నన్ను దోచుకొందువటే!
నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని…అను ఈ పాట గులేబకావళి కథ (1962) అను సినిమాలోనిది. ఇందులో ఎన్.టి. రామారావు మరియు జమున కలిసి నటించారు. ఈ సినిమాలోని పాటలన్నీ దాదాపుగా ఘంటసాల మరియు పి.సుశీల గారు కలిసి ఆలపించారు.డా.సి.నారాయణరెడ్డి గారు ఈ సినిమా పాటలకు సాహిత్యాన్ని అందించారు. ఇదే ఆయనకు మొదటి సినిమా పాట.
******
పల్లవి:
నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని …
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి …. నిన్నే నా స్వామి
నన్ను దోచుకొందువటే………
చరణం 1 :
ఆమె:
తరియించును నీ చల్లని చరణమ్ముల నీడలోన
తరియించును నీ చల్లని చరణమ్ముల నీడలోన
పూల దండవోలే …కర్పూర కళికవోలె… కర్పూర కళిక వోలె…
అతడు:
ఎంతటి నెరజాణవు… నా అంతరంగమందు నీవు
ఎంతటి నెరజాణవు… నా అంతరంగమందు నీవు
కలకాలము వీడని సంకెలలు వేసినావు…సంకెలలు వేసినావు
నన్ను దోచుకొందువటే………
నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని …
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి …. నిన్నే నా స్వామి
చరణం 2 :
ఆమె:
నా మదియే మందిరమై… నీవే ఒక దేవతవై
నా మదియే మందిరమై… నీవే ఒక దేవతవై
వెలసినావు నాలో నే కలిసిపోదు నీలో….కల్సిపోదు నీలో
అతడు:
ఏనాటిదో మమ బంధం….. ఎరుగరాని అనుబంధం
ఏనాటిదో మమ బంధం….. ఎరుగరాని అనుబంధం
ఎన్ని యుగాలైనా ఇది ఇగిరిపోని గంధం….ఇగిరిపోని గంధం…
నన్ను దోచుకొందువటే………
నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని …
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి …. నిన్నే నా స్వామి
నన్ను దోచుకొందువటే………
ఈ పాటను ఇక్కడ https://www.youtube.com/watch?v=2jFBttCqWlE వినండి!
****
కమనీయ కవితామూర్తి’సినారె’
‘సినారె’ గా ప్రసిద్ధి చెందిన శ్రీ సింగిరెడ్డి నారాయణరెడ్డి గారు 29 -07 -1931 వ తేదీన కరీంనగర్ జిల్లాలోని హనుమాన్జీపేటలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు.చిన్నతనం నుండి విద్యయందు అమిత ఆసక్తి కలవాడగుట చేత కష్టపడి తెలుగు సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ సంపాదించటమే కాకుండా,Ph.D పట్టా కూడా పొంది డాక్టర్.సి.నారాయణరెడ్డిగా ప్రసిద్ధి గాంచారు.ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చాలా కాలం ప్రొఫెసర్ గా పనిచేశారు.వీరికి ఉర్దూ భాషలో కూడా ప్రావీణ్యం వుంది.తెలుగులో అనేక గేయ కావ్యాలు రచించారు.కొన్ని గ్రంధాలకి కేంద్ర సాహిత్య అకాడెమి వారి బహుమతులు కూడా లభించినవి.1988 లో, తెలుగు భాషకు చేసిన సేవకు గుర్తింపుగా జ్ఞానపీఠం వారి బహుమతి కూడా పొందారు.రెండు విశ్వవిద్యాలయాలకు ఉప కులపతిగా కూడా పని చేశారు.1997 లో రాజ్యసభ సభ్యుని గా nominate చేయపడ్డారు.నారాయణరెడ్డిగారు వారి శ్రీమతి సుశీలగారి పేరు మీదుగా ప్రతి ఏడాది ఉత్తమ తెలుగు రచయిత్రులను సత్కరిస్తున్నారు.నారాయణ రెడ్డిగారికి నలుగురు కుమార్తెలు.వారి పేర్లు,గంగ,యమున,సరస్వతి,కృష్ణవేణి.అందరికీ వివాహములై,కొందరు విదేశాలలో స్థిర పడ్డారు.ఆంద్రవిశ్వవిద్యాలయంవారు వీరిని కళాప్రపూర్ణ బిరుదుతోనూ,కేంద్ర ప్రభుత్వంవారు పద్మశ్రీ బిరుదుతోను సత్కరించారు.వీరు వ్రాసిన కావ్యాలలో ప్రసిద్ధి గాంచినవి–ఋతుచక్రం,కర్పూర వసంత రాయలు,విశ్వంభర,ప్రపంచపదులు,గదిలో సముద్రం,సప్తతి ఒక లిప్తగా,ఏవీ ఆ జీవ నదులు? మొదలుగునవి.శ్రీ.N.T.Rama Rao గారి ఆహ్వానం మేరకు వారి ఆస్థానంలో విశిష్ట స్థానం పొందారు.వారి మొదటి సినిమా పాట ‘నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని’అనేది.అది శ్రీ.N.T.Rama Rao గారి సొంత సినిమా అయిన ‘గులేబకావళికథ’అనే సినిమా లోనిది.అప్పటినుండి ఒక ప్రక్క తనకు యిష్టమైన ఉపన్యాస వృత్తిని కొనసాగిస్తూనే,సినిమాలకు పాటలు కూడా వ్రాసేవారు.రమారమి 3000 చిలుకు పైనే సినిమా పాటలు వ్రాశారు.వారు వ్రాసిన అన్ని పాటలు అద్భుతంగా వుంటాయి.వారి గేయాలు వారే కొన్ని పాడుకున్నారు,అందులో ముఖ్యమైనది’ప్రపంచ పదులు’.చక్కగా పాడుతారు.వారు వ్రాసిన చాలా గజల్స్ ద్వారానే గాయకుడు శ్రీనివాస్ ‘గజల్ శ్రీనివాస్’ గా ప్రఖ్యాతి కావటమే కాకుండా దేశ విదేశాలలో నారాయణరెడ్డిగారి కవితా ఝరిని ప్రవహింప చేశారు.80 సంవత్సరాల వయస్సులో కూడా చక్కగా ఆరోగ్యం కాపాడుకుంటున్నారు.వారి పాటల లాగే వారూ అందగాడే!తెలుగు పంచెకట్టు,పైన కండువా–నిలువెత్తు తెలుగుతనం వుట్టిపడేటట్లు వుంటుంది వీరి రూపం.చక్కని వక్త.ఒకసారి ‘రవీంద్ర భారతి’వేదిక మీద షుమారు గంటకు పైగా నిలబడి ప్రసంగించారు.(మనకు కూర్చొని వినటానికే ఓపిక వుండదు)వారు వేదిక దిగగానే గబగబా వారివద్దకు ఆత్రుతతో వెళ్లి ‘ మీ ఆరోగ్య రహస్యం ఏమిటండీ?’ అని ప్రశ్నించగానే వారు యిలా చెప్పారు”ఒకటి నడక,రెండవది నడత”.వారిని మనసారా అభినందించి ఆనందంతో యింటికి వెళ్లాను.
ఆ కమనీయ కవితా మూర్తి నిండు నూరేండ్లు ఆరోగ్యంతో ఆనందంగా జీవించాలని భగవంతుని మనసారా ప్రార్ధిస్తూ, అభినందనలు తెలియ చేయుచూ ముగిస్తున్నాను!
టీవీయస్. శాస్త్రి
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.