కాపులను ఐక్యం చేస్తున్న ముద్రగడ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు కాపులను బీసీల్లో చేరుస్తానని మాట ఇచ్చి నేటికీ నెరవేర్చకపోవడంతో కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం బాబుపై ఫైర్ అవుతున్నారు. అంతేకాదు చంద్రబాబుకు ఆగస్టు నెలవరకు డెడ్లైన్ కూడా పెట్టాడు. కాగా ఈ నేపథ్యంలో ముద్రగడ కాపులను అందరినీ ఒకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందులో భాగంగా కాపు నేతలను కలుస్తూ మద్దతు తెలపాలని కోరుతున్నారు. ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు, వైయస్ఆర్సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ తదితర నేతలతో మాట్లాడుతూ మద్దతు కూడగడుతున్నాడు. దాసరి, చిరంజీవి, రఘువీరారెడ్డి, బొత్స సత్యానారాయణలు మాట్లాడుతూ ముద్రగడ మంచి నాయకుడని, అతనిపై ఎలాంటి ఆరోపణలు లేవని, అంత మచి వ్యక్తి చేస్తున్న ఉద్యమానికి తమ మద్దతు ఖచ్చితంగా ఉంటుందని తేల్చి చెప్పారు.
రిజర్వేషన్లపై ఇచ్చిన హామీని ప్రభుత్వం గడువులోగా నెరవేర్చాలని లేదంటే భవిష్యత్ కార్యాచరణప్రకటిస్తామని ముద్రగడ స్పష్టం చేయడం, కాపు నాయకులు కూడా ఆయన ఉద్యమానికి మద్దతుతెలుపుతుండడంతో చంద్రబాబుకు గుబులు మొదలైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇచ్చిన హామీని సర్కార్ నిలబెట్టుకోకపోతే ఇది మరో పటేళ్ల ఉద్యమం లాగా తయారైనా ఆశ్చర్య పోనవసరం లేదని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ కాపుల ఉద్యమం మాత్రం సర్కార్కు పెద్ద సవాల్ మారిందని, ప్రభుత్వం స్పందించకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వారంటున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.