విజయదశమికి కొత్త జిల్లాల ఏర్పాటు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న జిల్లాలకంటే తెలంగాణలో జిల్లాలు ఎక్కువగా ఉండబోతున్నాయా? ప్రస్తుతం ఉన్న 10 జిల్లాలు కాస్తా 24 జిల్లాలకు పెరగనున్నాయా? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. దానిపై ఆయన ఓ క్లారిటీ కూడా ఇచ్చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఈ నెల మూడో వారంలో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ప్రతిపాదనలు అఖిలపక్షం ముందు పెట్టడంతో పాటు ప్రజలందరి నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు కేసీఆర్ చెప్పారు. అనంతరం కొత్త జిల్లాలను ప్రకటిస్తామని అంటున్నారు. కాగా దసరాకు తెలంగాణ 24 జిల్లాల రాష్ట్రంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం పది జిల్లాలు ఉండగా..తెలంగాణ సర్కారు కొత్తగా 14 జిల్లాలను ఏర్పాటు చేయనుంది. అంటే ఉమ్మడి రాష్ట్రం కంటే ఒక జిల్లా ఎక్కువతో కొత్త తెలంగాణ ఏర్పడబోతుందున్నట మాట. అక్టోబర్ 11 (విజయదశమి) నుంచి కొత్త జిల్లాలు ఏర్పాడతాయని సీఎం కేసీఆర్ ఇప్పటికే చెప్పారు కూడా.
జిల్లాల ఏర్పాటుపై అన్ని వర్గాల నుంచి వచ్చే ప్రతిపాదనలు చర్చించి, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు కేబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం మహముద్ అలీ అధ్యక్షతన మంత్రులు కడియం శ్రీహరి, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. దీనికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలు జారీ చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌కు ముందు కేబినేట్, అఖిలపక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. డ్రాఫ్ట్ విడుదలైన తర్వాత అభ్యంతరాలు, సూచనలకు నెల రోజుల గడువు ఇవ్వనున్నట్లు కేసీఆర్ చెప్పారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.