ర మోడీ మంచి వక్త అని ఇప్పటికే చాలా సార్లు రుజువైంది. ఏ దేశంలో ఆయన ప్రసంగించినా ఆదేశ ప్రెసిడెంట్లు, ప్రధానుల దగ్గరి నుంచి అందరూ మోడీ ప్రసంగాన్ని మెచ్చుకున్నవాళ్లే.. ఆ దేశ మీడియా కూడా ఇది వరకు ఏ ప్రధానికి ఇవ్వనంత ప్రియారిటీ మోడీకి ఇస్తున్నారంటే అతిశయోక్తి కాదు. మోడీ ఎక్కడ మాట్లాడినా భారతదేశం గురించి గొప్పగా చెప్పడం.. పరాయి దేశాలకు చురకలు అంటించడం వంటివి చేస్తుంటారు. ఆ చురకలు ఆ దేశాలకు ఇబ్బంది పెట్టేటట్లుగా ఉండవు కూడా. తాజాగా అదే జరిగింది. అమెరికా కాంగ్రెస్ లో అమెరికన్ కాంగ్రెస్ సభ్యుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. వారి విధానాల మీద చురకలు వేయటం ఒక ఎత్తు అయితే.. తాను వేసిన చురకలకు నవ్వకుండా ఉండలేనట్లుగా చేయటం మోడీ మాటల మేజిక్ గా చెప్పాలి. అసలు మోడీ ఏం మాట్లాడారో చూస్తే …
* ఈ ప్రజాస్వామ్య దేవాలయం.. ప్రజాస్వామ్యం దిశగా వెళ్లేందుకు అనేక దేశాలకు స్ఫూర్తినిచ్చింది. ప్రోత్సాహాన్నించ్చింది. లింకన్ మాటల్లో చెప్పాలంటే.. స్వేచ్ఛ.. సమానత్వ భావనలకు ఊపిరిలూదింది. ఇక్కడ ప్రసంగించే అవకాశం లభించటం ఎంతో గౌరవంగా భావిస్తున్నా.
*మా పౌరులకు భయం నుంచి స్వాతంత్ర్యం ఉంది. భారత్ ఒకటిగా జీవిస్తుంది. అభివృద్ధి చెందుతుంది. పండుగ చేసుకుంటుంది. నా ప్రభుత్వానికి రాజ్యాంగం నిజమైన పవిత్ర గ్రంధం. 80 కోట్ల మంది నా దేశ ప్రజలు ఐదేళ్లకోసారి ఓటేయొచ్చు. కానీ.. మా 125 కోట్ల మందికీ భయం నుంచి ప్రతిక్షణం స్వాతంత్ర్యం ఉంది.
* సముద్ర అఖాతాల నుంచి.. విశ్వాంతరాళం వరకూ వ్యాపించిన బంధం మనది. మీది అతి ప్రాచీన ప్రజాస్వామ్య దేశం. మాది అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. మీ చట్ట సభలో ప్రసంగించటం.. 125 కోట్ల మందితో కూడిన భారత్ కు లభించిన గౌరవం.
* మనుషులంతా సమానమే అని చాటి చెప్పిన అబ్రహం లింకన్ స్ఫూర్తిని ప్రపంచానికి అందించిన ఘనమైన దేశం అమెరికా. అలాంటి దేశ చట్టసభలో అరుదైన గౌరవం నాకిచ్చారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశ ప్రతినిధిగా.. అత్యంత ప్రాచీన ప్రజాస్వామ్య దేశమైన అమెరికాలో ప్రసంగిస్తున్నా.
*అమెరికా పర్యటనలో భాగంగా రెండు రోజుల క్రితం ఆర్లింగ్టన్ జాతీయ శ్మశాన వాటికకు వెళ్లాను. అక్కడ.. ఎందరో అమర వీరులైన సైనిక సమాధులను చూశాను. ప్రపంచం నలుమూలల ఎక్కడెక్కడో మానవాళికి సేవ చేసేందుకు వారు ప్రాణాలు ఆర్షించారు. ఈ నేల సాహిసికులకు.. స్వేచ్ఛకు నిలయం.
* భిన్నమైన చరిత్రలు.. సంస్కృతులు.. విశ్వాసాలు.. నమ్మకాల ఆధారంగా నిర్మితమైన దేశాలు మనవి. కానీ.. ప్రజాస్వామ్యం.. స్వేచ్ఛకు సంబంధించి మనది ఉమ్మడి లక్షణం. పౌరులంతా ఒక్కటే అన్న భావన పుట్టింది అమెరికా రాజ్యాంగం నుంచే. మా దేశ నిర్మాతలు సైతం ఇదే ఆశించి.. ఆచరించారు. భారత్ స్వాతంత్ర్యం పొందిన తొలినాళ్లలో.. ఇది ప్రజాస్వామ్య దేశంగా నిలబడుతుందా? అని చాలామంది సందేహించారు. చివరకు.. అలా శంకించిన వారే ఓడిపోయారు.
*భారత సరిహద్దుకు పశ్చిమం నుంచి ఆఫ్రికా వరకూ లష్కరే తోయిబా.. తాలిబాన్.. ఐసిస్ లాంటి విభిన్నమైన పేర్లు ఉన్నాయి. కానీ.. వారి సిద్దాంతం ఒక్కటే. విద్వేషం.. హత్య.. హింస. దాని నీడ ప్రపంచమంతా విస్తరించి ఉన్నప్పటికీ దానిని పెంచి పోషిస్తోంది భారత్ పొరుగునే. మానవాళిపై నమ్మకమున్న వారు ఉగ్రవాదంపై పోరాడటానికి ఒకటిగా ముందుకు రావాలి.
*ఆ మహమ్మారికి వ్యతిరేకంగా ఒకే గొంతుతో మాట్లాడాలి. రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని బోధించే వారికి.. ఆచరించే వారికి విస్పష్టమైన సందేశం పంపాలని అమెరికాకాంగ్రెస్ సభ్యుల్ని నేను కోరుతున్నా.
అంటూ ఆ దేశాన్ని పొగుడుతూనే మన దేశాన్ని ఎక్కడాకూడా తగ్గించకుండా మాట్లాడారు. అయితే ప్రధాని 45 నిమిషాలు మాట్లాడితే దాదాపు 40 నిమిషాల పాటు ప్రధాని ప్రసంగాన్ని అభినందిస్తూ చప్పట్లు కొడుతూనేఉండడం విశేషం. అంతేకాదు మోడీ ప్రసంగానికి వాళ్లు ఫిదా అయ్యారనడంలో ఎలాంటి సందేహం లేదు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.