మహానాడు వేదికగా మోత్కుపల్లి అసంతృప్తి
తెలుగుదేశం పార్టీలో ఉన్నఅసంతృప్తులు మహానాడు వేదికగా బయట పడ్డాయి. కొంతమంది లోలోపల బాధపడగా మరికొంతమంది బహిరంగంగానే బాబు వ్యవహార శైలిని విమర్శించారు. టీటీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు మాత్రం వేదికపైనుంచే తన ఆవేదనను వెల్లబోసుకున్నాడు. తనకు పార్టీలో అన్యాయం జరుగుతోందన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా.. నష్టాలు ఎదురైనా తాను పార్టీలో కొనసాగుతున్నానని, అయినా కూడా తనను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తో తనకు ఉన్న అనుబంధాన్ని ఎన్టీఆర్ ప్రోత్సహించిన తీరును మొదట మోత్కుపల్లి వివరించారు. ఆ తర్వాత ఎవరికిందా పనిచేయనని చంద్రబాబుకే విధేయుడిగా ఉంటానని తన విషయంలో వస్తున్న అసత్యప్రచారాన్ని నమ్మవద్దన్నారు. తనకు ఆరోగ్యం బాగుండడంలేదని ఎన్నాళ్ళు ఉంటానో తెలియదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు మిత్రుడే అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ కోసం ఆయనతో మొదటినుంచీ యుద్ధమే చేస్తున్నానన్నారు.
తాను ఏపీ వాడిననుకుంటే ఏపీ అని.. లేదు తెలంగాణ వాడిననుకుంటే తెలంగాణవాడినని అన్నారు మోత్కుపల్లి. మోత్కుపల్లి ఇంత ఆవేదనతో చేసిన కామెంట్ల వెనక చాలానే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రెండేళ్ల క్రితం మోత్కుపల్లికి గవర్నర్ గిరీ వచ్చేసినట్టేనని అందరూ భావించారు. గండిపేట తెలుగువిజయంలో జరిగిన ఆ మహానాడులో సాక్షాత్తు… చంద్రబాబే మోత్కుపల్లిని గవర్నర్ గారని సంబోధించినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఆయన దశ తిరిగినట్టేనని అందరూ అనుకున్నారు. మీడియాలో కూడా ఆ స్థాయిలో ప్రచారం జరిగింది. అయితే అదంతా ఉత్త ముచ్చటే అయ్యింది. ఆ తర్వాత చంద్రబాబు కూడా పెద్దగా పట్టించుకున్నట్టు కనపడలేదు. ఆ మాట వినపడలేదు. ఇక గవర్నర్ పదవిపై ఆశలు వదులుకున్న మోత్కుపల్లి… కనీసం రాజ్యసభ సీటైనా దొరుకుతుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారని, మోత్కుపల్లి మనసులో మాటలకు అర్థం అదేనని విశ్లేషకుల అభిప్రాయం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.