దీక్షను కొనసాగిస్తున్న ముద్రగడ
కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన సతీమణితో కలిసి రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో దీక్షను కొనసాగిస్తూనే ఉన్నారు. కాపు గర్జన సందర్భంగా తుని ఘటనలో నమోదైన కేసులను ఎత్తివేయాలని, అరెస్టు చేసిన అమాయకులను విడుదల చేయాలని చేపట్టిన దీక్షను భగ్నం చేయాలని పోలీసులు వాళ్లను ఆస్పత్రికి తరలించగా అక్కడ కూడా మంచినీళ్లు తీసుకోకుండా దీక్ష చేస్తున్నారు. దీక్షను విరమించి వైద్యం పొందడానికి సహకరించాలని పలు దఫాలుగా రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు చర్చలు జరిపినా ఆయన ససేమిరా అంటున్నారు. అంతేకాదు ఒకానొక దశలో అధికారులు బలవంతంగా ఆయనకు ప్లూయిడ్స్ ఎక్కించే ప్రయత్నం చేసినా ప్రతిఘటించారు. తన వద్దకు వస్తే ఆత్మహత్య చేసుకుంటానని, తలను గోడకేసి కొట్టుకుంటానని హెచ్చరించారు. ఆ మాటలు వినకుండా దగ్గరకు వస్తుండగా పక్కనే ఉన్న గోడకు తల కొట్టుకోవడంతో తలకు స్పల్ప గాయమైంది కూడా. మరోవైపు ముద్రగడ ఆరోగ్యంపై ప్రభుత్వం శ్రద్ధ వహించడంలేదన్న ఆరోపణలున్నాయి. హెల్త్ బులెటిన్లేవీ అధికారికంగా విడుదల చేయకపోవడంతో ముద్రగడ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముద్రగడ దీక్ష చేపట్టి ఇప్పటి రెండు రోజులు అయిందని, మంచి నీళ్లు కూడా తీసుకోకుండా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని కాపునాయకులు విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం కారణంగానే దీక్షచేయాల్సి వస్తోందని, కాపులను బీసీల్లో చేరుస్తామని ఒక్క మాట ఇంత గొడవలుఉండవు కదా అని వారు ప్రశ్నిస్తున్నారు. సర్కార్ ఎంతకూ స్పందించకపోవడం, ముద్రగడ అరెస్ట్‌ను నిరసిస్తూ కాపునాడు నేడు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందో లేదో చూడాలి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.