కాషాయ దళంలో కొత్త జోష్
తెలంగాణలో భారతీయ జనతా పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. దీనంతటికీ కారణం ప్రధాని నరేంద్ర మోడీనేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. విషయమేమిటంటే మొన్న ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి రావడంతో తెలంగాణలో కొత్త అధ్యాయం మొదలైందని వారంటున్నారు. కాగా బీజేపీ ఎల్బీస్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ తన సభకు వేలసంఖ్యలో వచ్చినవారు ఓటర్లు మాత్రమే కాదని – బీజేపీ జెండా మోసే కార్యకర్తలని – మిమ్మల్ని చూస్తుంటే నాకు తెలంగాణ భవిష్యత్ కనిపిస్తోందని బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి అన్నమాటలతో ఒక్కసారిగా సభ చప్పట్లతో మార్మోగిపోయింది. అదేసమయంలో తెలంగాణ విమోచన దినాన్ని ప్రస్తావించిన మోడీ.. సెప్టెంబరు 17 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అంటే పరోక్షంగా తెలంగాణ ప్రజలను ఆకట్టుకునేందుకు విమోచన దినాన్ని నిర్వహించాలని బీజేపీకి దిశానిర్దేశం చేశారు.
ఇక – ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ద్విచక్రవాహనాలతో ర్యాలీ నిర్వహించాలని తిరంగా యాత్ర చేయాలని ఆయన సూచించారు. దీనిద్వారా యువతను బీజేపీ వైపు మళ్లించాలనేది మోడీ యోచనగా భావించవచ్చు. ముఖ్యంగా ఆయన చేసిన సూచనల్లో విమోచన దినం తెలంగాణ బీజేపీకి ప్లస్ పాయింట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో తెలంగాణలో సగానికి పైగా అసెంబ్లీ సీట్లలో పాగా వేయాలని బీజేపీ నేతలు ప్లాన్ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మోడీ పరోక్షంగా చేసిన దిశా నిర్దేశం వారిలో కొత్త ఆక్సిజన్ నింపినట్లయింది. మరి భవిష్యత్తులో ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తారో చూడాలి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.